Bangladesh: బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహాబుద్దీన్ రాజీనామా.. ఫోన్ సంభాషణే కారణమా?

  • బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహాబుద్దీన్ రాజీనామా
  • లండన్ పర్యటనలో వివాదాస్పద ఫోన్ కాల్
  • రెండేళ్ల ముందే పదవికి రాజీనామా
Bangladesh

Bangladesh

బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షహాబుద్దీన్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. తన పదవీకాలం ముగియడానికి దాదాపు రెండేళ్ల ముందే రాజీనామా చేశారు. ఆరోగ్య సమస్యల కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే పదవి నుంచి తప్పుకోవడానికి మాజీ ప్రధాని షేక్ హసీనాతో జరిపినట్లు ప్రచారంలో ఉన్న ఫోన్ సంభాషణే ప్రధాన కారణమనే వార్తలు బంగ్లాదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

స్థానిక మీడియాతో మాట్లాడిన షహాబుద్దీన్.. “నేను పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. అందుకే రాజీనామా చేశాను. ప్రస్తుతం దీనిపై అంతకుమించి చెప్పడానికి ఏమీ లేదు” అని తెలిపారు. అనంతరం తన రాజీనామా లేఖను బంగాభవన్ (అధ్యక్ష భవన్) నుంచి పార్లమెంట్‌కు పంపినట్లు బంగ్లాదేశ్ మీడియా వెల్లడించింది.

షేక్ హసీనాతో సంభాషణే కారణమా?

ఈ ఏడాది మే నెలలో వైద్య చికిత్స కోసం లండన్ వెళ్లిన షహాబుద్దీన్ అక్కడ ఉన్న సమయంలో భారత్‌లో నివసిస్తున్న మాజీ ప్రధాని షేక్ హసీనాతో మాట్లాడినట్లు వార్తలు వెలువడ్డాయి. మే 9న లండన్ వెళ్లిన ఆయన మే 18న తిరిగి బంగ్లాదేశ్‌కు చేరుకున్నారు. 2024 ఆగస్టులో విద్యార్థుల ఉద్యమాల నేపథ్యంలో అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోవడంతో షేక్ హసీనా భారత్‌కు వెళ్లి అక్కడే ఉంటున్నారు. ఆమెతో అధ్యక్షుడు మళ్లీ సంబంధాలు ఏర్పరుచుకునే ప్రయత్నం చేశారనే సమాచారం ప్రభుత్వం, నిఘా సంస్థలకు చేరినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే షహాబుద్దీన్‌పై ఒత్తిడి రావడానికి కేవలం ఫోన్ సంభాషణ మాత్రమే కారణం కాదని, బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, షేక్ హసీనా తిరిగి దేశానికి వస్తానని ప్రకటించడం కూడా కీలక అంశాలుగా మారాయని బీఎన్‌పీ నాయకులు వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి.

రాజీనామా తర్వాత ఏం జరుగుతుంది?

అధ్యక్షుడి రాజీనామాతో బంగ్లాదేశ్ రాజ్యాంగ ప్రక్రియ ప్రారంభమైంది. కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగే వరకు జాతీయ పార్లమెంట్ స్పీకర్ హఫీజ్ ఉద్దీన్ అహ్మద్ తాత్కాలికంగా అధ్యక్షుడి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. బంగ్లాదేశ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 54 ప్రకారం అధ్యక్ష పదవి ఖాళీ అయినప్పుడు లేదా అధ్యక్షుడు విధులు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడితే స్పీకర్ తాత్కాలికంగా ఆ బాధ్యతలు చేపడతారు. అలాగే ఆర్టికల్ 123(2) ప్రకారం అధ్యక్షుడి రాజీనామా, మరణం లేదా పదవి నుంచి తొలగింపు జరిగిన 90 రోజుల్లోపు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. ప్రస్తుతం పార్లమెంట్‌లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP)కి మెజారిటీ ఉండటంతో కొత్త అధ్యక్షుడి ఎంపికలో ఆ పార్టీ కీలక పాత్ర పోషించనుంది.

షహాబుద్దీన్ రాజకీయ ప్రస్థానం

మొహమ్మద్ షహాబుద్దీన్ 2023 ఏప్రిల్ 24న బంగ్లాదేశ్ 22వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అవామీ లీగ్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకు ప్రత్యర్థులు లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే ముందు జిల్లా, సెషన్స్ జడ్జిగా పనిచేసిన ఆయన 2006లో న్యాయవ్యవస్థ నుంచి పదవీ విరమణ చేశారు. అనంతరం 2011 నుంచి 2016 వరకు అవినీతి నిరోధక కమిషన్ కమిషనర్‌గా సేవలందించారు. 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో పాల్గొన్న ఆయన అవామీ లీగ్‌లో పలు కీలక బాధ్యతలు కూడా నిర్వహించారు.

హసీనా ప్రభుత్వం పతనం తర్వాత ఒత్తిడి

2024లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత నుంచి షహాబుద్దీన్ పదవిపై వివాదాలు కొనసాగుతున్నాయి. విద్యార్థి సంఘాలు, పలు రాజకీయ సంస్థలు ఆయనను తొలగించాలని డిమాండ్ చేశాయి. అయితే రాజ్యాంగ పరిమితులను దృష్టిలో ఉంచుకుని మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆయనను పదవి నుంచి తొలగించలేదు. 2026 పార్లమెంట్ ఎన్నికల్లో బీఎన్‌పీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అధ్యక్షుడి మార్పుపై మళ్లీ చర్చ మొదలైంది. చివరకు పదవీకాలం ముగియకముందే షహాబుద్దీన్ రాజీనామా చేయడంతో బంగ్లాదేశ్‌లో కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది.