Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్‌మీట్‌పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!

  • షేక్ హసీనా ప్రెస్‌మీట్‌పై బంగ్లాదేశ్ అభ్యంతరం
  • తమకేమీ సంబంధం లేదన్న భారత్
  • రేపు ప్రపంచ వ్యాప్తంగా వీక్షించనున్న ప్రెస్‌మీట్
Sheikh Hasina

Sheikh Hasina

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రేపు బహిరంగ వేదికపైకి రానున్నారు. రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన షేక్ హసీనా భారత్‌లో తలదాచుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు బహిరంగంగా కనిపించలేదు. అయితే త్వరలోనే బంగ్లాదేశ్‌కు వెళ్లిపోతానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేయొచ్చని వార్తలు వస్తు్న్నాయి.

అయితే ఆగస్టు 5న షేక్ హసీనా నిర్వహించే మీడియా సమావేశంపై బంగ్లాదేశ్ అభ్యంతరం తెలపగా.. దానిని ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహిస్తోందని, ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని భారత్ పేర్కొంది.

ఇదిలా ఉంటే దాదాపు రెండేళ్ల తర్వాత మీడియా ముందుకు రాబోతున్న షేక్ హసీనా కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియా నిర్వహిస్తోంది. ఈ చర్యను బంగ్లాదేశ్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాజకీయ కార్యకలాపాల కోసం గానీ, బంగ్లాదేశ్‌ను అస్థిరపరిచే కార్యకలాపాల కోసం గానీ మాజీ ప్రధాని షేక్ హసీనాను గానీ, అవామీ లీగ్‌తో సంబంధం ఉన్న ఎవరినీ భారత గడ్డను ఉపయోగించుకోవడానికి అనుమతించవద్దని బంగ్లాదేశ్ భారత్‌ను కోరింది.

ఈ విషయంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పుడు స్పందించింది. ఆగస్టు 5న న్యూఢిల్లీలో జరగనున్న ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియా కార్యక్రమంలో షేక్ హసీనా పాల్గొననున్న విషయంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ‘‘మీరు ప్రస్తావిస్తున్న కార్యక్రమాన్ని ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహిస్తోంది. ఇందులో భారత ప్రభుత్వానికి ఏమాత్రం ప్రమేయం లేదు. ఆ కార్యక్రమంలో వ్యక్తపరిచిన ఏ అభిప్రాయాలనూ ఆమోదించదు.’’ అని అన్నారు.

షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ మరోసారి డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ సలహాదారు జాహీద్ ఉర్ రెహమాన్ మాట్లాడుతూ.. హసీనా తిరిగి వచ్చి చట్టాన్ని ఎదుర్కోవాలని, భారతదేశంలో ఉన్నప్పుడు ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయకుండా ఉండాలని పేర్కొన్నారు. ఈ విషయమై బంగ్లాదేశ్ భారత్‌కు లేఖ రాసిందని, భారత హైకమిషనర్‌తో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించిందని ఆయన తెలిపారు. ఆయన ప్రకారం… ఒకవేళ హసీనా తిరిగి వస్తే, ఆమెను అరెస్టు చేసి, తన చట్టపరమైన హక్కులన్నింటినీ వినియోగించుకునే అవకాశం ఇస్తారు. ఆ తర్వాత కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ఆగస్టు 5న ఢిల్లీలో జరగనున్న హసీనా కార్యక్రమానికి ఒక రోజు ముందు ఈ ప్రకటన వెలువడింది. హసీనా గానీ, నిషేధిత సంస్థలతో సంబంధం ఉన్న మరెవరైనా గానీ రాజకీయ ప్రకటనలు చేయడానికి లేదా బంగ్లాదేశ్‌ను అస్థిరపరిచే కార్యకలాపాలలో పాల్గొనడానికి భారత గడ్డను ఉపయోగించకుండా చూడాలని  భారత్‌ను కోరింది.