Bangladesh: బంగ్లాదేశ్ మరోసారి అట్టుడుకుతోంది. మరోసారి నిరసనలు తీవ్ర హింసకు దారితీశాయి. కార్మికులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. పోలీసులపై దాడులు, రాళ్లదాడులు, వాహనాలుకు నిప్పుపెట్టడం వంటి చర్యలకు పాల్పడ్డారు. పలు ప్రాంతాల్లో రోడ్లను దిగ్బంధించారు. వేతనాల పెంపును డిమాండ్ చేస్తూ గార్మెంట్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు ఈ నిరసనలకు దిగారు. కనీస వేతనాన్ని పెంచాలని కోరతున్నారు.
షేక్ హసీనా తర్వాత మళ్లీ హింస..
2024 జూలైలో అప్పటి ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీవ్ర హింసాత్మక ఆందోళనలు జరిగాయి. దాదాపు 28 నెలల తర్వాత మరోసారి బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్టోబర్ 31న ఈ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. . ఢాకాలోని మిర్పూర్, ఆశులియా, సావర్, గాజీపూర్ వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు రహదారులను దిగ్బంధించి గార్మెంట్ ఫ్యాక్టరీలను మూసివేయించారు. నిరసనలు, సమ్మెల కారణంగా సుమారు 529 ఫ్యాక్టరీలు ప్రభావితమయ్యాయి. దాదాపు 10 లక్షల మంది కార్మికులపై దీని ప్రభావం ఉంది.
నిరసనల్లో పాల్గొన్న కార్మికులు పోలీసులతో ఘర్షణకు దిగారు. పోలీస్ వాహనాలకు నిప్పుపెట్టడంతో పాటు విధ్వంసం సృష్టించారు. నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కేనన్లు, సౌండ్ గ్రెనేడ్లు వాడారు. పరిస్థితిని అదుపు చేసేందుకు కొన్ని ప్రాంతాల్లో బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (BGB) బలగాలను కూడా మోహరించారు. సోమవారం ఫ్యాక్టరీలు తిరిగి ప్రారంభమవుతాయని భావించినప్పటికీ, పరిస్థితి అదుపులోకి రాలేదు, కార్మికులు మళ్లీ రోడ్లపైకి రావడంతో ఢాకాలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.
జీతం కోసం పోరాటం..
బంగ్లాదేశ్‌లో గార్మెంట్ కార్మికులు నెలకు కనీస వేతనంగా 30,000 టాకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం వారికి సుమారు 12,000 టాకాల వేతనం అందుతోందని తెలుస్తోంది. ఆహారం, ఇంటి అద్దె, రవాణా, వైద్య ఖర్చులు పెరగడంతో తమ కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గిందని కార్మికులు చెబుతున్నారు. ఈ చాలీచాలన జీతంతో కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారిందని వాపోతున్నారు.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న నిరసనలు, అశాంతి వెనక షేక్ హసీనా ప్రభుత్వంతో సంబంధం ఉన్న పారిశ్రామికవేత్తల హస్తం ఉందని బంగ్లాదేశ్ ఆరోపిస్తోంది. నవంబర్ 2న హోంమంత్రి సలాహుద్దీన్ అహ్మద్ మాట్లాడుతూ, అవామీ లీగ్‌తో సంబంధాలున్న కొందరు ఫ్యాక్టరీ యజమానులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, సహాయ మంత్రులు గార్మెంట్ పరిశ్రమలో అస్థిరతను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు.
బంగ్లాదేశ్ దుస్తులకు మంచి గిరాకీ..
ప్రపంచంలోని ప్రముఖ వస్త్ర ఎగుమతిదారుల్లో బంగ్లాదేశ్ రెండో స్థానంలో ఉందని, చైనా తర్వాతి స్థానంలో ఉంది. ఈ దేశానికి విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించడంతో ఈ రంగం కీలకంగా ఉంది. యూరప్, అమెరికాలతో సహా అంతర్జాతీయ మార్కెట్లలో బంగ్లాదేశీ తయారీ దస్తులకు మంచి గిరాకీ ఉంది. టీ-షర్టులు, షర్టులు, ట్రౌజర్లు, జీన్స్, జాకెట్లు వంటి రెడీమేడ్ దుస్తులను ఇక్కడి ఫ్యాక్టరీల్లో తయారు చేస్తారు. ఈ పరిశ్రమలో లక్షలాది మంది పనిచేస్తుండగా, వారిలో మహిళల సంఖ్య కూడా గణనీయంగా ఉంది.

