Guinness World Record: ముక్కు నేలకు తాకేలా హ్యాండ్‌స్టాండ్ పుష్‌అప్స్.. మహిళ గిన్నిస్‌ రికార్డు..

Handstand Push Ups

Handstand Push Ups

Guinness World Record: పుష్‌అప్స్‌ చేయడమే చాలా మందికి కష్టంగా ఉంటుంది.. ఇక, చేతులపై నిలబడి పుష్‌అప్స్‌ చేయడం అంటే.. ఎంతో కృషి, పట్టుదల ఉండాలి.. అదే హ్యాండ్‌స్టాండ్‌ పుష్‌అప్స్‌తో ముక్కు నేలకు తాకేలా చేస్తే.. అది రికార్డే మరి.. ఆస్ట్రియాకు చెందిన స్టెఫానీ మిల్లింగర్ అసాధారణ ఫీట్‌తో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. ఒక్క నిమిషంలో అత్యధిక నోస్-టు-గ్రౌండ్ హ్యాండ్‌స్టాండ్ పుష్‌అప్స్ చేసిన మహిళగా ఆమె రికార్డు సాధించారు. కేవలం 60 సెకన్లలో ఏకంగా 12 పుష్‌అప్స్ పూర్తి చేసి ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు.

నోస్-టు-గ్రౌండ్ హ్యాండ్‌స్టాండ్ పుష్‌అప్స్ అంటే..?
ఈ రికార్డులో భాగంగా చేతులపై తలకిందులుగా నిలబడి పుష్‌అప్స్ చేయాలి. ప్రతి రిపిటిషన్‌లో ముక్కు నేలకు చాలా దగ్గరగా వచ్చేలా శరీరాన్ని కిందికి దించి, తిరిగి పైకి లేపాలి. ఈ ప్రక్రియను ఒక నిమిషంలో అత్యధికసార్లు పూర్తి చేయడమే రికార్డు ప్రమాణం.

60 సెకన్లలో 12 పుష్‌అప్స్
స్టెఫానీ మిల్లింగర్ ఒక నిమిషంలో 12 నోస్-టు-గ్రౌండ్ హ్యాండ్‌స్టాండ్ పుష్‌అప్స్ పూర్తి చేశారు. ఈ ప్రదర్శనకు అసాధారణమైన శారీరక బలం మాత్రమే కాకుండా శరీర సమతుల్యత, నియంత్రణ, ఓర్పు కూడా అవసరం. ఆమె సాధించిన ఈ ఘనతను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నమోదు చేసింది. స్టెఫానీకి ఇది తొలి రికార్డు కాదు. బలం, సమతుల్యత, ఓర్పు వంటి విభాగాల్లో ఆమె ఇప్పటికే అనేక రికార్డులు సాధించారు. తాజా గిన్నిస్ రికార్డు ఆమె రికార్డ్ బ్రేకింగ్ ప్రయాణంలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.

16 ఏళ్లు పైబడిన వారికే అవకాశం
ఈ రికార్డు టైటిల్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తుల వయసు కనీసం 16 సంవత్సరాలు ఉండాలి. కఠినమైన ప్రమాణాల మధ్య ఒక్క నిమిషంలో 12 పుష్‌అప్స్ పూర్తి చేయడం స్టెఫానీ శారీరక సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచింది.

సోషల్ మీడియాలో ప్రశంసలు
స్టెఫానీ చేసిన అద్భుతమైన ప్రదర్శన సోషల్ మీడియాలోనూ విపరీతంగా ఆకట్టుకుంది. ఆమె నైపుణ్యాన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “చాలా అద్భుతంగా ఉంది”, “ఇది అంత సులభమైన పని కాదు” అంటూ ప్రశంసలు కురిపించారు. మరో నెటిజన్ సరదాగా “ఆమెతో ఎప్పుడూ గొడవ పెట్టుకోకూడదని గుర్తు చేయండి” అంటూ కామెంట్ చేశారు. మొత్తంగా స్టెఫానీ మిల్లింగర్ తాజా గిన్నిస్ రికార్డు అసాధారణమైన బలం, బ్యాలెన్స్, పట్టుదలతో ఏ స్థాయికి చేరుకోవచ్చో చూపించింది. ఆమె ప్రదర్శన ప్రపంచవ్యాప్తంగా ఫిట్‌నెస్‌ ప్రియులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.