Site icon NTV Telugu

Solar Storm: సూర్యుడిపై భారీ పేలుడు.. భూమి వైపు దూసుకువస్తున్న ‘‘సౌర తుఫాన్’’

Solar Storm

Solar Storm

Solar Storm: సూర్యుడి నుంచి మరో శక్తివంతమైన ‘‘సౌర తుఫాన్’’ భూమి వైపుగా దూసుకువస్తోంది. ఇది రేడియో బ్లాక్అవుట్, అరోరా బొరియాలిస్ లేదా నార్తర్న్ లైట్లకు దారి తీస్తుంది. నాసా spaceweather.com ప్రకారం, మే 27న సన్‌స్పాట్ AR3664 నుంచి ఈ తుఫాన్ ఉద్భవించింది. ఇది X2.8 తరగతిగా వర్గీకరించారు. ఇది ఇటీవల సంవత్సరాల్లో అత్యంత తీవ్రమైన సౌర సంఘటనగా మారింది. ఎక్స్-తరగతికి చెందిన సౌరజ్వాలలు చాలా శక్తివంతమైనవి. వీటిని ‘‘కరోనల్ మాస్ ఎజెక్షన్స్(CME)’’ గా పిలుస్తుంటారు. ‘‘శక్తి, కాంతి, అధిక వేగం వచ్చే కణాలను అంతరిక్షంలోకి పంపే భారీ పేలుళ్లు’’గా నాసా వీటిని అభివర్ణించింది. సౌర తుఫాను కారణంగా భూమి ఇప్పటికే షార్ట్ వేవ్ రేడియాలో అంతరాయాన్ని ఎదుర్కొంది.

సూర్యుడిపై భారీ పేలుళ్లు ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్ వెలువడటానికి కారణమైంది. సౌర తుఫాను కాంతి వేగంతో భూమి వైపు ప్రయాణిస్తుంది మరియు అది మనకు చేరుకున్నప్పుడు గ్రహం యొక్క వాతావరణం యొక్క పైభాగాన్ని అయనీకరణం ( ఎలక్ట్రిక్ ఛార్జ్) చేస్తుంది. ఈ ఆవేశిత కణాలు తాకిన తర్వాత, రేడియో ఫ్రీక్వెన్సీలోని ఎలక్ట్రాన్లు ఢీకొట్టుకోవడం ఎక్కువ అవుతుంది. దీంతో సిగ్నల్స్ క్షీణించి కమ్యూనికేషన్ వ్యవస్థ అంతరాయాన్ని ఎదురవుతుంది. ప్రస్తుతం విస్పోటనం జరిగిన సూర్యుడిపై ఉన్న AR3664 ప్రాంతం జూన్ 6న భూమికి అభిముఖంగా వస్తుంది. ఆ సమయంలో మరో భూ అయస్కాంత తుఫానును సృష్టించే అవకాశం ఉంది.

Read Also: Weapon Trailer Launch: ‘అది ఆట కాదు.. యుద్ధం..’ సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న ‘వెపన్’..

ప్రస్తుతం సూర్యుడు తన జీవితంతో 25వ ‘‘సౌరచక్రం’’లో ఉన్నాడు ప్రతీ 11 ఏళ్లకు సూర్యుడి ధృవాలు మారుతుంటాయి. ఈ సమయంలో సూర్యడి వాతావరణం చాలా క్రియాశీలకంగా ఉంటుంది. భారీ గురుత్వాకర్షణ శక్తి కారణంగా సన్‌స్పాట్స్ ఏర్పడుతుంటాయి. వీటి నుంచి ఒక్కసారిగా పేలుళ్లు జరిగి అయస్కాంత క్షేత్రాలు, ప్లాస్మా సౌర కుటుంబంలోకి ఎగిసిపడుతుంది. ఇది ప్రయాణిస్తూ గ్రహాల వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి.

అయితే, భూమికి ఉండే వాతావరణం విశ్వం నుంచి వచ్చే అనేక ఆవేశిత కణాల నుంచి భూమిని రక్షిస్తోంది. ముఖ్యంగా సూర్యుడి నుంచి వచ్చే సౌరజ్వాలలు, సౌర తుఫానులను భూమికి ఉండే అయస్కాంత క్షేత్రం అడ్డుకుంటుంది. ప్రమాదకరమైన కిరణాలు భూమిని తాకకుండా కాపాడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరిగే సందర్భంలో పవర్ ఫుల్ మాగ్నిటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. ఇది భూమి చుట్టూ ఆవరించి ఉంటుంది. ఇలా సౌర తుఫానులు భూమిని తాకగానే భూ అయస్కాంత తుఫానులు(జియోమాగ్నెటిక్ స్ట్రోమ్స్) ఏర్పడుతాయి. ధృవాల వద్ద అరోరాలు ఏర్పడుతాయి. కొన్ని సందర్భాల్లో మాత్రం కమ్యూనికేషన్ వ్యవస్థ, శాటిలైట్లు, విద్యుత్ గ్రిడ్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది.

Exit mobile version