Site icon NTV Telugu

Bangladesh: బంగ్లాదేశ్‌లో ఆగని హత్యలు.. మరో హిందువు ప్రాణాలు తీశారు..

Horrific Murder Medipally

Horrific Murder Medipally

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు ఆగడం లేదు. తాజాగా మరో హిందూ వ్యాపారవేత్తను గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటన స్థానిక హిందూ సమాజంలో తీవ్ర భయాందోళనలకు కారణమవుతోంది. సోమవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో నర్సింగ్డి జిల్లా పలాష్ ఉప జిల్లా పరిధిలోని చార్సింధుర్ మార్కెట్‌లో ఈ దారుణం జరిగింది. అక్కడ కిరాణా దుకాణం నిర్వహిస్తున్న 40 ఏళ్ల మోని చక్రవర్తి.. దుకాణం మూసివేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా దుండగులు పదునైన ఆయుధంతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన మోని చక్రవర్తి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

Read Also: Trivikram Srinivas: తండ్రిని కాదని ఆ డైరెక్టర్ వద్ద చేరిన త్రివిక్రమ్ కొడుకు..

స్థానికులు వెంటనే అతన్ని సమీపంలోని పలాష్ ఉపజిల్లా ఆరోగ్య కేంద్రానికి తరలించినప్పటికీ, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పలాష్ పోలీస్ స్టేషన్ ఓసీ షాహిద్ అల్ మామున్ ఈ హత్యను ధృవీకరించారు. మృతుడు శిబ్పూర్ ఉపజిల్లాలోని సాధుచార్ యూనియన్‌కు చెందినవాడిగా గుర్తించారు. మోని చక్రవర్తి గత కొన్ని సంవత్సరాలుగా అదే మార్కెట్‌లో కిరాణా వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, నిందితుల వివరాలు ఇంకా తెలియరాలేదు. హత్య జరిగిన ప్రాంతంలో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఇదే రోజున జెస్సోర్ జిల్లాలో హిందూ వ్యాపారవేత్త, పత్రికా సంపాదకుడు రాణా ప్రతాప్ బైరాగి కాల్చి చంపబడిన ఘటన జరిగిన కొన్ని గంటలకే ఈ హత్య చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.

గత కొన్ని వారాలుగా బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి. డిసెంబర్ 18న దీపు చంద్ర దాస్‌ను మైమెన్‌సింగ్ జిల్లాలో కొట్టి చంపగా, డిసెంబర్ 25న అమృత్ మండల్ హత్యకు గురయ్యాడు. జనవరి 11న చిట్టగాంగ్‌లో ఆటో డ్రైవర్ సమీర్ దాస్‌ను దుండగులు కత్తితో పొడిచి చంపిన ఘటన కూడా సంచలనం సృష్టించింది. గత 25 రోజుల్లోనే పలువురు హిందూ యువకులు, వ్యాపారవేత్తలు హత్యకు గురవడం పట్ల మైనారిటీ వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. హిందూ వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ దాడులు వారి భద్రతపై పెద్ద ప్రశ్నగా మారాయి.

Exit mobile version