Amazon Hikes Prime Subscription In UK Europe By 43 Percent: ఏ రంగంలో అయినా పోటీ తీవ్రంగా ఉన్నప్పుడు.. ఏ సంస్థ అయినా ఏం చేస్తుంది? వినియోగదారుల్ని ఆకర్షించేందుకు తమ ప్రోడక్ట్‌ని మరింత ఆకర్షణీయంగా తయారు చేయడంతో పాటు ధరల్ని తగ్గిస్తుంది. పోటీదారులకి అవకాశం ఇవ్వకుండా.. ఎత్తుకు పైఎత్తులు వేస్తుంది. కానీ.. అమెజాన్ ప్రైమ్ వీడియో మాత్రం అందుకు భిన్నంగా పావులు కదుపుతుండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ధరను అమెజాన్ పెంచాలని చూస్తోంది. సెప్టెంబర్ నాటికల్లా కొత్త ధరల్ని అమలు చేయాలని యోచిస్తోంది. అయితే.. కొన్ని దేశాల్లో మాత్రమే కొత్త ధరల్ని అమల్లోకి తెస్తోంది.
లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం.. ప్రాన్స్‌లో ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ధరను ఏకంగా 43 శాతం పెంచేసింది. దీని ప్రకారం.. వినియోగదారులు ఇకపై సంవత్సరానికి 69.90 యూరోలు చెల్లించాల్సి ఉంటుంది. ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 5,640 అన్నమాట! ఇటలీ, స్పెయిన్‌లలో 39 శాతం పెంచింది. అంటే.. ఇకపై ఏడాదికి 49.90 యూరోలు (ఇండియన్ కరెన్సీలో రూ. 4,032) చెల్లించాలి. యూకేలో 95 పౌండ్లు (దాదాపు రూ. 9,070), జర్ననీలో 89.90 యూరోలు (రూ. 8,590)గా కొత్త ధరల్ని అమెజాన్ ప్రైమ్ కేటాయించింది. ఇటీవల యూఎస్‌లోనూ సబ్‌స్క్రిప్షన్ ధరల్ని అమెజాన్ సంస్థ 119 డాలర్ల నుంచి 139 డాలర్లకు పెంచింది. యూఎస్ తర్వాత యూకేనే అమెజాన్ ప్రైమ్‌కి అతిపెద్ద మార్కెట్.
ఇక భారతదేశం విషయానికొస్తే.. అమెజాన్ మెంబర్షిప్ ధర నెలకు, మూడు నెలలకు, సంవత్సరానికి వరుసగా రూ. 179, రూ. 459, రూ. 1,499 గా కేటాయించబడ్డాయి. మెంబర్షిప్ ధరల్ని ఇలా పెంచడానికి గల ప్రధాన కారణాలు.. ద్రవ్యోల్బణం పెరగడం, నిర్వహణ ఖర్చులేనని యాజమాన్యం చెప్తోంది. సకాలంలో మంచి కంటెంట్‌ను అందించాలంటే.. ధరల పెంపు అవసరమని చెప్పుకొచ్చింది. ఇలా ధరలు పెంచడంతో పాటు అమెజాన్ యాప్ ‘యూఐ’ని సైతం రిడిజైన్ చేయనున్నట్టు సంస్థ పేర్కొంది. యూజర్లకు మరింత సులువుగా ఉండేలా డిజైన్‌ని మెరుగుపరుస్తున్నట్టు తెలిపింది.
