Al Qaeda Leader Ayman al-Zawahiri Killed in CIA Drone Strike In Afghanistan: అల్‌ఖైదా అగ్రనాయకుడు ఐమన్ అల్-జవహరీని అమెరికా మట్టుబెట్టింది. ఈ విషయాన్ని అమెరికాకి చెందిన ఓ అధికారి ధృవీకరించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో కాబుల్‌లో జరిపిన డ్రోన్ దాడిలో అతడ్ని హతమార్చినట్లు ఆ అధికారి తెలిపారు. ఈ వార్తను అధికారికంగా ప్రకటించడంతో పాటు ఆఫ్ఘనిస్తాన్‌లో చేపట్టిన ఓ ఉగ్రవాద నిరోధన ఆపరేషన్‌కు సంబంధించిన వివరాల్ని అమెరికా అధ్యక్షుడు జో-బైడెన్ వెల్లడించనట్టు వైట్-హౌస్ ట్విటర్ మాధ్యమంగా తెలిపింది. అమెరికా కాలమానం ప్రకారం.. ఈరోజు సాయంత్రం 7.30 గంటలకు జో బైడెన్ ఆ వివరాల్ని తెలియజేయనున్నారు.
మరోవైపు.. కాబుల్‌లోని షేర్పూర్ ప్రాంతంలో ఓ నివాసంపై వైమానిక దాడి జరిగిందని, దీనిని అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనగా అభివర్ణిస్తూ తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ట్వీట్ చేశారు. దీంతో.. అల్‌ఖైదా చీఫ్ అల్-జవహరీ హతమైనట్లు వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. కాగా.. ఈజిప్ట్ సర్జన్ అయిన అల్-జవహరీ, వరల్డ్‌లోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకరిగా మారాడు. 2001 సెప్టెంబర్ 11వ తేదీన అమెరికాలో జరిగిన ఉగ్రదాడుల వెనుక అల్-జవహరీని ప్రధాన సూత్రధారిగా అమెరికా గుర్తించింది. అప్పట్నుంచి అతడు పరారీలోనే ఉన్నాడు. 2011లో ఒసామా బిన్ లాడెన్ హతమైన తర్వాత అల్‌ఖైదా పగ్గాల్ని జవహరీ స్వీకరించాడు. ఆయన తలపై 25 మిలియన్ డాలర్లను సైతం యూఎస్ రివార్డుగా ప్రకటించింది. ఇప్పుడు డ్రోన్ స్ట్రైక్‌లో హతమార్చింది.