AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉద్యోగాలకు ఎసరు పెట్టేస్తోంది. ఇప్పటికే, ఏఐ కారణంగా పలు టెక్ సంస్థలు తమ ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. రాబోయే కాలంలో ఇది మరింత ఎక్కువ కాబోతోంది. ఏఐ కారణంగా 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగులు ఏఐ కారణంగా నిరుద్యోగులుగా మారుతారని లూయిస్‌విల్లే యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ రోమన్ యాంపోల్స్కీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు ఖర్చులను తగ్గించడానికి, ఆదాయాన్ని పెంచడానికి ఏఐ వ్యవస్థలను వేగంగా అమలు చేస్తున్న సమయంలో, ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
Read Also: Hyderabad : గణేష్ నిమజ్జన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
ఏఐ భద్రతలో గళం విప్పుతున్న యాంపోల్క్సీ ప్రకారం, దాదాపు అన్ని ఉద్యోగాలను ఆక్రమించే ఆటోమేషన్ తరంగం నుంచి కోడర్లు, ప్రాంప్ట్ ఇంజనీర్లు కూడా సురక్షితంగా ఉండలేరని అన్నారు. ఇప్పుడు చూస్తున్న 10 శాతం నిరుద్యోగం నుంచి 99 శాతానికి పెరిగే భయానక పరిస్థితి ఉందని యాంపోల్స్కీ ది డైరీ ఆఫ్ ఎ CEO పాడ్‌కాస్ట్‌లో అన్నారు. మానవుడి మేధస్సువంటి కృత్రిమ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) 2027 నాటికి వచ్చే అవకాశం ఉందని అన్నారు.
ఏజీఐ వచ్చిన మూడేళ్ల తర్వాత, ఏఐ టూల్స్, హ్యూమనాయిడ్ రోబోల కారణంగా ఉద్యోగాలకు మనుషులను నియమించుకోవడాన్ని తగ్గించడంతో లేబర్ మార్కెట్ కూలిపోతుందని అంచనా వేశారు. అన్ని ఉద్యోగాలు ఆటోమేటెడ్ అవుతాయని, అప్పుడు ప్లాన్ బీ ఉండదని, మీరు కొత్తగా నేర్చుకోవడం, తిరిగి శిక్షణ పొందడం అనేవి కూడా పనిచేయమని అన్నారు. ఏఐ ఉపయోగంతో నిరుద్యోగ సమస్య గణనీయంగా పెరుగుతుందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు ఈ ముప్పును తక్కువగా అంచనా వేస్తున్నాయని ఆయన అన్నారు.
