NTV Telugu Site icon

Afghanistan: ప్రపంచంలో “అత్యుత్తమ కరెన్సీ పనితీరు”లో ఆఫ్ఘనిస్తాన్ టాప్.

Afghanistan

Afghanistan

Afghanistan: తాలిబాన్ చట్టాలు, మహిళ హక్కుల ఉల్లంఘన, నిరుద్యోగం, ఉగ్రవాదం ఇలా పలు రకాల సమస్యల్లో చిక్కుకుంది ఆఫ్ఘనిస్తాన్. అయితే ఒక్క విషయంలో మాత్రం ప్రపంచంలో టాప్ స్థానంలో నిలిచింది. బ్లూమ్‌బర్గ్ డేటా ప్రకారం.. ఈ త్రైమాసికంలోనే ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ ప్రపంచంలోనే అత్యుత్తమ కరెన్సీగా అవతరించింది. ‘బెస్ట్ ఫెర్ఫామింగ్ కరెన్సీ’గా నిలిచింది. ఈ కాలంలో ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ ఆఫ్ఘని విలువ 9 శాతం పెరుగుదల కనిపించింది. మానవతా సాయంగా ఇతర దేశాలు బిలియన్ డాలర్లు సాయం చేయడం, ఆసియాలోని పొరుగు దేశలతో వాణిజ్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ పెంచిందని నివేదిక పేర్కొంది.

రెండేళ్ల క్రితం ప్రజాపాలనను గద్దె దించి తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ని వశం చేసుకున్నారు. అప్పటి నుంచి కరెన్సీపై గట్టి పట్టు కొనసాగించేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. లావాదేవీల్లో డాలర్లు, పాకిస్తానీ రూపాయలను ఉపయోగించడాన్ని నిషేధించారు. యూఎస్ డాలర్లు దేశం నుంచి తరలించకుండా కఠినమైన ఆంక్షలు విధించారు. ఆన్‌లైన్ ట్రేడింగ్ కూడా నేరంగా పరిగణించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి జైలు శిక్షలు విధిస్తామని చెప్పడంతో వీటన్నింటికి అలడ్డుకట్టపడ్డట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది.

Read Also: Mumbai Terror Attack: ముంబై ఉగ్రదాడి.. నిందితుడు రాణాపై దాఖలైన చార్జిషీట్‌లో విస్తుపోయే విషయాలు

ఇలా కరెన్సీ పనితీరు మెరుగ్గా ఉన్నప్పటికీ, ఆఫ్ఘనిస్తాన్ లో తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. దీంతో పాటు పేదరికం పెరిగింది. అయినప్పటికీ గణనీయంగా ఆ దేశ కరెన్సీ ఈ ఏడాది 14 శాతం పెరిగింది. అంతర్జాతీయ ఆంక్షల కారణంగా ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంలో ఒంటరిగా ఉంది. నిరుద్యోగంతో పాటు మూడింట రెండోంతుల కుటుంబాలు కనీస అవసరాలను తీర్చుకోవడానికి కష్టపడుతున్నారు. ద్రవ్యోల్భణం, ప్రతి ద్రవ్యోల్భణానికి దారి తీసింది. ఆర్థిక కష్టాలను తీర్చేందుకు ఐక్యరాజ్యసమితి 2021 చివరి నుంచి 18 నెలల పాటు పేదల కోసం 40 మిలియన్ల డాలర్లను ఇచ్చింది.

ఆఫ్ఘనిస్తాన్ లో ‘సర్రాఫ్’ అని పిలువబడే వారు ప్రస్తుతం దేశంలో కరెన్సీ మార్చడానికి నగరాల్లో, గ్రామాల్లో స్టాల్స్ నిర్వహిస్తున్నారు. ఆర్థిక ఆంక్షల కారణంగా ఆఫ్ఘనిస్తాన్ కు అన్ని చెల్లింపులు ఇప్పుడు హవాలా వ్యాపారంపై ఆధారపడి ఉన్నాయి. సర్రాఫ్ వ్యాపారం కూడా ఈ వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది.

Show comments