ఢిల్లీలోని ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలుడు కేవలం తనకు ఆసక్తి కారణంగా విమానాశ్రయంలో నిషిద్ధ ప్రదేశంలోకి వెళ్లి, ల్యాండింగ్ గేర్‌లో దాక్కున్నానని తెలిపాడు. దీంతో విమానాశ్రయ సిబ్బంది అంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానం ల్యాండింగ్ గేర్ వీల్ బాక్సులో ఓ 13 ఏళ్ల బాలుడు ఉన్నట్లు అత్యవసర సిబ్బంది గుర్తించారు. వెంటనే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అతన్ని అదుపులోకి తీసుకుని విచారించింది. తనకున్న ఆసక్తితో ల్యాండింగ్ గేర్ బాక్స్ లోదాక్కున్నట్లు బాలుడు తెలిపాడు. దీంతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు.
ఈ ఘటనతో విమాన సేప్టీ డిపార్ట్మెంట్ పై పలు అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో వెంటనే ఫ్లైట్ పై యాంటీ సాబోటేజ్ తనిఖీలు చేపట్టారు. ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్ లో ప్రయాణించడం చాలా ప్రమాదకరమని సేప్టీ అధికారులు వెల్లడించారు., ఎందుకంటే అక్కడ తగినంత ఆక్సిజన్ ఉండదు. అలాగే విమానం గాలిలో ప్రయాణించే సమయంలో తీవ్రమైన చలిని తట్టుకోవడం అసాధ్యమన్నారు. అలాగే మెకానికల్ భాగాల వల్ల గాయపడే అవకాశమూ ఉంది. అదృష్టవశాత్తూ ఈ బాలుడు బతికి బయటపడ్డాడని వారు చెప్పుకొచ్చారు.
అనంతరం అధికారుల పర్యవేక్షణలో అతన్ని తిరిగి ఆఫ్ఘనిస్తాన్‌కు పంపారు. ఈ సంఘటన భద్రతా లోపాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
