NTV Telugu Site icon

Myanmar earthquake: మయన్మార్‌లో భారీ భూకంపం.. ఈ ప్రాంతంలో ఎందుకు, భూగర్భంలో ఏం జరుగుతోంది..?

Sagaing Fault

Sagaing Fault

Myanmar earthquake: మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ రోజు మధ్యాహ్నం 12.50 గంటలకు 7.7, 6.4 తీవ్రతతో కూడా శక్తివంతమైన భూకంపాల కారణంగా మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్ వణికాయి. సాగింగ్ పట్టణానికి వాయువ్యంగా 16 కి.మీ దూరంలో, 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉంది. ఈ భూకంపాల వల్ల చాలా భవణాలు దెబ్బతిన్నాయి. మయన్మార్ రాజధాని నేపిడాలో 1000 పడకల ఆస్పత్రి కుప్పకూలింది. చాలా భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. మాండలేలోని ఐకానిక్ అవా వంతెన ఇరావడీ నదిలోకి కూలిపోయింది. వీటికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

Read Also: Wife Poisons Husband: భర్తకు కాఫీలో విషం పెట్టిన భార్య.. వేరే వ్యక్తితో మాట్లాడొద్దనడమే పాపమా..?

మయన్మార్‌లోనే ఎందుకు భూకంపం..?

భూకంపాలు ఎక్కువగా వచ్చే దేశాల్లో మయన్మార్ కూడా ఉంది. మయన్మార్ దేశం ఉన్న ప్రదేశంలోని భూగర్భంలో ‘‘టెక్టానిక్ ప్లేట్స్’’ క్రియాశీలత ఎక్కువగా ఉంది. సాగైంగ్ ఫాల్ట్ లైన్ వెంబడి ఈ దేశం ఉంది. ఈ ప్రాంతంలో ఇండియన్ ప్లేట్‌, బర్మా మైక్రో ప్లేట్ మధ్య ప్రధానమైన టెక్టోనిక్ సరిహద్దు ఉంది. ఈ ఫాల్ట్ లైన్ దేశం గుండా దాదాపు 1200 కి.మీ వెళ్తుంది. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ ఉత్తర దిశగా కదులుతూ మరో ప్లేట్‌ని ఢీకొడుతుండటంతో ఈ ప్రక్రియలో విపరీతమైన శక్తి భూకంపాల రూపంలో విడుదల అవుతుంది. సాగైంగ్ ఫాల్ట్ చివర బ్యాంకాక్ వైపు వెళ్లినందున ఆ దేశం కూడా భూకంపానికి గురైంది.

ఈ సాగైంగ్ ఫాల్ట్‌కి భూకంపాల చరిత్ర ఉంది. 1946లో 7.7 తీవ్రతతో భూకంపం వచ్చింది, 2012లో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. సాగైంగ్ ఫాల్ట్ అనేది రెండు భూభాగాలు పక్కపక్కన కదులుతున్నాయి. ఈ కదలిక ప్రతీ ఏడాది 11 మి.మీ నుంచి 18 మీ.మీ వరకు ఉంటుంది. ఈ ఫాల్ట్ ఎల్లప్పుడూ మారతుండటం వల్ల కాలక్రమేణా ఒత్తిడి పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఒత్తిడి అకస్మాత్తుగా విడుదలై, భూకంపాలకు కారణం అవుతుంది.