Site icon NTV Telugu

Twitter Data Leak: చరిత్రలో అతిపెద్ద డేటా లీక్.. అమ్మకానికి 40 కోట్ల మంది వివరాలు

Twitter Data Hacked

Twitter Data Hacked

A Hacker Claims That 400 million Twitter Users Data Stolen: కొన్ని రోజుల క్రితమే వాట్సాప్‌లో భారీ డేటా చోరీకి గురవ్వగా.. ఇప్పుడు ట్విటర్‌లో పెద్దఎత్తున డేటా లీకైనట్లు ఓ నివేదిక వెల్లడించింది. సుమారు 40 కోట్ల మంది ట్విటర్‌ వినియోగదారుల వ్యక్తిగత డేటాను ఒక హ్యాకర్ అపహరించాడని ఇజ్రాయెల్‌కు చెందిన సైబర్‌ ఇంటెలిజెన్స్‌ కంపెనీ హడ్సన్‌ రాక్‌ పేర్కొంది. షాక్‌కి గురి చేసే విషయం ఏమిటంటే.. ఇందులో గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌, బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌‌లతో పాటు మరికొంతమంది ప్రముఖుల ఖాతాలు కూడా ఉన్నాయి. ఈ మొత్తం డేటాను ఆ హ్యాకర్ డార్క్‌వెబ్‌లో విక్రమానికి ఉంచాడని ఆ నివేదిక తెలిపింది.

ట్విటర్‌ ఏపీఐ (API)లో ఒక లోపం ఉన్న విషయాన్ని ఆ హ్యాకర్ కనుగొని, దాని ద్వారా అతడు ఈ డేటాను దొంగలించాడని హడ్సన్ రాక్ పేర్కొంది. ఇందులో వ్యక్తుల ఈ-మెయిల్‌, యూజర్‌ నేమ్‌, ఫాలోవర్ల వివరాలతో పాటు కొందరి ఫోన్ నంబర్లు సైతం ఉన్నాయని కూడా స్పష్టం చేసింది. రెండు నెలల క్రితమే 54 లక్షల మంది వినియోగదారుల డేటా లీక్‌ అయ్యిందని.. దాంతో పోలీస్తే తాజా లీకేజ్ చాలా పెద్దదని చెప్పింది. తాను ఈ అకౌంట్లను హ్యాక్ చేశానని నిరూపించుకునేందుకు.. హ్యాంకర్ కొన్ని శాంపిల్స్‌ని హ్యాకర్స్‌ ఫోరంలో పోస్ట్‌ చేశాడు. కేవలం సుందర్ పిచాయ్, సల్మాన్ ఖాన్ ఖాతాలే కాదు.. డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌, కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ, స్పేస్‌ ఎక్స్‌ వంటి సంస్థల ఖాతాలు కూడా ఉన్నాయి.

మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తాను కొల్లగొట్టిన ఈ డేటాను ట్విటర్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌కే అమ్ముతానని హ్యాకర్‌ ట్విటర్ మాధ్యమంగా ప్రకటించాడు. ‘‘ట్విటర్ లేదా ఎలాన్ మస్క్.. మీరు ఈ పోస్ట్ గనుక చదువుతుంటే, 54 లక్షల వినియోగదారుల డేటా లీక్ అయినందుకు గాను జీడీపీఆర్ ఫైన్స్‌కి రిస్క్‌లో ఉన్నారు. ఇప్పుడు 40 కోట్ల మంది వినియోగదారుల డేటా లీక్ అయ్యింది. ఇందుకు మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా ఉండండి’’ అంటూ ఆ హ్యాకర్ హెచ్చరించాడు.

Exit mobile version