Japan Earthquake: జపాన్‌లో వరసగా రెండో రోజు కూడా భూకంపం వచ్చింది. పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంఘం హెచ్చరికలు జారీ చేసిన ఒక రోజు తర్వాత శుక్రవారం సాయంత్రం టోక్యో, దాని పరిసర ప్రాంతాల్లో 5.3 తీవ్రవతో భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. సునామీ హెచ్చరికలు చేయనప్పటికీ కనగావా, సైతామా, యమనాషి మరియు షిజుయోకా ప్రిఫెక్చర్‌లలో బలమైన ప్రకంపనలు వస్తాయని ప్రభుత్వం అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. హెచ్చరికల నేపథ్యంలో టోక్యోని చాలా భవనాలు కంపించాయి. టోక్యో మెట్రోని నిలిపేశారు.
Read Also: Bengaluru: మహిళపై బైక్-టాక్సీ డ్రైవర్ లైంగిక వేధింపులు.. రూట్ మార్చి, కోపరేట్ చేయాలంటూ..
అంతకుముందు రోజు జపాన్‌లో రెండు బలమైన భూకంపాలు సంభవించాయి. 7.1, 6.9 తీవ్రతతో ఈ భూకంపాలు వచ్చాయి. వెంటనే జపాన్ అధికారులు సునామీ హెచ్చరికల్ని జారీ చేశారు. 50 సెంటీమీటర్ల మేర సునామీ జపాన్ తీరాన్ని తాకింది. దక్షిణ మియజాకి రాష్ట్రంలోని మియజాకీ పోర్ట్‌లో సునామీ అలలు ఎగిసిపడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇదిలా ఉంటే, రానున్న రోజుల్లో మెగా భూకంపం వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు ఆ దేశాన్ని హెచ్చరిస్తున్నారు. జపాన్ ప్రజలు ‘‘మెగాక్వేక్’’కి సిద్ధం కావాలని చెప్పారు.గతంలో భారీ భూకంపాలు సంభవించిన పసిఫిక్ మహాసముద్రంలోని రెండు టెక్టానిక్ ప్లేట్ల మధ్య ఉన్న నాంకై ట్రఫ్ ‘‘సబ్‌డక్షన్ జోన్’’లోనే భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 800 కి.మీ సముద్ర గర్భంలో ఉన్న ఈ ప్రాంతం టోక్యోకు పశ్చిమాన ఉన్న షిజుయోకా నుంచి క్యుషు ద్వీపంలోని దక్షిణ కొనవరకు ఉంటుంది. ఇది ప్రతీ శతాబ్ధానికి లేదా రెండు శతాబ్ధాలకు 8 లేదా 9 తీవ్రతతో భూకంపాలు వచ్చే ప్రాంతం. వీటిని ‘‘మెగాథ్రస్ట్ భూకంపాలు’’ అని పిలుస్తారు. తరుచుగా ఇక్కడ సంభవించే భూకంపాలు ప్రమాదకరమైన సునామీలను కలిగిస్తాయి.