Site icon NTV Telugu

Hawaii Wildfire: హవాయి దీవుల్లో కార్చిచ్చు.. 36 మంది మృతి

Hawaii Wildfire

Hawaii Wildfire

Hawaii Wildfire: అగ్రరాజ్యమైన అమెరికాలో ఒకవైపు భీకర తుఫాన్‌ కొనసాగుతుంటే.. మరోవైపు హవాయి దీవుల్లో కార్చిచ్చు రగులుకుంది. హవాయి దీవుల్లో రగిలిన కార్చిచ్చులో 36 మంది మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించినప్పటికీ.. ఇంకా ఎక్కువ మంది మరణించి ఉంటారని భావిస్తున్నారు. సుందర హవాయి దీవుల్లో కార్చిచ్చు తో ప్రాణ నష్టం జరిగింది. నలువైపులా నుంచి అగ్ని కీలలు ఎగసి పడగా.. దానికి పెనుగాలులు తోడవ్వడంతో పెను విషాదం మిగిలింది. హవాయి దీవుల్లోని లహైనా రిసార్టు నగరంలో బీభత్సం సృష్టించింది. కార్చిచ్చు మూలంగా 36 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మౌయి కౌంటీ వెల్లడించింది. హరికేన్‌ ప్రభావంతో బలమైన గాలులు వీస్తుండటంతో కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోందని అధికారులు ప్రకటించారు.

Read also: World Most valuble Teapot : ఈ టీపాట్ ధర ఎన్ని కోట్లో తెలిస్తే కళ్లు తేలేస్తారు..!!

మంటల ధాటికి అనేక భవనాలు దెబ్బతిన్నాయి. కార్లు కాలిబూడిదయ్యాయి. వీధుల్లో దట్టమైన పొగ అలుముకుంది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి నుంచి ఈ కార్చిచ్చు విస్తరిస్తోంది. నలువైపుల నుంచి మంటలు చుట్టుముట్టడంతో దీవుల్లోని పశ్చిమ భాగానికి ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. 16 రోడ్లను మూసివేశారు. కేవలం ఒకే ఒక్క హైవే మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో ఆ మార్గంలోనే వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పొగ, మంటల బారి నుంచి తప్పించుకునేందుకు కొందరు పసిఫిక్‌ సముద్రంలోకి దూకి పారిపోతున్నారు. ఇప్పటివరకు 217 భవనాలు ధ్వంసమవ్వగా.. కనీసం 36 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. అనేక మంది కార్లు, భవనాల్లో చిక్కుకుని ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మంటలను అదుపుచేసేందుకు సహాయక సిబ్బంది అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. హవాయ్‌ దీవుల్లోనే మౌయి అతిపెద్ద ద్వీపం కాగా.. చారిత్రకంగానూ దీనికి ఓ గుర్తింపు ఉంది. అందులో ప్రధాన పర్యాటక నగరం లహైనానే. అదికాస్త ఇపుడు కార్చిచ్చుతో మంటల్లో ఉంది.

Exit mobile version