Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్‌రూమ్‌లో మృతి!

  • సిక్ లీవ్ నిరాకరణతో విషాదం
  • ఆఫీస్ వాష్‌రూమ్‌లో 29 ఏళ్ల యువతి మృతి
  • ఆరోగ్యం బాగోలేదని చెప్పినా వినలేదు
South Africa Office Washroo

South Africa Office Washroo

దక్షిణాఫ్రికాలోని ఒక ప్రముఖ కంపెనీలో పని చేస్తున్న 29 ఏళ్ల మహిళ గ్సినా ధ్లాధ్లా (Gcina Dhladhla) ఆఫీసు వాష్‌రూమ్‌లో కూలిపోయి మృతి చెందారు. ఆమె పదేపదే సిక్ లీవ్ అడిగినా బాస్‌లు తిరస్కరించడం వల్ల ఈ దుర్మరణం జరిగిందని కుటుంబం ఆరోపిస్తోంది. ఈ విషాద ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అనారోగ్యంతో బాధపడుతూ పలుమార్లు సిక్ లీవ్ కోరినప్పటికీ, సెలవులు మంజూరు చేయలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో 29 ఏళ్ల యువతి ఆఫీస్ వాష్‌రూమ్‌లో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. మృతురాలిని గ్సీనా ఢ్లాధ్లా (Gcina Dhladhla)గా గుర్తించారు. ఆమె జోహన్నెస్‌బర్గ్‌లోని రోజ్‌బ్యాంక్ ప్రాంతంలో ఉన్న కార్‌ట్రాక్ (Cartrack) సంస్థలో కాల్ సెంటర్ ఏజెంట్‌గా పనిచేస్తున్నారు.

పలుమార్లు సిక్ లీవ్ కోరినా..

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, గ్సీనా గత కొద్ది రోజులుగా తీవ్ర అలసట, అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె రెండు సార్లు వైద్యుల సర్టిఫికెట్లతో పాటు సిక్ లీవ్ కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపారు. అయితే, ఆమె సెలవు అభ్యర్థనలను యాజమాన్యం తిరస్కరించిందని, ఆరోగ్యం బాగోలేకపోయినా విధులకు హాజరు కావాలని సూచించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

×
×
Ad

వాష్‌రూమ్‌లో కుప్పకూలి మృతి

జూన్ 6న గ్సీనా విధులకు హాజరైన సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సహోద్యోగులు తెలిపారు. కొంతసేపటి తర్వాత ఆమె ఆఫీస్ వాష్‌రూమ్‌లో కుప్పకూలిపోయారు. చాలాసేపు బయటకు రాకపోవడంతో సహోద్యోగులు గమనించి చూడగా, ఆమె అపస్మారక స్థితిలో కనిపించారు. అనంతరం ఆమె మరణించినట్లు నిర్ధారించారు.

కుటుంబ సభ్యుల తీవ్ర ఆరోపణలు

మృతురాలి కుటుంబ సభ్యులు సంస్థపై పలు ఆరోపణలు చేశారు. గ్సీనా తీవ్రమైన ఒత్తిడి, అలసటతో బాధపడుతున్నప్పటికీ యాజమాన్యం స్పందించలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా, సిక్ లీవ్ కోరినందుకు ఆమెకు హెచ్చరిక నోటీసు కూడా జారీ చేసినట్లు ఆరోపించారు. ఆరోగ్యం క్షీణించిన సమయంలో సరైన వైద్య సహాయం అందించడంలో కూడా ఆలస్యం జరిగిందని కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు.

కంపెనీ స్పందన

అయితే, ఈ ఆరోపణలను కార్‌ట్రాక్ సంస్థ ఖండించింది. సంస్థ కార్పొరేట్ వ్యవహారాల డైరెక్టర్ లారెన్ హ్యూమన్ మాట్లాడుతూ, గ్సీనాకు ఎప్పుడూ సిక్ లీవ్ నిరాకరించలేదని స్పష్టం చేశారు. ఆమె గతంలో తీసుకున్న అనారోగ్య సెలవును కూడా ఆమోదించినట్లు తెలిపారు. అలాగే, ఆమె అస్వస్థతకు గురైన వెంటనే అత్యవసర వైద్య సేవలకు సమాచారం ఇచ్చామని, కార్యాలయంలో శిక్షణ పొందిన ఫస్ట్ రెస్పాండర్లు సహాయక చర్యలు చేపట్టారని వెల్లడించారు.

ఉద్యోగుల సంక్షేమంపై మళ్లీ చర్చ

ఈ ఘటన దక్షిణాఫ్రికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల సంక్షేమం, కార్యాలయ ఒత్తిడి, సిక్ లీవ్ విధానాలపై చర్చకు దారితీసింది. ఉద్యోగుల ఆరోగ్య సమస్యలను సంస్థలు ఎంత సున్నితంగా పరిగణించాలి? అనారోగ్య పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

గ్సీనా ఢ్లాధ్లా మరణానికి అసలు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. కుటుంబ సభ్యుల ఆరోపణలు, సంస్థ వివరణల మధ్య నిజానిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది. అయితే, ఈ విషాద ఘటన ఉద్యోగుల ఆరోగ్యం, మానసిక ఒత్తిడి, పని-జీవిత సమతుల్యత వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.