21-year-old Punjabi woman shot dead in Canada: విదేశాల్లో మన భారతీయులపై, భారత సంతతికి చెందిన వారిపై జాత్యాహంకార దాడులు ఎప్పటినుంచో జరుగుతూనే ఉన్నాయి. తమ దేశానికి వచ్చి, విలాసవంతమైన జీవితాన్ని గడపడాన్ని చూసి ఓర్వలేక, కొందరు ఈ ఘాతుకాలకి పాల్పడుతున్నారు. నవంబర్ 22వ తేదీన బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో మెహక్‌ప్రీత్ సేథి(18) అనే భారతీయ విద్యార్థిని కొందరు దుండగులు పొడిచి చంపేశారు. ఈ ఘటనకు ఆ టీనేజర్ కుటంబానికి సంఘీభావం తెలియజేస్తూ.. అక్కడి ఎన్నారైలు ర్యాలీలు నిర్వహించారు.
ఆ దాడి నుంచి కోలుకోవడానికి ముందే.. తాజాగా కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌లో ఓ సిక్కు యువతి(21) మృతి చెందింది. శనివారం రాత్రి గుర్తు తెలియని ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆమె మరణించింది. కెనడా పౌరురాలు అయిన పవన్‌ప్రీత్ కౌర్.. రాత్రి 10.40 గంటల సమయంలో మిస్సిసౌగా నగరంలోని బ్రంప్టన్‌లో గ్యాస్ స్టేషన్ సమీపంలో ఉండగా.. ఒక దుండగుడు సడెన్‌గా ఊడిపడ్డాడు. తనతోపాటు తెచ్చుకున్న గన్ బయటకు తీసి, చాలా దగ్గర నుంచి ఆమెపై కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ఈ ఘటనలో కౌర్ అక్కడికక్కడే చనిపోయింది.
ఈ దాడికి పాల్పడింది ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది. కొందరేమో ఇది జాత్యాహంకార దాడి అయ్యుండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తుంటే, పోలీసులు మాత్రం ఎవరో కావాలని ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కచ్ఛితంగా ఈ దాడి వెనుక ఏదో కుట్ర దాగి ఉండొచ్చని పేర్కొంటున్నారు. కాగా.. కౌర్ మరణంతో ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కన్నకూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం చూసి.. కౌర్ తల్లి గుండె పగిగేలా రోధించింది.
