Site icon NTV Telugu

Bitfinex Hacking case: ఛేదించిన పోలీసులు.. అదుపులో జంట

సంచలనం కలిగించిన బిట్‌ఫినిక్స్‌ హ్యాకింగ్‌ కేసు కొలిక్కి వచ్చింది. 2016 బిట్‌ఫినిక్స్‌ హ్యాకింగ్‌ కేసును పోలీసులు ఛేదించారు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ కేసు ఓ కొలిక్కి వచ్చింది. 3.6 బిలియన్‌ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇలియా లిక్టెన్‌స్టెయిన్‌, హీథర్‌ మోర్గాన్‌ జంటను కటకటాల వెనక్కి పంపారు అమెరికా జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు.

2016లో హాంకాంగ్‌కు చెందిన బిట్‌ఫినెక్స్‌ అనే బిట్‌కాయిన్‌ ఎక్స్‌ఛేంజిలో హ్యాకింగ్‌ జరిగింది. ఆ సమయంలో లక్షా19వేల 754 బిట్‌కాయిన్లను హ్యాకర్లు అపహరించారు. ఇందుకోసం దాదాపు 2వేల లావాదేవీలు జరిపారు. అప్పట్లో ఈ బిట్‌కాయిన్ల విలువ 71 మిలియన్‌ డాలర్లు.. కాగా ప్రస్తుతం వాటి విలువను 4.5 బిలియన్‌ డాలర్లుగా లెక్కగట్టారు. ఇలియా లిక్టెన్‌స్టెయిన్ ఆధీనంలోని ఓ డిజిటల్‌ వాలెట్‌కు ఇవి చేరాయి. వీటిల్లో 25వేల బిట్‌కాయిన్లతో వేర్వేరు ఖాతాలతో లావాదేవీలు జరిపారు.

తాజాగా అధికారులు మిగిలిన 94వేలబిట్‌కాయిన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 3.6 బిలియన్‌ డాలర్లుగా చెబుతున్నారు. అమెరికా జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ చరిత్రలోనే ఇదో రికార్డు. ఈ బిట్‌కాయిన్లను కొన్నాళ్లు ఆల్ఫాబే అనే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో ఉంచారు. ఆ తర్వాత వీటిని మార్చారు.

అయితే ఈ హ్యాకింగ్‌ వ్యహారం దాదాపు ఐదేళ్ల తర్వాత ఓ కొలిక్కి వచ్చింది. ఈ కేసులో సుమారు 27వేల కోట్లును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇలియా లిక్టెన్‌స్టెయిన్‌, హీథర్‌ మోర్గాన్‌ జంటను అరెస్టు చేశారు అమెరికా జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు. వీరు పైకి బిజినెస్‌మెన్లు, సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా చలామణి అవుతున్నారు. చోరీ చేసిన బిట్‌కాయిన్లను లాండరింగ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే అభియోగాలు మోపారు అధికారులు.

Exit mobile version