NTV Telugu Site icon

Bangladesh Violence: షేక్ హసీనా పార్టీ నేతలు, హిందువులే టార్గెట్.. 29 మంది నేతల హత్య..

Bangladesh Violence

Bangladesh Violence

Bangladesh Violence: స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశం బంగ్లాదేశ్‌లో తీవ్ర హింసకు దారి తీసింది. విద్యార్థి నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, చివరకు షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, దేశం వదిలి పారిపోయేలా చేసింది. ప్రస్తుతం ఆర్మీ నేతృత్వంలో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ దేశ ఆర్మీ చీఫ్ చెప్పారు. ఇదిలా ఉంటే షేక్ హసీనా రాజీనామా చేసినా ఇప్పటికీ ఆ దేశంలో హింస చెలరేగుతూనే ఉంది. ముఖ్యంగా మైనారిటీలైన హిందువులపై ముస్లింమూకలు దాడులకు తెగబడుతున్నాయి. హిందువుల ఇళ్లు, గుడులపై దాడి చేయడమే కాకుండా మహిళలపై అకృత్యాలకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, ఒక్క హిందువులనే కాకుండా షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తూ విధ్వంసానికి తెగబడుతున్నారు. అవామీ లీగ్ కార్యకర్తలు, నేతల ఇళ్లను చుట్టుముట్టి నిప్పుపెడుతున్నారు. అందులో ఉన్న వారిని హత్య చేస్తున్నారు. రాజధాని ఢాకాకు 100 కి.మీ దూరంలోని కోమిల్లా నగరంలో మాజీ కౌన్సిలర్ ఎండీ షా ఆలం ఇంటికి నిప్పుపెట్టారు. మంగళవారం ఎంపీ షఫీకుల్ ఇస్లాం షిముల్‌ ఇంటికి నిప్పుపెట్టడంతో నలుగురు మరణించారు. అవామీ లీగ్ పార్టీకి చెందిన 29 మంది నేతలు హత్య చేయబడ్డారు.

Read Also: Bangladesh Violence: బంగ్లాదేశ్ నుంచి రాయబార అధికారులను ఖాళీ చేయించిన భారత్..

ఢాకాలోని అవామీ లీగ్ ప్రధాన కార్యాలయానికి గుంపు నింపు పెట్టింది. బంగ్లాలోని హక్కుల సంఘాలు, దౌత్యవేత్తలు, హిందువులతో సహా మైనారిటీలపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేశాయి. షేక్ హసీనాకు సన్నిహితంగా ఉండే కొందరు హిందువులకు చెందిన వ్యాపారాలు, ఇళ్లపై దాడి జరిగింది. సోమ, మంగళవారాల్లో కనీసం 97 చోట్ల మైనారిటీ ప్రజల ఇళ్లు, దుకాణాలపై దాడులు, ధ్వంసం, లూటీలు జరిగాయని హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యత మండలి ప్రధాన కార్యదర్శి రాణా దాస్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం కనీసం 10 హిందూ ఆలయాలపై దుండగులు దాడులు చేశారు.

బంగ్లాదేశ్‌లోని దక్షిణ బాగర్‌హాట్ జిల్లాలో ఒక హిందూ వ్యక్తి కొట్టి చంపబడ్డాడు. ఖుల్నా డివిజన్‌లోని జబీర్ ఇంటర్నేషనల్ హోటల్‌కు జనం నిప్పుపెట్టిన ఘటనలో 24 మంది మృతి చెందారు. ఈ హోటల్ జషోర్ జిల్లా అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి షాహిన్ చక్లాదర్ యాజమాన్యంలో ఉంది. మరోవైపు బంగ్లాదేశ్‌లో నోబెల్ విజేత ముహ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధిపతులు, విద్యార్థి నాయకులతో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.