పాకిస్థాన్‌లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ప్యాసింజర్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మంది గాయపడ్డారు. బస్సు రావల్పిండి నుంచి క్వెట్టాకు వెళ్తుండగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని డానిసర్ సమీపంలో అదుపుతప్పి లోయలో పడింది. అతివేగం, భారీ వర్షం ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. బస్సు లోయలో పడేకొలది చాలాసార్లు బోల్తా కొట్టిందని స్థానిక మీడియా వెల్లడించింది.
వెంటనే స్థానికులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రమాదంపై అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వెంటనే స్థానికులతో కలిసి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అంబులెన్సుల్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 19 మంది మరణించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.
Ukraine Crisis: లిసిచాన్స్క్‌ను స్వాధీనం చేసుకున్నాం.. రష్యా రక్షణ శాఖ ప్రకటన
పాకిస్తాన్‌లో రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. ప్రధానంగా నిర్వహణ సరిగా లేని వాహనాలు, శిథిలావస్థలో ఉన్న రోడ్లు, రహదారి భద్రతా చర్యల పట్ల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు సంభవిస్తున్నట్లు పలు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జూన్‌లో బలూచిస్తాన్‌లోని కిల్లా సైఫుల్లా సమీపంలో ప్యాసింజర్ వ్యాన్ 100 అడుగుల లోయలో పడటంతో 22 మంది మరణించగా.. ఒక చిన్నారి గాయపడ్డారు. ఈ ఘటనపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, బలూచిస్థాన్ సీఎం మీర్ అబ్దుల్ ఖుదూస్ బిజెంజో విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.