South Africa: దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. జోహన్నెస్‌బర్గ్ సమీపంలోని ఒక మురికివాడలో విషపూరితమైన గ్యాస్ లీకై 16 మంది మరణించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరికొందరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు అక్కడి అధికారులు గురువారం వెల్లడించారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. అక్రమ మైనింగ్ కార్యకలాపాల కోసం ఉపయోగించే గ్యాస్ లీకేజ్ తోనే ప్రమాదం సంభవించినట్లు వెల్లడించారు. జోహన్నెస్‌బర్గ్‌కు తూర్పున ఉన్న బోక్స్‌బర్గ్ జిల్లా సమీపంలోని ఏంజెలో లోని ఈ ఘటన జరిగింది.
Read Also: Letter: పెళ్లికూతురుకు రాసిన లేఖ 200 ఏళ్లు తర్వాత 32లక్షలకు అమ్ముడు పోయింది.. ఇంతకీ అందులో ఏముందంటే?
ఇప్పటి వరకు 16 మంది చనిపోయినట్లు, మరికొందరిని ఆస్పత్రికి తరలించినట్లు ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రతినిధి విలియం నటాడి తెలిపారు. ఆస్పత్రిలో చేరిన నలుగురి పరిస్థితి విషమంగా ఉందని.. మరో 11 మందికి ప్రమాదం నుంచి బయటపడి చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, ఘటన జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా తనిఖీ చేస్తే తప్పా మరణాలపై స్పష్టత రాదని అధికారులు వెల్లడించారు.
బుధవారం రాత్రి గ్యాస్ లీకేజీ విషయం తెలియగానే ఎమర్జెన్సీ సేవలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. విషపూరితమైన గ్యాస్ సిలిండర్ నుంచి లీకేజ్ అయినట్లు గుర్తించారు. అక్రమ మైనింగ్ కార్యకలాపాల్లో ఈ గ్యాస్ ఉపయోగిస్తున్నట్లు తేలింది. దక్షిణాఫ్రికాలో 32 శాతం నిరుద్యోగిత ఉంది. దీంతో ‘‘జమా జమాస్’’ అనే పేరుతో వేలాది మంది అక్రమంగా మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వాడకంలో లేని బంగారు గనుల్లో ప్రమాదకర పరిస్థితుల్లో బంగారం కోసం వెతుకుతున్నారు. గతేడాది ఇదే ప్రాంతంలో ఎల్పీజీ గ్యాస్ తీసుకెళ్తున్న పేలి 41 మంది మరణించారు.
