NTV Telugu Site icon

Bus Accident: పాక్‎లో బ్రేక్ ఫెయిలై లోయలో పడ్డ పెళ్లి బస్సు.. 15మంది మృతి

Road Accident

Road Accident

Bus Accident: పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పంజాబ్ ప్రావిన్స్‌లో పెళ్లి బృందంతో వేగంగా వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో 15 మంది మృతి చెందారు. మరో 60 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఇస్లామాబాద్ నుంచి లాహోర్‌కు వెళ్తున్న బస్సు లాహోర్‌కు 240 కిలోమీటర్ల దూరంలోని కల్లార్ కహర్ సాల్ట్ రేంజ్ ప్రాంతంలో ఆదివారం బోల్తా పడింది. బస్సు, బోల్తా కొట్టడానికి ముందు, ఎదురుగా వస్తున్న మూడు వాహనాలను ఢీకొట్టి, రోడ్డు నుండి పక్కకు దూసుకెళ్లినట్లు రెస్క్యూ అధికారి ముహమ్మద్ ఫరూక్ మీడియాకు తెలిపారు. బస్సు పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న సందర్భంలో ప్రమాదం జరిగిందన్నారు.

Read Also: Mukaab: అద్భుత కట్టడాలకు కేరాఫ్ అరబ్ కంట్రీ.. వావ్ ఈ సారి డిజైన్ మామూలుగా లేదు

ప్రమాదానికి బస్సు బ్రేక్ ఫెయిల్యూర్ స్పష్టమైన కారణంగా పేర్కొన్నారు. బస్సులో చాలామంది ఇరుక్కుపోయారని.. వారిని బయటికి తీసేందుకు బస్సు బాడీని కోయాల్సి వచ్చిందన్నారు. గాయపడిన వారిని రావల్పిండి, ఇస్లామాబాద్ జంట నగరాల్లోని ఆసుపత్రులకు తరలించామన్నారు. వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారని ఆయన తెలిపారు. ప్రమాదంపై పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు పాకిస్తాన్‌లో సర్వసాధారణం.. ప్రధానంగా పేలవమైన రోడ్లు, సరిగా నిర్వహించబడని వాహనాలు.. వృత్తిపరమైన డ్రైవింగ్ లే ప్రమాదాలకు కారణమవుతున్నాయి.