MH370 Plane: 10 ఏళ్ల క్రితం తప్పిపోయిన మలేషియా విమానం MH370, ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అత్యాధునిక సాంకేతికత, సముద్రంలో వేల మైళ్లను జల్లెడ పట్టినా కూడా ఒక్క శకలం కూడా లభించలేదు. అసలు ఈ విమానానికి ఏమైదనే విషయాన్ని ఇప్పటి వరకు ఇన్వెస్టిగేటర్లు కనిపెట్టలేకపోయారు. మార్చి 8, 2014న కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కి 239 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోయింగ్ 777 అదృశ్యమైంది. ఇప్పటివరకు ఈ MH370 విమానం అదృశ్యం ప్రపంచవ్యాప్తంగా ఒక మిస్టరీగా మిగిలిపోయింది.
ఇదిలా ఉంటే, ఈ విమానం కోసం మళ్లీ సెర్చ్ ఆపరేషన్ మొదలుకాబోతోంది. శాటిలైట్ డేటా విశ్లేషనలో విమానం పశ్చిమ ఆస్ట్రేలియా తీరంలో దక్షిణ హిందూ మహాసముద్రంలో ఎక్కడో కూలిపోయిం ఉంటుందని తేలింది. అయినప్పటికీ, రెండు ప్రధాన శోధనలు ముఖ్యమైన అణ్వేషణతో ముందుకు రావడంలో విఫలమయ్యాయి.
ఇప్పటి వరకు ఏం తెలుసు.?
కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయలుదేరిన 40 నిమిషాల తర్వాత విమానం నుంచి చివరిసారిగా ట్రాన్స్‌మిషన్ జరిగింది. కెప్టెన్ జహారీ అహ్మద్ షా “గుడ్ నైట్, మలేషియన్ త్రీ సెవెన్ జీరో”తో సైన్ ఆఫ్ చేసాడు. అదే సమయంలో విమానం వియత్నాం గగనతలంలోకి ప్రవేశించింది. కొంత సమయం తర్వాత దాని ట్రాన్‌పాండర్ ఆఫ్ చేయబడింది. దీంతో విమానాన్ని ట్రాక్ చేయడం సాధ్యం కాలేదు.
మిలిటరీ రాడార్ ప్రకారం.. విమానం తన మార్గం నుంచి తప్పినట్లు తెలుస్తోంది. మలేషియా, పెనాంగ్ ద్వీపం మీదుగా ఇండోనేషియా సుమత్రా ద్వీపం కొనలో ఉన్న అండమాన్ సముద్రంలోకి వెళ్లినట్లు చూపించింది. ఆ తర్వాత దక్షిణం వైపు తిరిగి అన్ని సంబంధాలను కోల్పోయింది.
పరిశోధనలు:
మలేషియా, ఆస్ట్రేలియా, చైనా దక్షిణ హిందూ మహాసముద్రంలోని 120,000 చదరపు కి.మీ (46,332 చదరపు మైళ్ళు) ప్రాంతంలో ఇన్‌మార్‌శాట్ ఉపగ్రహం, విమానం మధ్య ఆటోమేటిక్ కనెక్షన్ డేటా ఆధారంగా నీటి అడుగున సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. దాదాపుగా 143 మిలియన్ డాలర్లను విమాన శోధన కోసం ఖర్చు చేశారు. విమానం జాడ తెలియకపోవడంతో జనవరి 2017లో సెర్చింగ్ నిలిపేశారు.
2018లో మలేషియా యూఎస్ అన్వేషణ సంస్థ ఓషన్ ఇన్ఫినిటీ మధ్య మూడు నెలల వెతుకులాట కోసం ‘‘నో క్యూర్, నో ఫీ’’ఆఫర్ కుదిరింది. విమానం దొరికితేనే కంపెనీకి డబ్బు వస్తుంది. ఈ శోధనలో అసలు టార్గెటెడ్ స్థలానికి ఉత్తరంగా 112,000 చ.కి.మీ (43,243 చదరపు మైళ్ళు) విస్తరించింది. ఈ సెర్చ్ ఆపరేషన్‌లో కూడా విమానం ఆనవాళ్లు కనిపించలేదు.
శిథిలాలు లభ్యం:
ఆఫ్రికా తీరం వెంబడి, హిందూ మహాసముద్రంలోని ద్వీపాలలో 30 కంటే ఎక్కువ అనుమానిత విమాన శకలాలు దొరికాయి. కేవలం ఇందులో మూడు రెక్కల శకలాలు మాత్రమే MH370కి చెందినవిగా నిర్ధారించబడ్డాయి. డ్రిఫ్ట్ నమూనా విశ్లేషణ ద్వారా విమానం ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించాలని అనుకున్నారు.
దర్యాప్తు ఏం చెబుతోంది:
MH370 అదృశ్యంపై 495 పేజీల నివేదిక, జూలై 2018లో ప్రచురించబడింది. బోయింగ్ 777 కంట్రోల్స్ ఉద్దేశపూర్వకంగా తారుమారు చేయబడి ఉండొచ్చని, అయితే దీనికి బాధ్యులెవరనే దాన్ని గుర్తించలేకపోయారు. కౌలాలంపూర్ మరియు హో చి మిన్ సిటీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్‌లు చేసిన తప్పులను కూడా నివేదిక హైలైట్ చేసింది. అసలు MH370 విమానానికి ఏం జరిగిందనే దానిని ఎవరు కనిపెట్టలేకపోయారు.
Read Also:Strange Thief: అదేం ఆనందమో..! మహిళల జాకెట్లు మాయం చేస్తున్న దొంగ..
కుట్ర సిద్ధాంతాలు:
MH370 విమాన క్రాష్ సైట్‌ని గుర్తించలేకపోవడం, యాంత్రిక లోపం లేదా రిమోట్ కంట్రోల్డ్ క్రాష్, గ్రహాంతవాసుల అపహరణ, రష్యా కుట్ర కోణం ఇలా అనేక కుట్ర సిద్ధాంతాలకు ఆజ్యం పోసింది.
మళ్లీ సెర్చింగ్ ప్రారంభం:
ఓషన్ ఇన్ఫినిటీ నుండి వచ్చిన కొత్త ప్రతిపాదనను అనుసరించి శిథిలాల కోసం అన్వేషణను పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు మలేషియా రవాణా మంత్రి శుక్రవారం ప్రకటించారు, ఇది గణనీయమైన శిధిలాలు కనుగొనబడితే $70 మిలియన్లను అందజేస్తుంది.కొత్త సెర్చ్, ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత, మునుపటి శోధన ప్రాంతాన్ని 15,000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరిస్తుందని మంత్రి చెప్పారు. ఈ ఒప్పందం 18 నెలల కాలవ్యవధిని కలిగి ఉంటుంది. జవవరి, ఏప్రిల్ మధ్య సెర్చింగ్ కి ఉత్తమ సమయం అని సంస్థ సూచించింది.
