Rupee vs Dollar: రూపాయి మంగళవారం మరోసారి చారిత్రాత్మక క్షీణతను చవిచూసింది. మొదటిసారిగా డాలర్‌తో పోలిస్తే రూపాయి 91 మార్కును దాటింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కేవలం 10 ట్రేడింగ్ రోజుల్లోనే డాలర్‌తో పోలిస్తే రూపాయి 90 నుంచి 91కి చేరుకుంది. పలు నివేదికల ప్రకారం.. నవంబర్ 2న డాలర్‌తో పోలిస్తే రూపాయి మొదటిసారి 90ని దాటింది. రూపాయి క్షీణతకు ప్రధాన కారణాలుగా విదేశీ పెట్టుబడిదారుల లాభాల బుకింగ్, అమెరికా – భారతదేశం మధ్య వాణిజ్య ఒప్పందంలో ఆలస్యం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుతున్నాయి. ఈ నెలలోనే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 92 మార్కును కూడా దాటవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సంవత్సరం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఇప్పటికే 6 శాతానికి పైగా క్షీణించిందని చెబుతున్నారు. నిజానికి మంగళవారం కరెన్సీ మార్కెట్ మొత్తం అల్లకల్లోలంగా మారింది. ఇందుకు ప్రధాన కారణం డాలర్‌తో పోలిస్తే రూపాయి చారిత్రాత్మక క్షీణతను చవిచూడటంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రేడింగ్ సెషన్‌లో రూపాయి 36 పైసలు పడిపోయి, మొదటిసారిగా US డాలర్‌తో పోలిస్తే 91 మార్క్‌ను అధిగమించింది. విదేశీ పెట్టుబడుల (FII) తరలింపు, భారతదేశం-యుఎస్ వాణిజ్య ఒప్పందం చుట్టూ నెలకొన్న అనిశ్చితి రూపాయి క్షీణతకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.
గత 10 ట్రేడింగ్ సెషన్లలో డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ 90 నుంచి 91కి పడిపోయింది. గత ఐదు సెషన్లలోనే స్థానిక కరెన్సీ US డాలర్‌తో పోలిస్తే 1 శాతం పడిపోయింది. ఈ నెలలోనే డాలర్‌కు రూపాయి విలువ 92 దాటుతుందని ఫారెక్స్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
ఈ సందర్భంగా ఫిన్‌రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్ ఎల్‌ఎల్‌పి ట్రెజరీ అధిపతి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ భన్సాలీ మాట్లాడుతూ.. అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం త్వరలో జరిగే అవకాశం లేదని, ఎందుకంటే (అమెరికా అధ్యక్షుడు) డొనాల్డ్ ట్రంప్ వ్యవసాయ సమస్యలను పరిష్కరించకుండా అంగీకరించడానికి ఇష్టపడటం లేదని, భారతదేశం దానిని స్పష్టంగా వ్యతిరేకించిందని చెప్పారు. అందుకే రూపాయి 91 దాటిందని, అలాగే ఈ నెలలోనే డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ 92కి కూడా చేరుకోవచ్చని అంచనా వేశారు. ట్రేడింగ్ హెచ్చుతగ్గులు, పన్ను ఉపసంహరణల కారణంగా కూడా రూపాయి విలువ వేగంగా తగ్గడం జరుగుతుందని చెప్పారు. అలాగే స్పెక్యులేటర్ల చమురు కొనుగోళ్లు, వాణిజ్య ఒప్పందం లేకపోవడం, ఎగుమతిదారుల డాలర్ల నిల్వ, విదేశీ పెట్టుబడిదారుల ఉపసంహరణలు, రుణ అమ్మకాలు రూపాయి క్షీణతకు ప్రధాన కారణంగా మారాయని పేర్కొన్నారు. నిజానికి సోమవారం వాణిజ్య లోటు తగ్గినప్పటికీ, స్థానిక కరెన్సీ విలువ మెరుగుపడలేదని ఆయన వెల్లడించారు.
