Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?

Dr Br Ambedkar

Dr Br Ambedkar

Why Did Dr. B.R. Ambedkar Convert to Buddhism: 1935లో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఒక ప్రతిజ్ఞ చేశారు. ‘నేను హిందువుగా పుట్టాను గానీ, హిందువుగా మాత్రం చనిపోను’ అని స్పష్టంగా చెప్పారు. మహారాష్ట్ర నాశిక్ జిల్లాలోని యెవోలాలో జరిగిన ఓ సభలో ఆయన చేసిన ఈ వ్యాఖ్య అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. చెప్పినట్లే, సరిగ్గా 21 ఏళ్ల తర్వాత.. అంటే 1956 అక్టోబర్ 14న నాగ్‌పూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో లక్షలాది మంది సమక్షంలో ఆయన ఆ మాటను నిలబెట్టుకున్నారు. హిందూ మతాన్ని వీడి బౌద్ధాన్ని స్వీకరించారు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. అలా బౌద్ధంలోకి మారిన కేవలం 53 రోజులకే, అంటే డిసెంబర్ 6, 1956న ఆయన కన్నుమూశారు. భారత రాజ్యాంగాన్ని రచించి, చట్టరీత్యా అస్పృశ్యతను రద్దు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఓ మహోన్నత వ్యక్తి అంబేడ్కర్.. అసలు ఆయన హిందూ మతాన్ని ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? మరే ఇతర మత జోలికి వెళ్లకుండా ఒక్క బౌద్ధాన్నే ఎందుకు ఎంచుకున్నారు? పైగా “హిందువుగా చనిపోను” అని ప్రకటన చేసిన తర్వాత మరో మతంలోకి మారడానికి ఏకంగా 21 ఏళ్ల పాటు ఎందుకు వేచి చూశారు? వీటన్నింటికీ సమాధానాలు కావాలంటే.. ఆయన ఎదుర్కొన్న కుల వివక్ష, హిందూ సమాజంలో మార్పు తెచ్చేందుకు చేసిన పోరాటాలు, ఆత్మాభిమానం-సమానత్వం ఉన్న మతం కోసం ఆయన చేసిన అన్వేషణను అర్థం చేసుకోవాలి. ఇది చివరి రోజుల్లో ఉన్నట్టుండి తీసుకున్న తొందరపాటు నిర్ణయం ఎంతమాత్రం కాదు. దశాబ్దాల తరబడి ఆయన జరిపిన సైద్ధాంతిక పరిశోధన, ఆచరణాత్మక పోరాటాల ముగింపు.

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా మహద్ వద్ద ఉన్న చౌదార్ చెరువు ఘటన నుంచి.. నాగ్‌పూర్ లోని దీక్షాభూమి వరకు జరిగిన సుదీర్ఘ ప్రయాణాన్ని పరిశీలిస్తే అంబేడ్కర్ ఎందుకు హిందూ మతాన్ని వదులుకుని బౌద్ధాన్ని స్వీకరించారో క్లియర్‌గా అర్థమవుతుంది. అస్పృశ్యులుగా ముద్ర పడిన మహార్ సామాజిక వర్గంలో జన్మించిన అంబేడ్కర్‌కు చిన్నతనం నుంచే కుల వివక్ష చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లాంటి ప్రపంచ ప్రసిద్ధ సంస్థల్లో చదువుకుని గొప్ప మేధావిగా భారతదేశానికి తిరిగివచ్చినా కూడా, కుల ప్రాతిపదికన ఆయనకు అవమానాలు తప్పలేదు. మొదట్లో ఆయన హిందూ సమాజం పరిధిలోనే దళితులకు సమాన హక్కులు దక్కాలని పోరాడారు. 1927 మార్చిలో మహద్‌లోని చౌదార్ చెరువు నుంచి దళితులు కూడా నీళ్లు తాగే హక్కు ఉందంటూ వేలాదిమందితో కలిసి నీటిని తాగారు. అక్కడి మునిసిపాలిటీ ఆ చెరువును అందరికీ అందుబాటులోకి తెస్తామని తీర్మానం చేసినప్పటికీ, స్థానిక సవర్ణ హిందువులు దాన్ని తీవ్రంగా నిరసించారు. అంబేడ్కర్, ఆయన అనుచరులు ఆ నీటిని తాకి తాగినందుకు గాను.. ఆ చెరువు మైలపడిపోయిందంటూ శుద్ధి పూజలు కూడా చేశారు. ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి గురైన అంబేడ్కర్, అదే ఏడాది డిసెంబర్‌లో కుల వివక్షను, శూద్రుల-మహిళల అణచివేతను సమర్థిస్తోందని భావిస్తూ ‘మనుస్మృతి’ గ్రంథాన్ని బహిరంగంగా తగలేశారు.

ఆ తర్వాత 1930 మార్చిలో నాశిక్‌లోని ప్రసిద్ధ కాలారామ్ ఆలయంలోకి దళితులకు ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేస్తూ సుదీర్ఘ పోరాటం మొదలుపెట్టారు. ఈ ఉద్యమం ఏళ్ల తరబడి సాగినా, అక్కడి నుంచి వచ్చిన తీవ్ర ప్రతిఘటన ఆయనను తీవ్రంగా ఆలోచింపజేసింది. హిందూ సమాజాన్ని లోపలి నుంచి సంస్కరించడం, మార్చడం అసాధ్యమనే భావనకు ఆయన వచ్చారు. ఈ చేదు అనుభవాల తీవ్రతతోనే 1935 అక్టోబర్‌లో యెవోలా సభలో “నేను హిందువుగా చనిపోను” అని తెగేసి చెప్పారు. అయితే మతం మారతానని చెప్పిన అంబేడ్కర్, ఆ వెంటనే ఏదో ఒక మతంలోకి దూకేయలేదు. తర్వాతి మతం ఏది అనేదానిపై సుదీర్ఘంగా ఆలోచించారు. దాదాపు 21 ఏళ్ల పాటు ఆయన సిక్కు, క్రైస్తవ, ఇస్లాం, బౌద్ధ మతాలను లోతుగా అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో కేవలం మతపరమైన సిద్ధాంతాలే కాకుండా.. దళితుల భవిష్యత్తు, సామాజిక-రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయనే కోణంలో కూడా ఆలోచించారు. ఇక, 1936లో లాహోర్‌కు చెందిన ‘జాత్-పాత్ తోడక్ మండల్’ అనే హిందూ కుల నిర్మూలనా సంస్థ అంబేడ్కర్‌ను తమ వార్షిక సభకు అధ్యక్షుడిగా ఆహ్వానించింది. కానీ ఆయన సిద్ధం చేసిన ప్రసంగ ప్రతుల్లో ఉన్న కొన్ని అంశాలపై నిర్వాహకులు తీవ్ర అభ్యంతరం చెప్పడంతో ఆ సమావేశమే రద్దయింది. దాంతో అంబేడ్కర్ ఆ ఉపన్యాసాన్ని ‘అన్నిహిలేషన్ ఆఫ్ కాస్ట్’ (కుల నిర్మూలన) పేరుతో పుస్తకంగా ప్రచురించారు. కులాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే దానికి పునాదిగా ఉన్న హిందూ మతశాస్త్రాల ప్రామాణికతను, అధికారికతను ప్రశ్నించక తప్పదని ఆ పుస్తకంలో ఆయన చాలా ఘాటుగా తేల్చి చెప్పారు.

మరోవైపు ఆయనపై సామాజిక, రాజకీయ బాధ్యతలు పెరిగాయి. స్వాతంత్ర్య పోరాటంలో, దళితుల హక్కుల సాధనలో కీలక పాత్ర పోషించిన ఆయన.. స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. భారత రాజ్యాంగ రచనకు నేతృత్వం వహించే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ద్వారా అస్పృశ్యతను పూర్తిగా నిషేధించినప్పటికీ, చట్టపరమైన సమానత్వానికి, నిజమైన సామాజిక మార్పునకు చాలా తేడా ఉందని ఆయన భావించారు. క్షేత్రస్థాయిలో నిజమైన మార్పు రావాలంటే మతపరమైన, సామాజికపరమైన పరివర్తన చాలా అవసరమని నమ్మారు. ఇక అన్ని మతాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అంబేడ్కర్ బౌద్ధాన్ని ఎంచుకోవడానికి బలమైన కారణాలు ఉన్నాయి. బౌద్ధం బోధించే నైతికత, సమానత్వం, దయ, విచక్షణ, హేతుబద్ధత ఆయనను బాగా ఆకట్టుకున్నాయి. జన్మ ఆధారంగా కుల వ్యవస్థ లేని, పూజారుల ఆధిపత్యం లేని మతంగా ఆయన బౌద్ధాన్ని చూశారు. నైతిక ప్రవర్తన ఆధారంగా నడిచే బౌద్ధం మాత్రమే సమాజంలో సమానత్వానికి పునాది వేయగలదని విశ్వసించారు.

1956లో ఆయన రాసిన ‘ది బుద్ధ అండ్ హిస్ ధమ్మ’ (ఇది ఆయన మరణానంతరం 1957లో ప్రచురితమైంది) పుస్తక పీఠికలో తానెందుకు బౌద్ధాన్ని ఎంచుకున్నానో స్పష్టంగా రాశారు. “ఈ ప్రశ్నకు నా వద్ద ఉన్న సూటి సమాధానం ఏంటంటే.. బుద్ధుని ధర్మాన్నే నేను అత్యుత్తమమైనదిగా భావిస్తాను. ప్రపంచంలో ఏ మతం కూడా దీనితో సరితూగలేదు. ఒకవేళ సైన్స్ తెలిసిన ఆధునిక మానవుడికి ఏదైనా మతం కావాలనుకుంటే, అతనికి సరిపోయే ఏకైక మతం బుద్ధుని ధర్మం మాత్రమే” అని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. సామాజిక న్యాయం, మానవ సంబంధాలే కేంద్రంగా బౌద్ధానికి ఆయన ఇచ్చిన ఈ కొత్త వ్యాఖ్యానమే ‘నవయాన బౌద్ధం’ (Navayana Buddhism) గా రూపాంతరం చెంది, సాంప్రదాయ బౌద్ధ శాఖల కంటే ఒక ప్రత్యేక గుర్తింపును పొందింది.

చివరకు 1956 సెప్టెంబర్ 23న, విజయదశమి పండగను పురస్కరించుకుని అక్టోబర్ 14న నాగ్‌పూర్ వేదికగా తాను బౌద్ధ మతాన్ని స్వీకరిస్తున్నట్లు అంబేడ్కర్ అధికారికంగా ప్రకటించారు. చెప్పినట్లే నాగ్‌పూర్‌లోని దీక్షాభూమిలో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వయోవృద్ధ బౌద్ధ భిక్షువు భదంత చంద్రమణి చేతుల మీదుగా అంబేడ్కర్, ఆయన భార్య సవితా అంబేడ్కర్ (ఈమె పుట్టుకతో సారస్వత బ్రాహ్మణురాలు) త్రిశరణాలు, పంచశీల స్వీకరించి బౌద్ధంలోకి మారారు. ఆ తర్వాత అంబేడ్కర్ అక్కడ గుమిగూడిన లక్షలాది మందికి స్వయంగా 22 ప్రతిజ్ఞలు చేయించారు. హిందూ దేవుళ్లను, ఆచారాలను పూర్తిగా తిరస్కరిస్తూ, సమానత్వం, కరుణ, బౌద్ధ మార్గాన్ని అనుసరిస్తామని ఈ ప్రతిజ్ఞల ద్వారా ప్రమాణం చేయించారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి ఎంతమంది హాజరయ్యారనే దానిపై వేర్వేరు అంచనాలు ఉన్నప్పటికీ.. 1964లో ‘పంజాబ్‌రావ్ వర్సెస్ డి.పి. మేష్రామ్’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఈ సభకు సుమారు 5 లక్షల మంది హాజరైనట్లు నమోదు చేసింది. ఆధునిక భారత చరిత్రలోనే ఇది అత్యంత పెద్ద సంఖ్యలో జరిగిన మత మార్పిడి కార్యక్రమంగా నిలిచిపోయింది. మరుసటి రోజు అంటే అక్టోబర్ 15న తన అనుచరులను ఉద్దేశించి మాట్లాడుతూ.. 1935లో యెవోలాలో తాను చేసిన “హిందువుగా పుట్టాను కానీ హిందువుగా చనిపోను” అన్న ప్రకటనను గుర్తుచేస్తూ, “నిన్నటితో నా మాటను రుజువు చేసి చూపించాను” అని గర్వంగా ప్రకటించారు. అంతేకాదు, ఎవరూ తనను బ్లైండ్ గా అనుసరించవద్దని, కేవలం మనస్ఫూర్తిగా నమ్మకం కుదిరితేనే బౌద్ధంలోకి రావాలని, “నాకు గుడ్డిగా అనుసరించే అనుచరులు వద్దు” అని కుండబద్దలు కొట్టారు.

బౌద్ధంలోకి మారిన కేవలం 53 రోజులకే, డిసెంబర్ 6, 1956న 65 ఏళ్ల వయస్సులో ఢిల్లీలోని తన నివాసంలో అంబేడ్కర్ తుదిశ్వాస విడిచారు. చివరి రోజుల్లో ఆయన ఆరోగ్యం క్షీణించినప్పటికీ, తాను మరికొద్ది రోజుల్లో చనిపోతానని తెలిసి ఈ మార్పిడి నిర్ణయాన్ని వేగవంతం చేశారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. మరి 1935లో ప్రకటన చేశాక ఏకంగా 21 ఏళ్లు ఎందుకు ఆగాల్సి వచ్చిందనే దానికి అమెరికన్ చరిత్రకారిణి ఎలియనోర్ జెల్లియట్ తన ‘అంబేడ్కర్స్ వరల్డ్’ (2004) పుస్తకంలో ఒక చక్కటి విశ్లేషణ ఇచ్చారు. ఆమె విశ్లేషణ ప్రకారం.. అప్పట్లో అందుబాటులో ఉన్న ఏ మతం కూడా అంబేడ్కర్‌కు మేధోపరంగా, రాజకీయంగా పూర్తిస్థాయిలో సరిపోలేదు. అంతకంటే ముఖ్యంగా, ఆ సమయంలో రాజ్యాంగ మార్పుల కోసం పనిచేసే గొప్ప అవకాశాలు ఆయనకు లభించాయి. సవర్ణ హిందువుల మనసులను మార్చడం కంటే లేదా దళితుల కోసం కొత్తగా మతపరమైన ఉద్యమాలు నిర్మించడం కంటే.. చట్టపరంగా, రాజ్యాంగపరంగా హక్కులు సాధించడమే తన నైపుణ్యానికి సరిపోయే మార్గమని ఆయన భావించారు. అందుకే రాజ్యాంగ రూపకల్పన ప్రక్రియ పూర్తయ్యాకే ఆయన తన మత మార్పిడిపై దృష్టి పెట్టారు. అలా 1956లో బౌద్ధాన్ని స్వీకరించడం ద్వారా అంబేడ్కర్ తన 21 ఏళ్ల నాటి మాటను నిలబెట్టుకోవడమే కాకుండా, శతాబ్దాలుగా అణచివేతకు గురైన కోట్లాది మంది దళితులకు ఆత్మగౌరవంతో, సమానత్వంతో జీవించే ఒక కొత్త మార్గాన్ని చూపించారు.