Interesting Facts: 4,000 ఏళ్ల రహస్యం.. వారం 7 రోజులే ఎందుకు? అసలు నిజం ఇదే!

Why Are There 7 Days In A Week

Why Are There 7 Days In A Week

Interesting Facts: ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్లీ వారం చివరి సెలవు దాకా అందరి బతుకులు ఈ ఏడు రోజుల చుట్టే తిరుగుతూ ఉంటాయి. సంవత్సరానికి 365 రోజులు, నెలకు ముప్పై రోజుల దాకా ఉంటాయి.. మరి వారానికి మాత్రం ఏడు రోజులే ఎందుకు? ఎవరు గీశారు ఈ గీత? వాస్తవానికి ఇందులో పెద్ద కథే ఉంది. సుమారు నాలుగు వేల ఏళ్ల కిందట.. అంటే క్రీస్తుపూర్వం 2300 ప్రాంతంలో మెసొపొటేమియాలో ఉన్న సుమేరియన్లు, బాబిలోనియన్లు ఈ లెక్క వేశారని చరిత్ర చెబుతుంది.

అప్పట్లో ఇప్పుడున్నట్టు టెలిస్కోపులు లేవు. ఆకాశం వైపు తలెత్తి చూస్తే కంటికి కనిపించే ఏడు ప్రధాన ఖగోళ వస్తువులే వారికి పెద్ద లోకం. సూర్యుడు, చంద్రుడు, వీటితో పాటు కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని.. వీటినే పవిత్రమైన శక్తులుగా భావించారు వాళ్లు. ఆ ఏడింటి పేర్ల మీదుగానే రోజులకు పేర్లు పెట్టారట. మరోవైపు చంద్రుడు భూమి చుట్టూ ఒక రౌండ్ కొట్టడానికి ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిదిన్నర రోజులు పడుతుంది. దాన్ని సులభంగా లెక్కించుకోవడానికి నాలుగు భాగాలుగా విడగొడితే, ఒక్కో భాగం ఏడు రోజులుగా వచ్చింది. ఖగోళ లెక్కకూ, ఆ ఏడు వస్తువుల పవిత్రతకూ తోడుగా ఈ ఏడు రోజుల పద్ధతి అలా మొదలైందని చెబుతున్నారు.

కాలం గడిచేకొద్దీ ఇది కేవలం ఆకాశపు లెక్కలా మిగిలిపోలేదు. క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలో బాబిలోనియాలో బందీలుగా ఉన్న యూదులు ఈ ఏడు రోజుల పద్ధతిని అందిపుచ్చుకున్నారు. సృష్టి పనికి ఆరు రోజులు పట్టిందని, ఏడో రోజు విశ్రాంతి తీసుకోవాలని తమ నమ్మకాలతో కలిపేశారు. అప్పటిదాకా ఖగోళ లెక్కగా ఉన్న వారం, మనిషికి కాస్త ఊపిరి తీసుకునే విశ్రాంతి రోజుగా మారింది.

అయితే ప్రపంచమంతా ఇదే పద్ధతి పాటించడానికి ఒక చక్రవర్తి నిర్ణయం కారణమైంది. మొదట్లో రోమన్లు ఎనిమిది రోజుల వారాన్ని నడిపించేవాళ్లు. తర్వాత క్రీస్తుశకం 321లో రోమన్ చక్రవర్తి కాన్‌స్టాంటైన్ అధికారికంగా ఏడు రోజుల వారాన్ని క్యాలెండర్‌లో చేర్చారు. అంతేకాదు, ఆదివారాన్ని విశ్రాంతి, సెలవు రోజుగా ప్రకటించారు. అక్కడి నుంచి యూరప్ మీదుగా ప్రపంచం మొత్తం ఇదే దారి పట్టింది. ఇవాళ మన క్యాలెండర్‌లో కనిపించే ప్రతి వారం వెనుక ఇంత ప్రయాణం ఉంది. నాలుగు వేల ఏళ్ల కిందట ఆకాశంలో కనిపించిన ఆ ఏడు వస్తువుల ప్రభావం, మధ్యలో కలిసిన విశ్రాంతి ఆలోచన, చక్రవర్తి వేసిన ముద్ర ఇవన్నీ కలిసి మన రోజువారీ జీవితాన్ని ఇలా ఏడు రోజులుగా మలిచాయని అంటున్నారు.