Psychology Facts: రేపటి దుఃఖాన్ని ఈరోజే ఎందుకు అనుభవిస్తున్నాం? సైకాలజీ ఏం చెబుతోంది?

Psychology Facts

Psychology Facts

కొన్ని నిర్ణయాలు మన జీవితంలో జరగకముందే మనల్ని అలసిపోయేలా చేస్తాయి. కొన్ని మాటలు ఇంకా మన పెదవుల మీదే ఉంటాయి కానీ..ఆ విషయాలన్ని చెప్పిన తర్వాత ఎదుటి మనిషి కళ్లలో ఏం మారుతుందో మాత్రం మనసు ముందే వెతకడం మొదలుపెడుతుంది. అక్కడి నుంచి ఒక చిన్న భయం పుడుతుంది. ఆ భయం నెమ్మదిగా ఒక ప్రశ్నగా మారుతుంది. ఆ ప్రశ్నకు మనసే ఒక సమాధానం చెబుతుంది. ఆ సమాధానం మనకు నచ్చదు. అందుకే దాని తర్వాత ఏమవుతుందో కూడా ముందే ఊహించుకుంటాం.

అలా ఒక చిన్న మాటకు ముందు… ఒక పూర్తి కథ మనలో తయారైపోతుంది. కొన్ని కన్నీళ్లు కూడా వచ్చేస్తాయి. కొన్ని సంబంధాలు కూడా దూరమైపోతాయి. మనుషులను మనం ఇంకా కోల్పోకుండానే, వాళ్లను కోల్పోయిన బాధను అనుభవించేస్తాం. ఇది ఎంత విచిత్రమో కదా…ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది? సైకాలజీ ఏం చెబుతోంది?

ఎదుటి మనిషి ఇంకా మన పక్కనే ఉన్నాడు. అతని గొంతు ఇంకా మనకు వినిపిస్తోంది. మన మధ్య ఉన్న అనుబంధం ఇంకా అలాగే ఉంది. కానీ మనసు మాత్రం రేపటి రోజుకు వెళ్లిపోతుంది.. వారిని కోల్పోయి తిరిగి మళ్లి వర్తమానంలోకి వస్తుంది. ఇప్పటివరకు నన్ను అర్థం చేసుకున్న మనుషులు ఇకపై నన్ను అర్థం చేసుకోకపోతే నా బాధ ఎవరికి చెప్పుకోవాలనే భయం మొదలవుతుంది. నా గురించి నిజం విన్న తర్వాత వారి ప్రేమ మారిపోతే? అలా ఒక్కో ప్రశ్న మనసులో పడుతుంటే ఏదో కోల్పోయినట్టుగా గుండె బరువెక్కుతుంది.

మనిషి మెదడు ఇలాంటి భవిష్యత్తు దృశ్యాలను తయారు చేయగలదు. రేపటి ప్రమాదాన్ని ముందే ఊహించి, దానికి సిద్ధపడటం మనిషి మనుగడలో చాలా ముఖ్యమైన సామర్థ్యమే కానీ అదే సామర్థ్యం భయం ఎక్కువైనప్పుడు మన ప్రస్తుత భావోద్వేగాలపై కూడా ప్రభావం చూపుతుంది. 2020లో ప్రచురించిన ‘హౌ ఇమాజినింగ్ పర్సనల్ ఫ్యూచర్ సినారియోస్ ఇన్‌ఫ్లుయెన్సెస్ అఫెక్ట్’ అనే పరిశోధనలో 63 ప్రయోగాత్మక అధ్యయనాల నుంచి 6,813 మంది సమాచారాన్ని పరిశీలించారు. భవిష్యత్తులో జరగబోయే ఘటనలను మనసులో ఊహించుకోవడం ప్రస్తుత భావోద్వేగాలను ప్రభావితం చేయగలదని ఆ పరిశోధనలో తేలింది. అంటే.. రేపు ఇంకా మన చేతుల్లోకి రాకపోయినా… దాని నీడ మాత్రం ఈరోజే మన మీద పడొచ్చు.

ఇక్కడే మనసు కొన్నిసార్లు మనకు స్నేహితుడిలా, కొన్నిసార్లు మన భయానికి సహచరుడిలా మారుతుంది. ఏదైనా తప్పు జరగకముందే దాని గురించి ఆలోచించమంటుంది. ఎవరైనా మనల్ని వదిలిపెట్టకముందే వాళ్లు వెళ్లిపోయిన దృశ్యాన్ని చూపిస్తుంది. ఏదైనా సంబంధం మారకముందే దాని చివరి రోజును మన కళ్ల ముందు ఉంచుతుంది. ఏదైనా నిర్ణయం తీసుకోకముందే దాని తర్వాత వచ్చే బాధను మన గుండెల్లో పెట్టేస్తుంది. అందుకే కొన్నిసార్లు మనం భవిష్యత్తు కోసం సిద్ధపడటం లేదండి.. భవిష్యత్తులో ఉండాల్సిన భావాలను ఈరోజే అనుభవిస్తున్నాం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2021లో ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల 90లక్షల మంది యాంగ్జైటి సంబంధిత రుగ్మతలతో జీవించారు. ప్రపంచ జనాభాలో సుమారు 4.4 శాతం. అయితే ప్రతి భయమూ యాంగ్జైటి డిజార్డర్ కాదు. భయం ఎక్కువై, దాన్ని నియంత్రించడం కష్టమై, మన రోజువారీ జీవితం మీద ప్రభావం చూపినప్పుడు మాత్రమే అది ఆరోగ్య సమస్యగా మారే స్థాయికి వెళ్లవచ్చు. అందుకే రేపటి గురించి భయపడే ప్రతి మనిషిని బలహీనుడని అనలేం.

నిజానికి ఒక సంబంధం కావచ్చు.. ఒక కుటుంబం కావచ్చు.. ఒక కల కావచ్చు.. లేదా… తన గురించి ప్రపంచానికి చెప్పాల్సిన ఒక నిజం కావచ్చు. అందుకే వారి భయం వెనుక కూడా ప్రేమ ఉండొచ్చు. కానీ అక్కడ ఒక చిన్న నిజం మనం మర్చిపోతాం.. మనసు చూపించిన ప్రతి భవిష్యత్తు నిజం కాదు కదా.. మనసులో వినిపించిన ప్రతి సమాధానం ఎదుటి మనిషి చెప్పే సమాధానం కూడా కాదు. మన ఊహలో దూరమైన ప్రతి మనిషి నిజంగా మన జీవితాన్ని వదిలి వెళ్తారని కూడా చెప్పలేం. కొన్ని కన్నీళ్లు… ఇప్పటివరకు జరగని ఘటనలకు ముందుగానే చెల్లించిన ధరలు మాత్రమే. కొన్ని బాధలు… ఇంకా రాయని కథకు మనమే పెట్టుకున్న ముందుమాటలు మాత్రమే. అందుకే ఎప్పుడైనా రేపటి గురించి భయం గుండెల్లో నిండిపోతే… ఒక్కసారి ఆ భయాన్ని ప్రేమగా చూసుకోవాలి.

అంతేకాదు.. ఏం జరుగుతుందో తెలియకపోయినా, నిజం చెప్పాల్సిన రోజున దాన్ని ఎదుర్కొనేంత ధైర్యాన్ని మనలో ఉంచుకోవాలి.. ఎందుకంటే రేపు మనం ఊహించినట్టే ఉండకపోవచ్చు. కొన్ని సంబంధాలు నిజంగానే మారవచ్చు. కొన్ని దారులు మనం అనుకున్న చోటికి తీసుకెళ్లకపోవచ్చు. అది నిజమే. కానీ… అదే భవిష్యత్తు మన ఊహించిన దానికంటే అందంగా కూడా ఉండొచ్చు. మనకు భయంగా కనిపించిన మాటే ఒకరోజు మనసుకు విముక్తి కావచ్చు. మనసులో ఎన్నాళ్లుగానో దాచుకున్న నిజమే ఒకరోజు మనకు మనల్ని మనం పూర్తిగా అర్థం చేసుకునే అవకాశం కావచ్చు. మనల్ని వదిలిపోతారని భయపడిన మనిషే… మన పక్కనే నిలబడే మనిషి కావచ్చు.

అందుకే ఇంకా జరగని దుఃఖం కోసం నీ గుండెను ఇప్పుడు శిక్షించకు. ఇంకా కోల్పోని మనిషిని ముందే కోల్పోకు. ఇంకా రాని రోజును ముందే భయపడకు. ఎందుకంటే… ఇంకా జరగని జీవితానికి మనసు ముందే ఎన్నో ముగింపులు రాసుకుంటుంది.. ఆ ముగింపులన్నీ నిజం కాకపోయినా, వాటి బాధ మాత్రం మనసుకు అప్పటికే నిజంలా నొప్పిస్తుంది.