మనిషి అస్తిత్వాన్ని శాసించే అధికారం ఇప్పటికీ సమాజం దగ్గరే ఉండిపోయిందా? పుట్టినప్పుడు శరీరాన్ని చూసి ఒక లింగ గుర్తింపు ఇచ్చే సమాజం జీవితాంతం అదే గుర్తింపుతో బతకాలని నిర్ణయించకూడదు కదా. మనిషి తనను తాను ఎలా భావించాలి, ఎలా పరిచయం చేసుకోవాలి, ఏ పేరుతో పిలిపించుకోవాలన్నది కూడా సమాజమే శాసిస్తూ రాకూడదు. శతాబ్దాలుగా పురుషుడు, స్త్రీ అనే రెండు గీతల మధ్య ప్రపంచాన్ని విభజించి చూస్తున్న సమాజానికి, ఆ గీతలకు అవతల కూడా ఒక విశాలమైన మానవ అస్తిత్వం ఉందని గుర్తుచేస్తున్న మరో గొంతుక నాన్ బైనరీ. ప్రతి ఒక్కరికీ తమ అస్తిత్వాన్ని తామే నిర్వచించుకునే హక్కు ఉందని చాటుతున్న ఒక గుర్తింపు ఇది.
విద్యార్థి ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న AISA నేషనల్ ప్రెసిడెంట్ నేహా బోరా తనను తాను నాన్ బైనరీగా గుర్తించుకుంటున్నారు. తనను They లేదా Them అనే పదాలతో సంబోధించాలని కోరుకుంటున్నారు. ఈ అంశంపై నేహా చేసిన కామెంట్స్‌తో మరోసారి నాన్ బైనరీ గుర్తింపుపై చర్చ మొదలైంది. ఇంతకీ నాన్ బైనరీ అంటే ఏంటి? ఒక వ్యక్తి తనను పురుషుడిగా, స్త్రీగా కాకుండా మరో గుర్తింపుతో పరిచయం చేసుకోవడం వెనుక ఉన్న భావం ఏంటి? తెలుసుకుందాం.
అసలు నాన్ బైనరీ అంటే ఏంటి? చాలా సింపుల్‌గా చెప్పాలంటే.. ప్రతి మనిషి తనను పురుషుడిగానో, స్త్రీగానో మాత్రమే భావించాల్సిన అవసరం లేదు. కొందరు తమను ఈ రెండు గుర్తింపుల్లో ఏ ఒక్కదానికీ పూర్తిగా పరిమితం చేసుకోలేరు. మరికొందరు పురుష, స్త్రీ అనే రెండు గుర్తింపుల మధ్య తమను తాము అర్థం చేసుకుంటారు. ఇంకొందరు ఈ రెండింటికీ భిన్నమైన గుర్తింపుతో జీవిస్తారు. ఇలాంటి విభిన్నమైన జెండర్ ఐడెంటిటీలకు సంబంధించిన పదమే నాన్ బైనరీ.
ఒక్కమాటలో చెప్పాలంటే పురుషుడు, స్త్రీ అనే రెండు గుర్తింపుల్లో ఏ ఒక్కదానికీ పూర్తిగా ఇమడకుండా, వాటికి భిన్నంగా తమ జెండర్ ఐడెంటిటీని గుర్తించుకునే వ్యక్తులను నాన్ బైనరీ అంటారు.
అయితే ఇక్కడ మనం మూడు విషయాలను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. జెండర్ ఐడెంటిటీ వేరు, ప్రోనౌన్స్ వేరు, సెక్సువల్ ఓరియంటేషన్ వేరు. ఈ మూడింటినీ ఒకటిగా చూడకూడదు. జెండర్ ఐడెంటిటీ అంటే ఒక వ్యక్తి తనను తాను ఏ లింగానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు అనేది. ప్రోనౌన్స్ అంటే ఇతరులు తమ గురించి మాట్లాడేటప్పుడు ఏ పదాలు ఉపయోగించాలని కోరుకుంటున్నారు అనేది. ఇక సెక్సువల్ ఓరియంటేషన్ అంటే ఒక వ్యక్తి ఎవరిపట్ల ప్రేమ, ఆకర్షణ అనుభవిస్తున్నారు అనేది. ఈ మూడూ ఒకదానితో మరొకటి ముడిపడి ఉండాల్సిన అవసరం లేదు. నాన్ బైనరీ వారందరికీ They లేదా Them ప్రొనౌన్స్ వర్తిస్తాయ్ అని అర్థంకాదు.
మరి ఈ గుర్తింపుల గురించి సైన్స్ ఏం చెబుతోంది? ఒక వ్యక్తి తనను తాను ఎలా భావించుకుంటారు, ఏ జెండర్‌కు చెందినవారిగా గుర్తించుకుంటారు అనేదే జెండర్ ఐడెంటిటీ అని అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ చెబుతోంది. సైకాలజీ పరిశోధనలు కూడా మనుషుల జెండర్ అనుభవాలు ఒకే విధంగా ఉండవని గుర్తిస్తున్నాయి.
ఇక సైకియాట్రీ విషయానికి వస్తే, ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ఐసీడీ-11 వైద్య వర్గీకరణలో జెండర్ ఇన్‌కాంగ్రూయెన్స్‌ను మానసిక, ప్రవర్తనా రుగ్మతల విభాగం నుంచి ఎప్పుడో తొలగించింది.. ట్రాన్స్‌జెండర్, నాన్ బైనరీ లేదా ఏ జెండర్ డైవర్స్ వ్యక్తుల గుర్తింపులను కూడా మానసిక రుగ్మతగా చూడకూడదనే తేల్చింది. ఇక They లేదా Them ప్రొనౌన్స్ విషయానికి వస్తే.. ఇంగ్లిష్‌లో సాధారణంగా ఒకరి కంటే ఎక్కువమందిని సూచించడానికి ఉపయోగించే They అనే పదాన్ని, ఒకే వ్యక్తిని సూచించడానికి కూడా ఉపయోగిస్తారు. దీన్నే సింగ్యులర్ They అని పిలుస్తారు. అందుకే ఒక వ్యక్తి తనను They లేదా Themతో సంబోధించాలని కోరుకుంటే, ఆ విధంగానే పిలవాలి.
మొదట్లో మనకు కొంత కొత్తగా అనిపించవచ్చు, అలవాటు లేకపోవచ్చు కానీ ఒక వ్యక్తి తన గుర్తింపు గురించి చెప్పిన తర్వాత కూడా అదే పాత సంబోధనను కొనసాగించడం వారి అస్తిత్వాన్ని గౌరవించకపోవడమే అవుతుంది. మనకు అలవాటు లేని పదాలను నేర్చుకోవడానికి కొంత ప్రయత్నం చేయడం పెద్ద విషయమేమీ కాదు. కొంచెం టైమ్ పట్టినా.. మొదట్లో పొరపాటు జరిగినా తర్వాత నార్మల్ అయిపోతుంది.
తెలుగు భాషలోనూ ఒక వ్యక్తిని వారి పేరుతో పిలవొచ్చు. They లేదా Them ఇంగ్లిష్ పదాల కోసం సందర్భాన్ని బట్టి తెలుగులో వారు, వారి, తను, తాను లాంటి పదాలను ఉపయోగించవచ్చు. ఇక్కడ పదం కంటే ఆ పదం వెనుక ఉన్న గౌరవం ముఖ్యం. ఒక వ్యక్తిని ఎలా సంబోధించాలో తెలియకపోతే వారినే అడిగి తెలుసుకోవచ్చు. తప్పుగా పిలిచామని తెలిసినప్పుడు సరిదిద్దుకోవచ్చు. మనం ఉపయోగించే భాషలో కొంచెం మార్పు ఎదుటివారికి ఎంతో గౌరవాన్ని ఇచ్చినట్టు అవుతుంది.
నిజానికి మన సమాజంలో ఎన్నో రకాల మనుషులు ఉన్నారు. వారి అనుభవాలు, ఆలోచనలు, గుర్తింపులు కూడా విభిన్నమైనవి. మనకు చిన్నప్పటి నుంచి తెలిసిన ప్రపంచమే మొత్తం ప్రపంచమని భావించడం మన అవగాహనను పరిమితం చేస్తుంది. మనకు తెలిసిన సంప్రదాయాలే అందరికీ వర్తించాలని ఆశించడం మనుషుల మధ్య ఉన్న వైవిధ్యాన్ని విస్మరించడమే అవుతుంది. కొత్త విషయాన్ని తెలుసుకోవడం, భిన్నమైన గుర్తింపులను అర్థం చేసుకోవడం, ఎదుటివారి అస్తిత్వాన్ని గౌరవించడం ఇప్పటి సమాజంలో చాలా అవసరం కూడా. ఎందుకంటే గుర్తింపు కోసం ఒక మనిషి సమాజంతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ పోరాటంలో కనీసం మన భాష వారి గాయాలకు కారణం కాకూడదు.
ఒక వ్యక్తి తన గురించి తాను చెప్పుకునే హక్కును గౌరవించడం, వారు కోరుకున్న విధంగా సంబోధించడం, వారి అస్తిత్వాన్ని అంగీకరించడం.. ఇవి ఎవరికో మనం ఇచ్చే ప్రత్యేకమైన మినహాయింపులు కావు. ప్రతి మనిషికీ దక్కాల్సిన కనీస గౌరవం. మనుషులందరూ ఒకేలా ఉండాలని కోరుకునే సమాజం కంటే, భిన్నంగా ఉన్న ప్రతి ఒక్కరికీ సమానమైన చోటు కల్పించే సమాజమే నిజమైన సమాజం. సో.. అర్థమైంది కదా.. నేహా బోరా తనని తాను స్త్రీ లేదా పురుషుడిగా భావించుకోవడంలేదు.. ప్రొనౌన్స్‌లోనూ వారి, వారు, తను, తాను లాంటి పదాలను కోరుకుంటుంది. ఇప్పటికే కొన్ని న్యూస్ మీడియా సంస్థలు కూడా నేహా సెల్ఫ్ ఐడెంటీటిని గౌరవించే పదాలనే ఉపయోగించడం అలవాటు చేసుకుంది కూడా!

