వాతావరణంలో జరుగుతున్న మార్పుల నుంచి వార్తల్లో చూసి వదిలేస్తాం గానీ.. అది సృష్టించబోయే విధ్వంసం మన వరకు వస్తుందంటే మాత్రం కాళ్లలో వణుకు వస్తుంది. అతి త్వరలోనే సూపర్ ఎల్‌నినో అలాంటి విధ్వంసాన్ని సృష్టించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను తీసేయబోతోంది. అందులో మన దేశం కూడా ఉంది.
వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులపై పర్యావరణ వేత్తలు ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న భూతాపం మున్ముందు ఎటు దారితీస్తుందనే చర్చ గ్లోబల్ వేదికలపై నిరంతరం జరుగుతూనే ఉంది. తాజాగా సూపర్ ఎల్‌నినో ప్రభావంపై వచ్చిన కొత్త లెక్కలు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇది కేవలం హెచ్చరిక కాదు.. భవిష్యత్తులో జరగబోయే పెను వినాశనానికి కళ్లకు కట్టే సాక్ష్యం. చికాగో యూనివర్సిటీకి చెందిన ప్రతిష్టాత్మక క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ తాజాగా ఒక సంచలన రిపోర్ట్ బయటపెట్టింది.
సెప్టెంబర్ 2026 నుంచి ఫిబ్రవరి 2027 మధ్యకాలంలో అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అదనంగా 2 లక్షల 39 వేల మంది మరణించే అవకాశం ఉందని ఒక షాకింగ్ అంచనా వేసింది. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలపై ఈ ప్రాణనష్టం ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతోందని స్పష్టం చేసింది. జూన్ 2026లో ఎల్ నినో మొదలైనప్పటి నుంచి ఫిబ్రవరి 2027 వరకు పూర్తి స్థాయిలో చూసుకుంటే.. ఏకంగా 4 లక్షల 51 వేల మంది ప్రాణాలు కోల్పోతారని హెచ్చరించింది. అసాధారణమైన వేడిగాలులు 2027 మధ్యకాలం వరకు కొనసాగుతాయని… దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ ఎల్‌నినో దెబ్బకు ఏయే దేశాల్లో ఎంత ప్రాణనష్టం జరుగుతుందనే దానిపైనా స్పష్టమైన లెక్కలు ఈ రిపోర్టులో బయటకొచ్చాయి. భౌగోళిక పరిస్థితులను బట్టి ఆఫ్రికాలోని సాహెల్ ప్రాంతంలో అత్యధికంగా 66 వేల 800 మంది వడగాల్పులకు బలవుతారని అంచనా. నైజీరియాలో 31 వేల 400 మంది మృత్యువాత పడే ప్రమాదం పొంచి ఉంది. ఇండోనేషియాలో 19 వేల 300 మంది ప్రాణాలు కోల్పోయే ఛాన్స్ ఉంది. ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయ్‌లాండ్ లాంటి ఆగ్నేయాసియా దేశాల్లో ఏకంగా 19 వేల 400 మంది మరణిస్తారని రిపోర్ట్ కుండబద్దలు కొట్టింది. బ్రెజిల్‌లో కూడా 13 వేల 300 మంది దాకా చనిపోయే అవకాశం కనిపిస్తోంది. వాతావరణంలో విపరీతమైన మార్పుల కారణంగా ముఖ్యంగా డిసెంబర్ 2026 నుంచి ఫిబ్రవరి 2027 మధ్య ఈ మరణాల రేటు ఊహించని స్థాయిలో పీక్స్‌లో ఉండబోతోంది.
ఈ గ్లోబల్ వార్మింగ్ ముప్పు నుంచి భారత్ కూడా సురక్షితంగా ఏమీ లేదు. మన దేశంలో రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరుకోబోతోంది. ఈ సూపర్ ఎల్ నినో కారణంగా భారత్‌లో అదనంగా 15 వేల 800 మంది ప్రాణాలు కోల్పోతారని క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ చేసిన అంచనా కలకలం రేపుతోంది. ఇందులో సగానికి పైగా మరణాలు కేవలం మూడు నెలల వ్యవధిలోనే సంభవించే ప్రమాదం ఉండటం మరింత ఆందోళన కలిగించే అంశం. డిసెంబర్ 2026 నుంచి ఫిబ్రవరి 2027 మధ్య కాలంలోనే భారత్‌లో 7వేల 400 మంది వడగాల్పులకు బలవుతారని సైంటిస్టులు హెచ్చరించారు. ఈ ఆరు నెలల తర్వాత కూడా భారత్‌లో ఈ ఎల్ నినో ముప్పు ముగిసిపోదు. 2027 వేసవి నాటికి భారత్, పాకిస్థాన్‌లలో ఉష్ణోగ్రతలు మరింత దారుణంగా పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న ఈ అత్యధిక ఉష్ణోగ్రతలు భవిష్యత్తులో రాబోయే పెను ప్రమాదానికి ఒక ట్రైలర్ లాంటివని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాబోయే నెలల్లో భూమి ఉష్ణోగ్రతలు ఏకంగా సాధారణం కంటే 1.2 డిగ్రీల సెల్సియస్ మేర పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న ఈ ఎల్ నినో పరిస్థితుల వల్ల సాధారణ సంవత్సరంతో పోలిస్తే అతి భయంకరమైన ఎండల రోజులు 44 శాతం ఎక్కువగా నమోదవుతాయని అంచనా. రాబోయే 20 ఏళ్లలో ఈ ఎల్ నినో ఉష్ణోగ్రతలే మనకు సాధారణ దైనందిన జీవితంలో భాగమైపోతాయని శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటల మీద వాతావరణ ప్రభావం గురించి మాత్రమే ఇప్పటిదాకా అంచనా వేయగలిగామని.. ఇప్పుడు ఏకంగా లక్షలాది మనుషుల ప్రాణాలపై పడే ప్రభావాన్ని లెక్కించాల్సి వస్తోందని ఈ స్టడీలో పాల్గొన్న ప్రొఫెసర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాబోయే అతిపెద్ద వాతావరణ విపత్తు నుంచి ప్రజల ప్రాణాలను కాపాడుకోవాలంటే ప్రభుత్వాలు తక్షణమే మేల్కొనాల్సిన అవసరం ఉంది. వేల సంఖ్యలో జనం పిట్టల్లా రాలిపోకుండా కాపాడేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి. ఎప్పటికప్పుడు హెల్త్ వార్నింగ్స్ జారీ చేయడం, వృద్ధులు, చిన్నారులను కాపాడేందుకు వైద్యపరంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం అత్యవసరం. ప్రాణాలు నిలబెట్టే చల్లదనం అందించే కూలింగ్ సెంటర్లు, డీహైడ్రేషన్ బారిన పడకుండా హైడ్రేషన్ స్టేషన్లు యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలి. ఆరుబయట పనిచేసే కార్మికులకు సరైన రక్షణ కల్పించేలా కఠిన నిబంధనలు తేవాలి. కేవలం తాత్కాలిక, అత్యవసర చర్యలు మాత్రమే సరిపోవని.. హీట్ యాక్షన్ ప్లాన్స్ లాంటి దీర్ఘకాలిక ప్రణాళికలు కూడా అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు.

