Russia Vs Ukraine: 3000కిలోల బరువున్న బాంబును విసిరింది.. యుద్ధంలో గేర్‌ మార్చిన రష్యా!

What Is Fab 3000

What Is Fab 3000

రష్యా-యుక్రెయిన్ యుద్ధం మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఏకంగా 3,000 కిలోల బరువున్న మహా బాంబును యుక్రెయిన్‌పై ప్రయోగించింది. దీనికారణంగా పేలుడు జరిగిన క్షణాల్లోనే ఆకాశాన్ని నల్లటి పొగ కమ్మేసింది. ఈ దాడి వీడియోను రష్యా స్వయంగా విడుదల చేయడంతో యుద్ధం మరింత ప్రమాదకర దశలోకి వెళ్లిందనే ఆందోళన పెరిగింది.

మరోవైపు రష్యాలోని చమురు శుద్ధి కేంద్రాలు, సైనిక స్థావరాలపై దీర్ఘశ్రేణి డ్రోన్ దాడులను యుక్రెయిన్ పెంచింది. దీనికి మరింత శక్తివంతమైన సమాధానం ఇస్తామని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన కొద్ది రోజులకే ఈ భారీ బాంబు దాడి జరగింది.

FAB 3000 అంటే ఏంటి?

ఈ బాంబు పేరు FAB 3000. ఇందులో 3000 అంటే దీని మొత్తం బరువు సుమారు 3,000 కిలోలు అని అర్థం. ఈ బాంబులో దాదాపు 1,200 నుంచి 1,400 కిలోల వరకు అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థం ఉంటుంది. మిగిలిన భాగం మందమైన ఉక్కు కవచంతో తయారవుతుంది. ఈ బాంబును సాధారణ భవనాలను ధ్వంసం చేయడానికి కాకుండా.. భూమిలో లోతుగా నిర్మించిన బంకర్లు, భారీ సైనిక స్థావరాలు, పరిశ్రమలు, కాంక్రీట్ రక్షణ గోడలు, ఒకేసారి పెద్ద ఎత్తున సైనిక బలగాలను నాశనం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించారు.

ఈ బాంబు పనిచేసే విధానం కూడా అత్యంత భయంకరంగా ఉంటుంది. యుద్ధ విమానం నుంచి వదిలిన తర్వాత ఇది అత్యంత వేగంతో లక్ష్యంపై దూసుకెళ్తుంది. పేలిన క్షణంలో విడుదలయ్యే అపార శక్తి చుట్టూ ఉన్న గాలిని ఒక్కసారిగా బయటకు నెట్టేస్తుంది. దీన్నే షాక్ వేవ్ అంటారు. ఈ ఒత్తిడి తరంగం కాంక్రీట్ భవనాలను కూడా పగలగొట్టగలదు. భూమిలో లోతుగా ఉన్న బంకర్లను కూల్చగలదు. రక్షణ కోసం తవ్విన ట్రెంచ్‌లను కూడా పూర్తిగా కప్పగలదు. నేలలో భారీ గుంత ఏర్పడటమే కాకుండా పేలుడు కేంద్రానికి వందల మీటర్ల దూరంలో ఉన్న భవనాలు కూడా తీవ్రంగా దెబ్బతింటాయి. ఇది అణుబాంబు కాదు కానీ ప్రస్తుతం యుద్ధంలో ఉపయోగిస్తున్న అత్యంత శక్తివంతమైన సంప్రదాయ బాంబుల్లో ఒకటిగా సైనిక నిపుణులు చెబుతున్నారు.

FAB3000ను గతంలో ఎప్పుడు ప్రయోగించారు?

అయితే ఈ బాంబు కొత్త ఆయుధమేమీ కాదు. సోవియట్ యూనియన్ కాలంలోనే దీన్ని అభివృద్ధి చేశారు. మొదటిసారిగా 1980లలో సోవియట్-ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో ఉపయోగించారు. ఆ తర్వాత ఆధునిక క్షిపణులు రావడంతో ఈ భారీ బాంబులు దాదాపు గిడ్డంగుల్లోనే నిల్వ ఉండిపోయాయి. కానీ యుక్రెయిన్‌పై పూర్తి స్థాయి దాడిని 2022లో ప్రారంభించిన తర్వాత రష్యా మళ్లీ ఈ బాంబులను బయటకు తీసింది.

ప్రారంభంలో వీటిని సాధారణ బాంబుల్లా ఉపయోగించారు. తర్వాత ఆధునిక సాంకేతికతతో వీటిని మరింత ప్రమాదకరంగా మార్చింది. అదే ఈ బాంబు విజయానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. రష్యా దీనికి UMPK అనే ప్రత్యేక గైడెన్స్ వ్యవస్థను అమర్చింది. దీనివల్ల ఈ భారీ బాంబుకు రెక్కల్లాంటి నిర్మాణం, దిశను సరిచేసే సాంకేతికత లభించింది. ఇప్పుడు యుద్ధ విమానాలు లక్ష్యానికి చాలా దూరంలో నుంచే ఈ బాంబును వదిలేయగలవు. ఆ తర్వాత అది గాలిలో చాలా దూరం ప్రయాణించి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటుంది. దీంతో విమానాలు యుక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థలకు దగ్గరగా వెళ్లాల్సిన అవసరం ఉండదు. విమానం సురక్షిత దూరంలో ఉండగానే భారీ విధ్వంసాన్ని సృష్టించే అవకాశం లభిస్తోంది.

అయితే రష్యా ఎందుకు మళ్లీ సోవియట్ కాలం నాటి బాంబులనే ఉపయోగిస్తోందనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఖర్చు. క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు తయారు చేయడానికి భారీ వ్యయం అవుతుంది. కానీ ఇప్పటికే నిల్వలో ఉన్న FAB 3000 బాంబులకు UMPK గైడెన్స్ కిట్ అమర్చితే తక్కువ ఖర్చుతోనే అత్యంత కచ్చితత్వంతో దాడి చేసే ఆయుధంగా మారిపోతాయి.

అంటే పాత బాంబుకు కొత్త సాంకేతికతను జోడించి మళ్లీ యుద్ధభూమిలోకి తీసుకొచ్చినట్టే. దీనివల్ల రష్యా ఖరీదైన క్షిపణులను భవిష్యత్తు కోసం నిల్వ ఉంచుకుంటూనే, నిరంతర వైమానిక దాడులను కొనసాగించగలుగుతోంది. మరోవైపు యుక్రెయిన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. 1,500 కిలోమీటర్ల వరకు ప్రయాణించే దీర్ఘశ్రేణి డ్రోన్లతో రష్యాలోని చమురు శుద్ధి కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలు, సైనిక స్థావరాలపై వరుస దాడులు చేస్తోంది.

ఈ దాడులతో రష్యా సరఫరా వ్యవస్థను దెబ్బతీయాలని యుక్రెయిన్ ప్రయత్నిస్తోంది. దీనికి ప్రతీకారంగా రష్యా ఇప్పుడు FAB 3000 లాంటి భారీ గ్లైడ్ బాంబుల వినియోగాన్ని పెంచుతోంది. దీంతో ఈ యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య పోరాటంగా కాకుండా, ఒకవైపు అత్యాధునిక డ్రోన్ సాంకేతికత, మరోవైపు సోవియట్ కాలం నాటి మహా బాంబులు కలిసి ఆధునిక యుద్ధానికి కొత్త రూపాన్ని చూపిస్తున్నాయని సైనిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.