Psychology Facts: ‘నాకు ఎవరికీ చెప్పాలని లేదు..’ ఈ మాట వెనుక అంతులేని వేదన!

Psychology Facts (1)

Psychology Facts (1)

కొన్ని మనసులు తలుపులు వేసుకుని ఏడవవు. అవి కిటికీలు తెరిచి ఉంచుతాయి. బయట ప్రపంచం ఎప్పటిలాగే లోపలికి వస్తూనే ఉంటుంది. ఉదయం సూర్యకాంతి వస్తుంది. మనుషుల మాటలు వస్తాయి. ఫోన్ కాల్స్ వస్తాయి. నవ్వులు వస్తాయి. రోజూ జరిగే చిన్న చిన్న పనులన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ మనసు మాత్రం ఎక్కడో ఒక మూలన కూర్చుని ఉంటుంది.

ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? అసలేం జరిగిందని చెప్పాలి? వారిది ఒక్క బాధ కాదు. చాలా రోజులుగా మనసులో పేరుకుపోయిన చిన్న చిన్న విషయాలన్నీ కలిసి ఒక పెద్ద బరువుగా మారిపోయాయి. అది ఎక్కడ మొదలైందో కూడా గుర్తుండదు. ఒకరోజు ఆఫీసులో ఎవరో అన్న మాట కావచ్చు. చిన్నప్పుడు మిగిలిపోయిన ఒక జ్ఞాపకం కావచ్చు. ఒక సంబంధం నెమ్మదిగా దూరమైపోవడం కావచ్చు. ఎంత ప్రయత్నించినా మనం అనుకున్న చోటికి జీవితం వెళ్లకపోవడం కావచ్చు.

ఇవన్నీ కలిపి మనసులో ఒక మబ్బులా పేరుకుంటాయి. అప్పుడు ఎవరో దగ్గరికి వచ్చి… ఏమైంది? అని అడిగితే… ఏమీ లేదు అనే రెండు మాటలు బయటకు వస్తాయి. ఆ రెండు మాటలు ఎంత చిన్నవో కదా. కానీ కొన్నిసార్లు ఒక మనిషి జీవితంలో చెప్పలేని కథ అంతా ఆ రెండు మాటల వెనకే ఉంటుంది. ఎందుకంటే బాధను అనుభవించడం ఒక విషయం. దాన్ని ఇంకొక మనిషి ముందు బయటపెట్టడం మరో విషయం. మనసులో ఉన్నదాన్ని మాటల్లో పెట్టడానికి మనిషికి తన బాధకన్నా ఎక్కువ ధైర్యం కావాల్సి రావచ్చు. ఎందుకంటే మనం మాట్లాడటం మొదలుపెట్టిన వెంటనే ఒక భయం మొదలవుతుంది. వాళ్లు నన్ను అర్థం చేసుకుంటారా? నన్ను తప్పుగా అనుకుంటారా? నేను ఇంత చిన్న విషయానికే ఎందుకు బాధపడుతున్నానని నవ్వుతారా? లేదా… నా బాధ వాళ్లకు భారంగా మారుతుందా? అందుకే చాలామంది తమ బాధను బయటకు పంపకుండా లోపలే పెట్టుకుంటారు.

నిజానికి మనసు కూడా ఒక గదిలాంటిదే. లోపల ఏదైనా ఎక్కువసేపు మూసి పెడితే గాలి మారుతుంది. అలాగే భావాలను ఎప్పటికప్పుడు అణచిపెడుతూ ఉండటం మనుషులతో మన సంబంధాలపై ప్రభావం చూపుతుంది.

43 పరిశోధనలను, 100కు పైగా ఫలితాలను కలిపి చేసిన ఒక పెద్ద విశ్లేషణలో భావాలను ఎక్కువగా అణచిపెట్టే వాళ్లలో సామాజిక మద్దతు తక్కువగా ఉండటం, సంబంధాల పట్ల సంతృప్తి తగ్గడం లాంటి విషయాలతో సంబంధం. ఎందుకంటే బాధలో ఉన్నప్పుడు మనుషుల్ని కూడా మనకు దూరం చేస్తుంటాం. మొదట ఒక ఫోన్ కాల్ మిస్ అవుతుంది. తర్వాత ఒక మెసేజ్‌కు రిప్లై ఇవ్వం. ఆ తర్వాత ఎవరో పిలిచినా వెళ్లం. ఎందుకంటే మనసులో ఒక చిన్న మాట ఉంటుంది. ఇప్పుడు ఎవరితో మాట్లాడాలని లేదు అనిపిస్తుంది. అది కొంతకాలం సహజమే. మనసుకు విశ్రాంతి కావచ్చు. కానీ అదే మౌనం రోజులు గడిచేకొద్దీ అలవాటైపోతే… మన చుట్టూ ఉన్న వాళ్లు మన దగ్గరకు రావడం మానేయవచ్చు. మనకు వాళ్లు అవసరం లేదని వాళ్లు అనుకోవచ్చు. వాళ్లకు మనం అవసరం లేదని మనం అనుకోవచ్చు. ఇద్దరి మధ్య ఎవరూ నిజం చెప్పకుండానే ఒక దూరం పెరుగుతుంది.

అక్కడే ఒంటరితనం మొదలవుతుంది. ఒంటరితనం అంటే చుట్టూ ఒక్క మనిషి కూడా లేకపోవడం కాదండి.. మనసుకు కావాల్సినంత అనుబంధం లేకపోవడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అంచనాల ప్రకారం ప్రపంచంలో దాదాపు ప్రతి ఆరుగురిలో ఒకరు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. యువతలో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంది. 13 నుంచి 29 సంవత్సరాల వయసులో ఉన్నవారిలో దాదాపు ఐదుగురిలో ఒకరు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.

ఈ విధంగా చూస్తే మనుషులతో నిండిన ఈ ప్రపంచంలోనే చాలా మంది తమలో తాము ఒంటరిగా నడుస్తున్నారు. బస్సులో మన పక్కన ఎవరో కూర్చుని ఉండొచ్చు. ఆఫీసులో మనతో పది మంది మాట్లాడొచ్చు. ఫోన్‌లో వందల మంది పరిచయాలు ఉండొచ్చు. కానీ మనసులోని ఒక మాట మాత్రం ఎవరికీ చేరకపోతే… ఆ జనాల మధ్య కూడా మనిషి ఒంటరిగానే ఉండొచ్చు. అందుకే మనం చెప్పేది వినే మనిషి కావాలి.

మన బాధను లెక్కగట్టకుండా, జడ్జ్ చేయకుండా పక్కనే కూర్చునే ఒక మనిషి ఉండాలి. మనకు సమాధానం తెలియకపోయినా… మనతోనే ఉండే ఆ మనిషి కావాలి. ఎందుకంటే బాధను వెంటనే పోగొట్టలేకపోయినా, బాధను ఒంటరిగా మోసే అవసరం లేకుండా ఉంటుంది. అందుకే నీ చుట్టూ ఎవరైనా ఈ మధ్య చాలా మారిపోయినట్టు కనిపిస్తే… ఎప్పుడూ నవ్వే మనిషి ఒక్కసారిగా మౌనంగా మారితే… ఎప్పుడూ అందరితో ఉండే మనిషి ఒంటరిగా ఉండటం మొదలుపెడితే… వాళ్లను వెంటనే ప్రశ్నలతో చుట్టేయాల్సిన అవసరం లేదు.

కొన్నిసార్లు దగ్గరగా ఉండటం చాలు. ఒక టీ తాగుదామా అని అడగడం చాలు. ఏమీ మాట్లాడకపోయినా పర్లేదు అని చెప్పడం చాలు. ఎందుకంటే మనిషి తన బాధను చెప్పడానికి సిద్ధంగా లేకపోవచ్చు. కానీ… తాను చెప్పే రోజు వచ్చే వరకు ఎవరో ఒకరు తన దగ్గరే ఉంటే బాగుంటుందని మాత్రం కోరుకోవచ్చు. బహుశా అందుకే కొన్ని మౌనాలకు మాటలకంటే ఎక్కువ అర్థం ఉంటుంది.

ఎవరైనా… ‘నాకు ఎవరికీ చెప్పాలని లేదు…’ అంటే… వాళ్లకు ఎవరూ అవసరం లేదని కాదు. వారిని నిజంగా అర్థం చేసుకునే ఒక్క మనిషి కోసం వాళ్ల మనసు ఇంకా వెతుకుతూనే ఉందేమో అని అర్థంకావొచ్చు. మనిషి ఎంత బలంగా కనిపించినా… కొన్ని రాత్రుల్లో తన బాధను తన ఒడిలో పెట్టుకుని కూర్చోవాల్సి వస్తుంది. అప్పుడు ప్రపంచం మొత్తం అవసరం ఉండకపోవచ్చు.

ఒక్క మనిషి చాలు. తీర్పు చెప్పని ఒక మనిషి., తొందరపడని ఒక మనిషి.. నీ మౌనాన్ని కూడా ఒక మాటలాగే వినగలిగే ఒక మనిషి. ఎందుకంటే.. కొన్ని మనసులు సహాయం అడగవు. అవి కేవలం… ఎవరైనా తమ మౌనాన్ని గమనిస్తారేమో అని ఎదురు చూస్తాయండి!