Explainer: చట్టం పోలీసులకు చుట్టమా? శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో అమాయకులు ఎలా బలైపోతున్నారు?

Use Of Police Force

Use Of Police Force

పోలీస్ వ్యవస్థ పౌరుల రక్షణ కోసమా… లేక భయాందోళనలు సృష్టించడం కోసమా? నిరసనకారులపై లాఠీఛార్జీలు, టియర్ గ్యాస్ ప్రయోగాలు చూస్తున్నప్పుడు ప్రతీ ఒక్కరి మనసులో మెదిలే ప్రశ్న ఇది. ఇటీవల విడుదలైన స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా సర్వే నివేదిక అనేక దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించింది. దేశంలో 70 శాతానికి పైగా పోలీసులు బలప్రయోగం చేసినా తమపై ఎలాంటి విచారణ గానీ.. శిక్ష గానీ ఉండకూడదని కోరుకుంటున్నారు. అసలు చట్టం ఏం చెబుతోంది? పోలీసుల మానసిక ధోరణి ఎలా ఉంది? ఎన్‌సిఆర్‌బి లెక్కలు నిజాలను ఎలా దాచిపెడుతున్నాయి?

జంతర్ మంతర్‌లో విద్యార్థుల ఆందోళనలపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే బలప్రయోగానికి దిగడంపై హక్కుల సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత ప్రకారం ఎలాంటి గుంపునైనా చెదరగొట్టడానికి నోటీసులు ఇచ్చిన తర్వాతే బలప్రయోగం చేయాలి. మానవ హక్కుల కమిషన్ నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్, హెచ్చరికల తర్వాతే అత్యల్ప బలాన్ని ఉపయోగించాలి. కానీ స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా 2025 సర్వేలో వెల్లడైన నిజాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. 17 రాష్ట్రాల్లోని 8,276 మంది పోలీసుల అభిప్రాయాలను సేకరించగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.

పోలీసు శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఎక్కువ మంది తమ చర్యలపై ఎలాంటి విచారణ ఉండకూడదని భావిస్తున్నారు. ఈ సర్వేలో వెల్లడైన గణాంకాలు దేశంలో పోలీసుల అధికార దుర్వినియోగానికి అద్దం పడుతున్నాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 70 శాతానికి పైగా పోలీసులు బాధ్యతల నిర్వహణలో బలప్రయోగం చేసినా తమపై ఎలాంటి శిక్ష పడకూడదని స్పష్టం చేశారు. కోర్టు విచారణ లేకుండానే అనుమానితులను అరెస్టు చేసి డిటైన్ చేసే అధికారం పోలీసులకు ఉండాలని 69 శాతం మంది కోరుకుంటున్నారు. . ప్రజల్లో భయం పుట్టించడానికి కఠిన పద్ధతులు ఉపయోగించడం అత్యంత అవసరమని 55 శాతం మంది పోలీసులు అభిప్రాయపడ్డారు.

నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరించడానికి సమాజం నుంచి వస్తున్న ఒత్తిడే కారణమని పోలీసులు చెబుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో అమాయకులు సైతం పోలీసుల ఆగడాలకు బలవుతున్నారు. నిందితులపై తీవ్రంగా విరుచుకుపడటానికి ప్రజల ఒత్తిడే ప్రధాన కారణమని మూడింట రెండు వంతుల మంది పోలీసులు చెబుతున్నారు. . నేరాల నియంత్రణకు అసాంఘిక శక్తుల ముందస్తు అరెస్టులు చాలా ఉపయోగపడతాయని 48 శాతం మంది స్పష్టం చేశారు. నిర్బంధాల కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయాలని 43 శాతం మంది కోరుతున్నారు.

రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులను క్షేత్రస్థాయిలో పోలీసులు పూర్తిగా కాలరాస్తున్నారు. అరెస్టు సమయంలో పాటించాల్సిన చట్టబద్ధమైన ప్రక్రియలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. అరెస్టు నిబంధనలు ఎల్లప్పుడూ పాటిస్తున్నామని కేవలం 41 శాతం మంది పోలీసులు మాత్రమే అంగీకరిస్తున్నారు. అరెస్టు చేసిన వ్యక్తులకు కారణాలు చెప్పడం, వైద్య పరీక్షలు నిర్వహించడం వంటివి సరిగ్గా జరగడం లేదు. నిందితులు తమ న్యాయవాదిని సంప్రదించే హక్కును శాశ్వతంగా రద్దు చేయాలని 20 శాతం మంది పోలీసులు వాదిస్తున్నారు.

లాఠీఛార్జీలు, హింసాత్మక సంఘటనల్లో గాయపడిన పౌరుల లెక్కల విషయంలో అధికారిక గణాంకాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. మానవ హక్కుల ఉల్లంఘనలు, కస్టడీ మరణాల వివరాల సేకరణలో మన డేటా వ్యవస్థ విఫలమవుతోంది. 2020 సీఏఏ నిరసనల్లో ఢిల్లీలోనే 200 మందికి పైగా గాయపడినట్లు ఐక్యరాజ్యసమితి నివేదిక తెలిపినా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దేశమంతటా కేవలం 76 మందే గాయపడ్డారని పేర్కొంది. 2024 రైతు ఆందోళనలు, మణిపూర్ నిరసనల్లో పదుల సంఖ్యలో విద్యార్థులు గాయపడినా ఎన్‌సిఆర్‌బి రికార్డుల్లో కేవలం ఇద్దరేనని చూపించారు. 2020లో 76 ఉన్న బాధితుల సంఖ్య 2024 నాటికి 2కి పడిపోయిందని చెప్పడం రికార్డుల నమోదులో ఉన్న అస్పష్టతను తేటతెల్లం చేస్తోంది.

పోలీస్ వ్యవస్థలో సమూల సంస్కరణలు తేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. పౌరుల హక్కుల రక్షణతో పాటు చట్ట పాలన సక్రమంగా సాగేలా చూడటమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష. ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమ మార్గాలను ఎంచుకోవడం పోలీసు వ్యవస్థకే తీవ్ర నష్టం కలిగిస్తుంది. పోలీసులు చట్టానికి లోబడి పనిచేసేలా ఉన్నతాధికారులు, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. శిక్షణ సమయంలో మానవ హక్కుల పట్ల అవగాహన పెంచడం ద్వారానే పౌర హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుంది.