Explainer: కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చుంటున్నారా? డాక్టర్ల షాకింగ్ వార్నింగ్

Computer Sitting

Computer Sitting

రోజూ ఉదయం కుర్చీలో కూర్చుంటాం. మధ్యాహ్నం, సాయంత్రం కూడా అదే కుర్చీలో కనిపిస్తాం. కంప్యూటర్ ముందు పని అయిపోయేసరికి 8గంటలు ఎలా గడిచిపోయాయో కూడా తెలియదు. తర్వాత లేచి నడిచేటప్పుడు నడుము బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది. మెడ పట్టేస్తుంది. కాళ్లు బరువెక్కినట్టు అనిపిస్తాయి. మళ్లీ నెక్ట్స్ డే అదే కుర్చీ.

మనలో చాలామందికి ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్య అంటే నడుము నొప్పి, మెడ నొప్పి, బరువు పెరగడం వరకే గుర్తొస్తాయి. కానీ శరీరంలో ఇంకో చోట కూడా ఈ కూర్చునే జీవితం నెమ్మదిగా ఒక సమస్యకు దారి తీస్తుంది. అదే తోక ఎముక దగ్గర.

రెండు పిరుదుల మధ్య ఉండే చిన్న లోయలాంటి చర్మపు మడతలో వచ్చే సమస్య గురించి చాలా తక్కువ మందికే తెలుసు. నిజానికి అక్కడ మొదట కనిపించేది చాలా చిన్న సమస్యలా ఉంటుంది. చిన్న రంధ్రం. కొంచెం అసౌకర్యం. కూర్చున్నప్పుడు స్వల్పమైన నొప్పి. అంతే అనిపిస్తుంది కానీ ఆ చిన్న రంధ్రం లోపల ఒక సొరంగంలాంటి మార్గం ఏర్పడుతుంటే? దాన్నే పైలోనైడల్ సైనస్ అంటారు. ఇది వినడానికి విచిత్రంగా అనిపించినా, యువతలో, ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారిలో కనిపించే సమస్యల్లో ఇది ఒకటి.

ఈ సమస్యలో అసలు కథ వెంట్రుకతో మొదలవుతుంది. పిరుదుల మధ్య ఉండే చర్మపు మడతలో ఊడిపోయిన వెంట్రుకలు చర్మాన్ని రుద్దుతూ లోపలికి చొచ్చుకుపోవచ్చు. అక్కడ శరీరం దానికి ప్రతిస్పందిస్తూ వాపును కలిగిస్తుంది. తర్వాత ఆ చిన్న మార్గంలో బ్యాక్టీరియా చేరితే ఇన్ఫెక్షన్ మొదలవుతుంది. క్రమంగా వాపు, చీము, నొప్పి, కొన్నిసార్లు గడ్డ కూడా ఏర్పడవచ్చు.

ఇక ఎక్కువ సేపు కూర్చొవడం కారణంగా తోక ఎముక చుట్టూ ఉండే ప్రాంతంపై పదేపదే ఒత్తిడి పడుతుంది. శరీర బరువు ఒకే ప్రాంతంపై ఎక్కువసేపు ఉంటుంది. వేడి, చెమట, రాపిడి పెరుగుతాయి. వెంట్రుకలు ఉండటం, అధిక బరువు, శరీర నిర్మాణం, ఎక్కువసేపు కూర్చునే అలవాటు లాంటివి కలిసి ఆ ప్రాంతంలో సమస్యకు అవకాశం పెంచుతాయి.

పైలోనైడల్ సైనస్ ఉన్నవారిలో 66.7శాతం మంది ఎక్కువసేపు కూర్చునే అలవాటు ఉన్నట్లు ఓ పరిశోధనలో తేలింది. ఆరోగ్యకరమైన పోలిక సమూహంలో అది 22.8 శాతంగా ఉంది. అదే పరిశోధనలో శరీర బరువు, ఆ ప్రాంతంలో పరిశుభ్రత కూడా సంబంధం ఉన్న అంశాలుగా కనిపించాయి. మరో పెద్ద కేస్ కంట్రోల్ పరిశోధనలో 587 మంది పైలోనైడల్ సైనస్ బాధితులను 2,780 మంది ఆరోగ్యవంతులతో పోల్చారు. రోజుకు ఎక్కువసేపు కూర్చోవడం, గట్టిగా ఉండే శరీర వెంట్రుకలు, స్నానం తక్కువగా చేయడం ముఖ్యమైన ప్రమాద కారకాలుగా కనిపించాయి. అందుకే రోజంతా కూర్చుని పనిచేసే వ్యక్తి మొదట గమనించాల్సింది పెద్ద గడ్డ వచ్చిన తర్వాత కాకుండా చిన్న సంకేతాలు వచ్చినప్పుడే జాగ్రత్త పడాలి.

తోక ఎముక దగ్గర కూర్చున్నప్పుడు నొప్పి కలుగుతుంది. ఈ సమయంలో ఆ రంధ్రం నుంచి ద్రవం వస్తుంది. చీము లేదా రక్తం కనిపిస్తుంది. కొన్నిసార్లు దుర్వాసనతో కూడిన స్రావం వస్తుంది. ఇవన్నీ కనిపిస్తే దాన్ని సాధారణ చర్మ సమస్యగా వదిలేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. వాపు ఒక్కసారిగా పెరిగి ఆ ప్రాంతం వేడిగా, ఎర్రగా, తీవ్రమైన నొప్పితో మారితే అక్కడ చీము పేరుకున్న గడ్డ ఏర్పడి ఉండొచ్చు. జ్వరం, అస్వస్థత కూడా రావచ్చు. 2025లో ప్రచురితమైన మరో పరిశోధనలో కూర్చునే భంగిమలో పనిచేయడం, తోక ఎముక దగ్గర ఎక్కువ వెంట్రుకలు ఉండటం వంటి అంశాలు స్వతంత్రంగా పైలోనైడల్ సైనస్‌తో సంబంధం కలిగి ఉన్నట్లు గుర్తించారు.

అందుకే కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే ప్రతి యువ ఉద్యోగి ఒక విషయం గుర్తుంచుకోవాలి. తోక ఎముక దగ్గర ఒక చిన్న నొప్పి మొదలైతే మాత్రం పట్టించుకోకుండా ఉండొద్దు. కూర్చోవడం బాధగా మారుతుంటే. వైద్యుడిని కలవాల్సిందే!