Explainer: ప్రేమిస్తే జైలుకు..? శృంగారంలో పరస్పర అంగీకారం ఉన్నా కూడా రే*ప్‌ కేసు అవుతుందా?

Romeo And Juliat Clause Explained

Romeo And Juliat Clause Explained

Romeo and Juliet clause Explained: ఒక్కసారి ఇలా ఊహించండి. 17 ఏళ్ల అబ్బాయి… 16 ఏళ్ల అమ్మాయి…ఇద్దరూ ఒకే స్కూల్‌లో చదువుతున్నారు. ప్రేమలో పడ్డారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. కానీ ఒకరోజు ఆ విషయం ఇంట్లో తెలిసిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా? ప్రేమకథ ఒక్కసారిగా పోలీస్ కేసుగా మారిపోయింది. అబ్బాయిపై రేప్ కేసు నమోదైంది. ఇప్పుడు మీకు షాక్ అనిపించొచ్చు. ఇద్దరికీ ఇష్టమే కదా.. మరి రేప్ కేసు ఎలా అవుతుంది అనే ఆలోచన రావచ్చు. కానీ భారత్‌లో ప్రస్తుతం చట్టం అదే చెబుతోంది.

పోక్సో ప్రకారం 18 ఏళ్లలోపు ఉన్న వ్యక్తి ఇచ్చే సమ్మతిని చట్టం అంగీకరించదు. అంటే ఇద్దరు టీనేజర్లు పరస్పర అంగీకారంతో రిలేషన్‌లో ఉన్నా… చట్టం దాన్ని పూర్తిగా వేరే కోణంలో చూస్తుంది. ఇదే విషయం ఇప్పుడు మన పొరుగు దేశం నేపాల్‌లో పెద్ద చర్చగా మారింది. నేపాల్ ప్రభుత్వం తాజాగా తీసుకురావాలని చూస్తున్న ఒక నిర్ణయం… రానున్న రోజుల్లో భారత్‌లో కూడా భారీ డిబేట్‌కు కారణం కావచ్చు. ఇంతకీ నేపాల్‌ ఏ నిర్ణయం తీసుకోనుంది? అక్కడి డిసిషన్‌కి ఇండియాలోని చట్టానికి ఉన్న లింకేంటి?

ముందుగా ఒక విషయాన్ని ఆలోచించండి.. చట్టం పిల్లల్ని కాపాడాలా? లేదా ప్రేమలో పడిన టీనేజర్లను క్రిమినల్స్‌గా మార్చాలా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలు తమ చట్టాలను మళ్లీ పరిశీలిస్తున్నాయి.

×
×
Ad

పరస్పర అంగీకారం ఉన్నా రే*ప్‌ కేసు అవుతుందా?

ప్రస్తుతం నేపాల్‌లో కూడా శృంగారానికి వయసు పరిమితి 18 ఏళ్లే. 18 లోపు ఉన్న వ్యక్తితో శృంగారం జరిగితే… అది ఇద్దరి అంగీకారంతో జరిగినా చట్టం దాన్ని రేప్‌గానే పరిగణిస్తుంది. అందుకే ఇప్పుడు నేపాల్ రోమియో అండ్ జూలియట్ క్లాజ్ అనే కొత్త విధానాన్ని తీసుకురావాలని చూస్తోంది. పేరు వినడానికి సినిమా టైటిల్‌లా ఉన్నా… దీని వెనుక ఉన్న ఆలోచన మాత్రం చాలా సీరియస్. ఒక 35 ఏళ్ల వ్యక్తి 15 ఏళ్ల అమ్మాయిని మోసం చేయడం ఒకటి. అదే 17 ఏళ్ల అబ్బాయి, 16 ఏళ్ల అమ్మాయి ప్రేమలో ఉండటం ఇంకోటి. ఈ రెండింటినీ ఒకే చట్టంతో, ఒకే శిక్షతో చూడటం సరైంది కాదని భావించిన నేపాల్‌ ఇప్పుడు తమ చట్టాన్ని మార్చుతోంది. దీని ప్రకారం పెద్దవాళ్లు చిన్నవారిపై చేసే లైంగిక దాడికి కఠిన శిక్షలు గతంలో లానే ఉంటాయి. కానీ వయసులో చాలా దగ్గరగా ఉన్న ఇద్దరు టీనేజర్ల మధ్య పరస్పర అంగీకారంతో ఏర్పడిన సంబంధాన్ని నేరుగా రే*ప్ కేసుగా చూడకూడదనేది దీని ఉద్దేశం.

ఇతర దేశాల్లో ఉన్న రూల్స్ ఏంటి?

నిజానికి చాలామంది అనుకున్నట్టు అన్ని దేశాల్లో 18ఇయర్‌ రూల్ కాదు. బ్రిటన్‌లో 16, ఫిన్లాండ్‌లో 15, జర్మనీలో 14. అమెరికాలో అయితే రాష్ట్రాన్ని బట్టి 16 నుంచి 18 మధ్య మారుతుంది. బహ్రెయిన్‌లో మాత్రం 21. అంటే ప్రపంచం మొత్తం ఒకే అభిప్రాయంతో లేదు. కానీ చాలా దేశాలు ఒక విషయంలో మాత్రం కామన్‌గా ఆలోచిస్తున్నాయి. ప్రతి టీనేజ్ రిలేషన్‌షిప్‌ను క్రిమినల్ కేసుగా చూడకూడదని నమ్ముతున్నాయి. ఉదాహరణకు కెనడాలో ఒక ప్రత్యేక మోడల్ ఉంది. 14 లేదా 15 ఏళ్ల టీనేజర్‌కు తమకంటే కొన్ని సంవత్సరాలు మాత్రమే పెద్దవారితో రిలేషన్‌షిప్‌లో ఉండేందుకు చట్టపరమైన మినహాయింపులు ఉన్నాయి. కానీ ఒక కండీషన్.. ఆ రిలేషన్‌లో బలవంతం ఉండకూడదు, మోసం ఉండకూడదు, ఆధిపత్యం ఉండకూడదు, లైంగిక దోపిడీ ఉండకూడదు. అంటే అక్కడ ఫోకస్ వయసుపై మాత్రమే కాకుండా రియల్‌గా లైంగిక దాడి జరిగిందా లేదా అన్న దానిపై కూడా ఉంటుంది.

పొక్సో చట్టం దుర్వినియోగం అవుతుందా?

ఇప్పుడు భారత్ వైపు వస్తే ఇక్కడ అసలు డిబేట్ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే పోక్సో చట్టం తీసుకొచ్చినప్పుడు దాని ఉద్దేశం చాలా గొప్పది. పిల్లలను లైంగిక నేరాల నుంచి కాపాడటం. కానీ గ్రౌండ్ రియాలిటీ కొన్నిసార్లు వేరేలా కనిపిస్తోంది. చాలా కేసుల్లో పోలీసులకు ఫిర్యాదు వెళ్లడానికి కారణం హింస కాదు, లైంగిక దాడి కూడా కాదు.. అది ప్రేమ.. అవును… పెద్దలకు నచ్చని ప్రేమలు ఇప్పుడు రేప్‌ కేసులుగా మారుతున్నాయి. ఇంట్లో వాళ్లకు రిలేషన్ విషయం తెలిసిపోవడం, అది నచ్చకపోవడం, ఆ తర్వాత కేసు నమోదు కావడం లాంటివి ఇండియాలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి కేసులను చూసిన భారత కోర్టులు కూడా కొన్ని సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేశాయి. ఎందుకంటే చట్టం రక్షించాల్సిన యువతనే కొన్నిసార్లు అదే చట్టం శిక్షిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని న్యాయమూర్తులు సైతం కామెంట్స్‌ చేసిన సందర్భాలున్నాయి.

ఇక్కడ న్యూరోసైన్స్ పరిశోధనలు చెబుతున్న విషయాలను కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. 16 ఏళ్ల వయసులో చాలా మంది తార్కికంగా ఆలోచించగలరు. కానీ ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ మాత్రం ఇంకా పూర్తిగా రాదు.

పీర్ ప్రెజర్‌కు లొంగిపోవడం, రిస్క్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోవడం, హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం లాంటి అంశాలు 18 ఏళ్ల తర్వాత కూడా అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. అందుకే చాలా మంది నిపుణులు 18 ఏళ్ల పరిమితి అలాగే ఉండాలని అంటున్నారు. నిజం చెప్పాలంటే… ఈ డిబేట్‌లో విలన్ ఎవ్వరూ లేరు. పిల్లల్ని కాపాడాలనుకునేవాళ్లు ఒకవైపు. యువతను అనవసరంగా క్రిమినల్స్‌గా మార్చకూడదనుకునేవాళ్లు మరోవైపు. ఇద్దరి ఉద్దేశం కూడా మంచిదే. అయితే నేపాల్‌ తరహాలో రోమియో అండ్ జూలియట్ క్లాజ్ ఉంటే మంచిదనే అభిప్రాయం ఇండియాలోనూ చాలాకాలంగా వినిపిస్తోంది. ఒకవేళ నేపాల్‌లో ఈ క్లాజ్‌ సక్సెస్‌ అయితే భారత్‌తో సహా ప్రపంచంలోని అనేక దేశాల చట్టాలపై కూడా అది ప్రభావం చూపించే అవకాశం ఉంది.