Explainer: 600 మంది పిల్లలు ఏమయ్యారు? హిమాలయ లోయల్లో ప్రతిధ్వనిస్తున్న కుటుంబాల ఆర్తనాదాల కథ!

Floods Students Missing

Floods Students Missing

ఆగస్టు 26 తెల్లవారుజామున హిమాలయ శిఖరాల నుంచి విరుచుకుపడ్డ మంచు ప్రళయం నేపాల్‌ను అతలాకుతలం చేసింది. ఇళ్లు కొట్టుకుపోయాయి, వంతెనలు కూలిపోయాయి, ఊళ్లకు ఊళ్లే మట్టిదిబ్బలుగా మారాయి. కానీ ఇప్పుడు అక్కడి కన్నవారిని వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న ఆస్తి నష్టం గురించి కాదు… “మా పిల్లలు ఎక్కడున్నారు?” అన్నదే. విలయం జరిగి వారం రోజులు దాటినా… రసువా, నువాకోట్ జిల్లాల్లో దాదాపు 600 మంది బడిపిల్లల జాడ ఇప్పటికీ కనిపించడం లేదు. ఫోన్ లైన్లు తెగిపోయాయి, టవర్లు కుప్పకూలాయి, ఏకంగా స్కూళ్లే కొట్టుకుపోయిన చోట సమాచారం ఒక అంతుచిక్కని మిస్టరీగా మారింది. ఆశకూ, ఆవేదనకూ మధ్య కొట్టుమిట్టాడుతున్న వందలాది కుటుంబాల ఆర్తనాదాలు ఇప్పుడు హిమాలయ లోయల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.

హిమాలయ విపత్తు మిగిల్చిన భౌతిక నష్టం కన్నా విద్యావ్యవస్థపై పడిన దెబ్బ అత్యంత తీవ్రంగా ఉంది. విపత్తు సమయాల్లో పిల్లల సమాచారం తెలుసుకోవడానికి ఉపయోగపడే పాఠశాలలే నేలమట్టమయ్యాయి.

రసువాలో 4, నువాకోట్‌లో 8 కలిపి మొత్తం 12 పాఠశాలలు వరద ధాటికి పూర్తిగా కొట్టుకుపోయాయి. ఒకప్పుడు పిల్లలతో సందడిగా ఉన్న పాఠసాలల ప్రాంగణాలు ఇప్పుడు బండరాళ్లు, ఇసుక మేటలతో రాతియుగాన్ని తలపిస్తున్నాయి. ఒక్క నువాకోట్ జిల్లాలోనే దాదాపు 300 మంది విద్యార్థుల ఆచూకీ గల్లంతైంది. కొందరు తల్లిదండ్రులు బతికారు. తమ పిల్లల కోసం వెతుకుతున్నారు. మరికొన్ని చోట్ల బతికిన పిల్లలు కనిపించకుండా పోయిన తల్లిదండ్రుల కోసం కన్నీరుమున్నీరవుతున్నారు

మొత్తం నేపాల్‌ వ్యాప్తంగా ఈ విపత్తు తీవ్రత ఊహకందని స్థాయిలో ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,200 మందికి పైగా మరణించినట్లు అధికారికంగా ధ్రువీకరించారు. మరో 4,200 మందికి పైగా ఆచూకీ ఇంకా దొరకలేదు. రసువా, నువాకోట్, ధాడింగ్ జిల్లాల్లో కలిపి కనీసం 17,000 మంది చిన్నారులు ఈ ఆకస్మిక వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యారని సమాచారం. వారికి తక్షణ మానవతా సాయం అవసరమని యూనిసెఫ్ స్పష్టం చేసింది.

రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ యూనివర్శిటీ టీచింగ్ హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన ‘వాల్ ఆఫ్ ది మిస్సింగ్’ ఇప్పుడు కన్నీటి వేదికగా మారింది. గుర్తుతెలియని మృతదేహాలతో తమ వారి ఫొటోలను సరిపోల్చుకునేందుకు కుటుంబాలు బారులు తీరుతున్నాయి. కొండచరియలు విరిగిపడటం, జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో వందలాది మంది కార్మికులు చిక్కుకుపోవడం రెస్క్యూ ఆపరేషన్‌ను అత్యంత సంక్లిష్టంగా మార్చాయి.

నేపాల్ భౌగోళిక చరిత్రను పరిశీలిస్తే, వాతావరణ మార్పుల వల్ల హిమాలయాల్లోని హిమానీనద సరస్సులు తెగిపడే ప్రమాదాలు నిరంతరం పొంచి ఉంటున్నాయి. ప్రకృతి విలయాలకు విచ్ఛిన్నమైన మౌలిక వసతులు తోడైనప్పుడు సమాచార వ్యవస్థ ఎలా కుప్పకూలుతుందో, ఒక రెస్క్యూ ఆపరేషన్ ఎంతటి మానవీయ సంక్షోభంగా మారుతుందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. 600 మంది పిల్లల్లో ఎంతమంది సురక్షిత ప్రాంతాలకు చేరారు, ఎంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారు అన్నది శాటిలైట్, నెట్‌వర్క్ వ్యవస్థలు పునరుద్ధరణ అయ్యేంతవరకు చెప్పలేని పరిస్థితి నెలకొంది.

ఈ విపత్తు కేవలం గణాంకాలకు సంబంధించినది కాదు.. ప్రతి నంబర్ వెనుక ఒక ఊపిరి, ఒక కుటుంబ భవిష్యత్తు ముడిపడి ఉన్నాయి. రోడ్లు తెగిపోయినా, వంతెనలు కొట్టుకుపోయినా ప్రభుత్వ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చేయాల్సిన మొదటి పని ఆ మారుమూల ప్రాంతాలకు సమాచార వ్యవస్థను అనుసంధానించడమే. తెగిపోయిన ఫోన్ సిగ్నల్ ఒక్కటి కలిస్తే చాలు.. ఎన్నో తల్లుల గుండెల్లో నిండిన అంధకారం తొలగిపోయి, తమ బిడ్డ క్షేమంగా ఉన్నాడన్న వార్త కొత్త ఊపిరి పోస్తుంది. మాలయాలు శాంతించి, ఆ ఆరువందల మంది చిన్నారులు సురక్షితంగా తమ తల్లిదండ్రుల ఒడికి చేరాలని లోకం యావత్తూ ఎదురుచూస్తోంది.

:- CLN RAJU (EDITOR-NTV DIGITAL)