అంతరిక్షంలో కొత్త శకం మొదలైందా? కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసిన అద్భుతాలు ఇప్పుడు నిజం కాబోతున్నాయా? చంద్రుడిపై మనిషి శాశ్వత నివాసం కోసం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ- నాసా ఏకంగా ఒక అణు రియాక్టర్‌నే నిర్మించాలనుకుంటోంది! శతాబ్దాలుగా మనకు వెన్నెలను పంచిన ఆ చందమామ ఇప్పుడు భూమి లాంటి మరో శక్తి కేంద్రంగా మారనుందా? అసలు నాసా వేస్తున్న ఈ అడుగు వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి?
భూమికి అవతల, శూన్యంలో ఒక సరికొత్త సామ్రాజ్యాన్ని స్థాపించేందుకు నాసా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే, చంద్రుని దక్షిణ ధ్రువం సమీపంలో 2030 నాటికి ఒక న్యూక్లియర్ రియాక్టర్‌ను ఏర్పాటు చేయాలని నాసా భావిస్తోంది.
VO: ఈ రియాక్టర్ ఉత్పత్తి చేసే విద్యుత్ సామర్థ్యం సుమారు 20 కిలోవాట్లు. ఒక అంచనా ప్రకారం, ఇది భూమిపై కొన్ని కుటుంబాలకు సరిపడే విద్యుత్‌ను అందించగలదు. అదే సమయంలో.. రష్యా నేతృత్వంలో చైనా చేపడుతున్న ‘ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్’-ILRS 10 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని బట్టి చూస్తే.. అమెరికా తన ప్రత్యర్థుల కంటే ముందంజలో ఉంది. రష్యా, చైనాలను మించి అమెరికా చంద్రుడిపై భారీ వ్యూహంతో ముందుకు వెళ్తుందని చెప్పేందుకు ఇదే ఉదాహరణ.
చంద్రుడిపై జీవించడానికి, పరిశోధనలు చేయడానికి విద్యుత్ చాలా అవసరం. చంద్రుడిపై సోలర్ ప్యానెల్స్(Solar panels) పగటిపూట విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలవు, కానీ చీకటి పడిన తర్వాత అవి పూర్తిగా నిరుపయోగంగా మారుతాయి. ఎందుకంటే చంద్రునిపై ఒక్కో రాత్రి దాదాపు 15 రోజులపాటు ఉంటుంది. దక్షిణ ధ్రువ ప్రాంతంలో కొన్ని చీకటి గుహలు, లోతైన బిలాలు ఉన్నాయి. అక్కడ ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 200 డిగ్రీల సెంట్రిగ్రేడ్ వరకూ పడిపోతాయి. అటువంటి భయంకరమైన చీకటి, గడ్డకట్టే చలి వాతావరణంలో రోవర్ బ్యాటరీలను రీచార్జ్ చేయడానికి, లైఫ్-సపోర్ట్ సిస్టమ్స్‌కు సోలార్ పవర్ సరిపోదు. అందుకే న్యూక్లియర్ పవర్(Nuclear power) అక్కడ అనివార్యంగా మారుతోంది.
అణు రియాక్టర్ నిర్మాణం కేవలం వెలుతురు ఇవ్వడానికి మాత్రమే కాదు.. భవిష్యత్ అంతరిక్ష యాత్రలకు అవసరమైన ఇంధనాన్ని తయారు చేసేందుకు కూడా దీన్ని ఉపయోగించనున్నారు. చంద్రునిపై ఉన్న చల్లని బిలాలలో గడ్డకట్టిన నీటి మంచు ఉంది. నాసా సైంటిస్టులు జూలీ క్లైన్‌హెంజ్, ఆరోన్ పాజ్ 2020లో నిర్వహించిన ఒక అసెస్‌మెంట్ ప్రకారం.. ఈ నీటిని ఎలక్ట్రోలైసిస్ చేసి హైడ్రోజన్, ఆక్సిజన్‌లుగా విడగొట్టవచ్చు. దీనిద్వారా రాకెట్లకు కావాల్సిన ఇంధనాన్ని, వ్యోమగాములకు సరిపడే ఆక్సిజన్‌ను అక్కడికక్కడే తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు.. 10 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడానికి సుమారు 68 కిలోవాట్ల పవర్ అవసరం అవుతుంది. అందుకే, 20-కిలోవాట్ రియాక్టర్ ఏర్పాటు చేయడం ద్వారా చంద్రునిపై భవిష్యత్ పరిశోధనలకు ఒక బలమైన తొలి అడుగు పడుతుంది.
అంతరిక్షంలో సైన్స్ పరిశోధనలు మాత్రమే కాదు.. అంతకు మించిన ఆధిపత్య పోరు కూడా నడుస్తోంది. ప్రస్తుతం అమెరికా, చైనాలు ఈ విషయంలో గట్టిగా పోటీ పడుతున్నాయి. ఒకరిని మించి మరొకరు చంద్రునిపై శాశ్వత బేస్‌ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే, ఈ పోటీలో అంతర్జాతీయ ఒప్పందాలు కూడా తెరపైకి వస్తున్నాయి. 1967 నాటి ‘ఔటర్ స్పేస్ ట్రీటీ’ ప్రకారం ఏ దేశం కూడా చంద్రునిపై లేదా ఇతర ఖగోళ వస్తువులపై శాశ్వత యాజమాన్యాన్ని లేదా ఆక్రమణను అధికారికంగా పొందలేదు. కానీ.. అమెరికా, దాని మిత్రదేశాలు ప్రతిపాదిస్తున్న ‘ఆర్టెమిస్ అకార్డ్స్’ కింద ‘సేఫ్టీ జోన్స్’ అనే నిబంధన ఉంది. ఇది ఇతరుల జోక్యాన్ని నిరోధించడానికి ఒక చట్టపరమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది.
ఆర్టెమిస్ అకార్డ్స్ ప్రకారం.. ఒక దేశం చంద్రునిపై రియాక్టర్, ల్యాండింగ్ ప్యాడ్ లేదా ఆవాసాలను ఏర్పాటు చేస్తే.. ఆ ప్రాంతంలో ఇతరుల ప్రవేశాన్ని పరిమితం చేసే హక్కు వారికి లభిస్తుంది.
అయితే.. ఇది పరోక్షంగా ఒక దేశానికి ఆ ప్రాంతంపై వ్యూహాత్మక ఆధిపత్యాన్ని ఇస్తుందనే విమర్శలు కూడా ఉన్నాయి. “ఎక్కడైతే శక్తి ఉంటుందో, అక్కడే ఆధిపత్యం ఉంటుంది” అన్నట్లుగా.. భవిష్యత్ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో అగ్రగామిగా నిలవాలని అమెరికా భావిస్తోంది. అయినప్పటికీ.. రియాక్టర్ కోర్ రేడియేషన్ ప్రభావం, లూనార్ డస్ట్ సోకకుండా నాసా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నాసా ముందున్న అతి పెద్ద సవాల్.
చంద్రుడిపై అణు రియాక్టర్లను నిర్మించాలనే అమెరికా ఆలోచన కేవలం ఒక శాస్త్ర విజ్ఞాన ప్రయోగం కాదు.. ఇది అంతరిక్ష భవిష్యత్తును శాసించే సరికొత్త ప్రచ్ఛన్న యుద్ధం! రాబోయే తరాలకు జాబిల్లి కేవలం కవితలు పాడే వేదిక మాత్రమే కాకుండా, మానవ జాతి మరో లోకంలో తన శక్తిని చాటుకునే మహా రణరంగం కాబోతోంది. మరి ఈ రేసులో గెలిచేదెవరు? ఓడేదెవరు? కాలమే సమాధానం చెప్పాలి!
:- CLN RAJU(Editor-NTV DIGITAL)

