కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు… క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నప్పుడు… రెండు చేతులా సంపాదిస్తున్నప్పుడు…. ఎవరైనా బ్రేక్ తీసుకుంటారా…? అది ఎలాంటి కెరీర్ అయినా సరే దాన్ని వదులుకుంటారా….? దేశం కోసం అలా కెరీర్‌కి బ్రేక్ ఇచ్చిన ఓ వ్యక్తి ఉన్నారు… ఆయనే నానా పటేకర్… సినిమాల్లో పాత్రల ద్వారా అద్భుతమైన నట విన్యాసాలను ప్రదర్శించడమే కాదు… అవసరమైనప్పుడు దేశం కోసం శత్రువులతో పోరాడిన వీరుడు నానా పటేకర్.
అది 1999వ సంవత్సరం… దేశాన్ని మన శత్రువులు చుట్టుముట్టిన కాలం… కార్గిల్ యుద్ధం హోరాహోరీగా సాగుతున్న సమయం… యావత్ దేశం సైన్యం పక్షాన నిలడిన సందర్భం…. ఇండో పాక్ సరిహద్దుల్లో కార్గిల్ వద్ద సాగుతున్న యుద్ధానికి సంబంధించిన వార్తలను తెలుసుకుంటూ దేశ ప్రజలందరూ పాక్ ఓటమి కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయంలో… నానాపటేకర్ మాత్రం భిన్నంగా స్పందించారు. బిజీ సినిమా షెడ్యూల్ ను పక్కన పెట్టి సరిహద్దుల్లోకి వెళ్లి పోరాడాలని నిర్ణయించుకున్నారు.
1980ల చివర్లో నానా పటేకర్ టెరిటోరియల్ ఆర్మీలో అధికారికంగా చేరారు. 1991లో వచ్చిన ‘ప్రహార్- ది ఫైనల్ ఎటాక్’ సినిమాలో ఆర్మీ కమాండో పాత్ర కోసం ఆయన షార్ట్‌కట్స్ వాడకుండా ఏకంగా మూడేళ్ల పాటు శిక్షణ తీసుకున్నారు. మరాఠా లైట్ ఇన్‌ఫాంట్రీతో కలిసి తీసుకున్న శిక్షణ ఆయనను ఆర్మీకి మరింత దగ్గర చేసింది. అందుకే కార్గిల్ యుద్ధ సమయంలో తనకు దేశానికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని టెరిటోరియల్ ఆర్మీలో సీనియర్ అధికారులకు రిక్వెస్ట్ పెట్టుకున్నారు. అయితే ఆ అధికారం తమకు లేదని… రక్షణ మంత్రి మాత్రమే నిర్ణయం తీసుకోగలరని వారు స్పష్టం చేశారు.
పై అధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోయినా… ఏ మాత్రం నిరాశ చెందని నానా పటేకర్… అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్‌ను కలిసి.. తనకు ముందుండి పోరాడేందుకు అనుమతించాలని అభ్యర్థించారు. షూటింగ్ నైపుణ్యాలు, గెలుచుకున్న పతకం గురించి మంత్రికి వివరించారు. అనుమతి లభించిన వెంటనే తన సినిమా కెరీర్‌ను పక్కనపెట్టి ఆర్మీకి చెందిన క్విక్ రియాక్షన్ టీమ్ లో చేరారు. శ్రీనగర్, ద్రాస్, లేహ్ ప్రాంతాల్లో ఆర్మీతో కలిసి 60 రోజులు ఉన్నారు. బాలీవుడ్ సెలబ్రిటీని అన్న విషయాన్ని పక్కనపెట్టి… సైనికులతో కలిసి శత్రువులతో పోరాడారు. బోర్డర్ లో ఉన్న సమయంలో ఆయన సుమారు 20 కేజీల బరువు కూడా తగ్గారు.
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎంతో మంది నటీనటులు తమ ప్రతిభను ప్రదర్శించారు. కానీ నానాపటేకర్ లాంటి మానవత్వం ఉన్న నటులు మాత్రం చాలా అరుదుగానే ఉంటారు. నాటకాలతో పాటు మరాఠీ, హిందీ సినిమాల్లో అద్భుతమైన నటన కనబరిచిన నానా పటేకర్ చాలా క్రమశిక్షణతో ఉండేవారు. ఏ పాత్రనైనా అవలీలగా చేయగల అరుదైన నటుల్లో ఆయన పేరు ముందు వరుసలో ఉంటుంది. అల్విదా నానా భాయ్.

