Layoffs: 45ఏళ్లు దాటితే ఉద్యోగం ఊస్ట్? అంకుల్స్‌ను భయపెడుతున్న లెక్కలు!

Layoff Trend In India

Layoff Trend In India

కార్పొరేట్ ఉద్యోగం అంటే ఒకప్పుడు మంచి జీతం, అనుభవం పెరిగే కొద్దీ మరింత స్థిరమైన కెరీర్ అని భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఉదయం ఆఫీస్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఉద్యోగికి.. తెల్లవారుజామున వచ్చే ఒకే ఒక్క ఈమెయిల్‌తో ఎన్నో ఏళ్లుగా చేస్తున్న ఉద్యోగానికి ముగింపు పడుతుంది. మేనేజర్ నుంచి ముందస్తు హెచ్చరిక ఉండకపోవచ్చు. సిస్టమ్ యాక్సెస్ ఆగిపోవచ్చు. సెపరేషన్ నోటీసు చేతికి రావచ్చు. సెప్టెంబర్‌లో ఒరాకిల్, అడిడాస్ లాంటి కంపెనీల్లో ఉద్యోగాల కోతలు ఈ భయాన్ని మరింత పెంచాయి. ముఖ్యంగా 40ఏళ్లకు చేరుకున్న ఉద్యోగుల్లో ఇప్పుడు ఒక ప్రశ్న బలంగా వినిపిస్తోంది. 45 ఏళ్ల వయసు కార్పొరేట్ ఇండియాలో కొత్త లేఆఫ్ వయసుగా మారుతోందా?

ముందుగా ఒరాకిల్ విషయమే తీసుకుంటే.. ఆ సంస్థలో ఇండియాలోనూ ఉద్యోగాల కోతలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. ప్రొడక్ట్ ఇంజినీరింగ్ టీమ్‌లో కొందరు ప్రభావితమైనట్లు సమాచారం. అయితే ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయారనే విషయాన్ని ఒరాకిల్ అధికారికంగా చెప్పలేదు. మరోవైపు సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సెంటర్లలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. అయినప్పటికీ.. 2026 మే 31 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒరాకిల్ ఉద్యోగుల సంఖ్య ఏడాదితో పోల్చితే తగ్గింది. ఏడాది క్రితం సుమారు లక్షా 62వేల మంది ఉద్యోగులు ఉండగా.. ఇప్పుడా సంఖ్య లక్షా 41వేలకు తగ్గింది. ఇక అడిడాస్‌లోనూ టెక్నాలజీ విభాగం పునర్‌ వ్యవస్థీకరణ వార్తలు వచ్చాయి. గురుగ్రామ్‌లోని టెక్ హబ్‌లో దాదాపు 50శాతం ఉద్యోగాలు ప్రభావితమవుతాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, డేటా ఇంజినీర్ల లాంటి ఉద్యోగాలు కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం.

అయితే ఈ 50శాతం సంఖ్యను అడిడాస్ అధికారికంగా ధృవీకరించలేదు. మారుతున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఇండియా టెక్నాలజీ సంస్థలో కొన్ని ఉద్యోగాలను తగ్గిస్తున్నామని మాత్రమే కంపెనీ తెలిపింది. అంటే టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఉద్యోగ భద్రత పూర్తిగా హామీగా ఉండటం లేదన్న విషయం ఇక్కడ కనిపిస్తోంది. ఇది ఒరాకిల్, అడిడాస్‌తోనే ఆగిపోయిన పరిస్థితి కాదు. లేఆఫ్స్ డాట్ FYI డేటా ప్రకారం 2026 సెప్టెంబర్ 10 వరకు ప్రపంచవ్యాప్తంగా 299 టెక్నాలజీ కంపెనీల్లో 1,28,536 మంది ఉద్యోగాలు కోల్పోయారు. 2025 మొత్తం నమోదైన 278 కంపెనీల్లోని 1,22,606 టెక్ ఉద్యోగాల కోతలను ఈ సంఖ్య ఇప్పటికే దాటింది. అయితే ప్రతి కంపెనీలో ఉద్యోగాల కోతకు ఒకే కారణం లేదు. కొన్ని సంస్థలు ఖర్చులు తగ్గిస్తున్నాయి. కొన్ని సంస్థలు తమ టీమ్‌లను పునర్వ్యవస్థీకరిస్తున్నాయి. మరికొన్ని వ్యాపార ప్రాధాన్యతలను మార్చుకుంటున్నాయి. ఇంకొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్‌పై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి.

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మంచి పనితీరు ఉన్నా ఉద్యోగం ఎప్పటికీ సురక్షితం అనే హామీ ఉండటం లేదు. ఒరాకిల్ ఉద్యోగుల వ్యక్తిగత అనుభవాల్లోనూ ఈ భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక ఉద్యోగి సుమారు రెండేళ్ల అనుభవంతో, మంచి పనితీరు కనబరుస్తున్నప్పటికీ లేఆఫ్‌లో ఉద్యోగం కోల్పోయినట్లు రెడిట్‌లో చెబుతున్నారు. మరో ఉద్యోగి 12 ఏళ్లపాటు ఒరాకిల్‌లో పనిచేసిన తర్వాత ఉద్యోగం నుంచి బయటకు రావడంపై ఉపశమనం వ్యక్తం చేశారు. ఈ అనుభవాలు ఒక్కటే విషయాన్ని చెబుతున్నాయి. లేఆఫ్‌ను కేవలం వయసు, పనితీరు లేదా అనుభవంతోనే వివరించలేం. అయితే 40ఏళ్ల వయసు దగ్గర ఈ భయం ఎందుకు ఎక్కువగా కనిపిస్తోంది?

ఒక ఉద్యోగి 40 ఏళ్లకు చేరుకునే సమయానికి అతనికి 15 లేదా 20 ఏళ్ల అనుభవం ఉండొచ్చు. సీనియర్ హోదా ఉండొచ్చు. దానికి తగ్గట్టే జీతం కూడా ఎక్కువగా ఉండొచ్చు. కానీ కంపెనీ ఖర్చులు తగ్గించుకునే సమయంలో అదే సీనియారిటీ ఒక అంశంగా మారవచ్చు. మేనేజ్‌మెంట్ స్థాయిలను తగ్గించడం, రెండు టీమ్‌లను ఒకటిగా చేయడం, తక్కువ మందితో ఎక్కువ పని చేయించడం, కొన్ని పనులను ఏఐ లేదా ఆటోమేషన్‌కు అప్పగించడం లాంటి మార్పులు ఉద్యోగాలపై ప్రభావం చూపవచ్చు. అయితే దీనర్థం 45 ఏళ్లు వచ్చిన వెంటనే కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయని కాదు. 45 ఏళ్లను లేఆఫ్ వయసుగా కంపెనీలు నిర్ణయించుకున్నాయనే ఆధారాలు ఇప్పటివరకు లేవు. అసలు సమస్య వేరే చోట ఉంది. వయసు, సీనియారిటీ, జీతం, ప్రస్తుత నైపుణ్యాలు, కంపెనీకి మారుతున్న అవసరాలు.. ఇవన్నీ ఒకే సమయంలో కెరీర్‌లో 40ఏళ్ల దశలో ఎదురవుతున్నాయి.

ఒకప్పుడు ఉద్యోగ భద్రతకు అనుభవమే పెద్ద బలం. ఎన్ని సంవత్సరాలు పనిచేస్తే అంత విలువ పెరుగుతుందని భావించేవారు. కానీ ఇప్పుడు ఆ సమీకరణలో ఏఐ, ఆటోమేషన్ కూడా చేరాయి. కోడింగ్, టెస్టింగ్, రిపోర్టింగ్, రీసెర్చ్, డాక్యుమెంటేషన్, కస్టమర్ సపోర్ట్ వంటి అనేక పనుల్లో కొత్త టెక్నాలజీలు సహాయపడుతున్నాయి. కొన్ని పనులను గతంలో పెద్ద టీమ్‌లు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అదే పని టెక్నాలజీ సహాయంతో తక్కువ సమయంలో పూర్తయ్యే పరిస్థితి ఉంది.

అయితే అనుభవానికి విలువ తగ్గిపోయిందని దీని అర్థం కాదు. పరిశ్రమపై లోతైన అవగాహన, సమస్యలను అర్థం చేసుకునే సామర్థ్యం, నిర్ణయాలు తీసుకునే అనుభవం ఇప్పటికీ కీలకమే. కానీ కేవలం ఎన్ని సంవత్సరాలు పనిచేశామన్నది సరిపోకపోవచ్చు. ఆ అనుభవాన్ని నేటి టెక్నాలజీతో ఎలా ఉపయోగించగలుగుతున్నామన్నదే మరింత ముఖ్యంగా మారుతోంది.

ఇక 45 ఏళ్ల వయసులో ఉద్యోగం పోతే దాని ప్రభావం 25 ఏళ్ల వయసులో ఉద్యోగం కోల్పోయిన దానికంటే భిన్నంగా ఉండొచ్చు. ఈ దశలో ఇంటి రుణాలు, పిల్లల చదువులు, కుటుంబ ఖర్చులు, తల్లిదండ్రుల బాధ్యతలు వంటి ఆర్థిక ఒత్తిళ్లు ఉండవచ్చు. గురుగ్రామ్‌కు చెందిన ఓ వ్యక్తి తాను పనిచేసిన మల్టినేషనల్‌ కంపెనీలో ఏడు సంవత్సరాల తర్వాత లేఆఫ్‌కు గురయ్యానని సోషల్ మీడియాలో తెలిపారు. ఉద్యోగం పోయిందని తల్లిదండ్రులకు చెప్పలేక.. ప్రతిరోజూ ఉద్యోగానికి వెళ్తున్నట్లుగా ఇంటి నుంచి బయటకు వచ్చి, రోజంతా కొత్త ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తూ, కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటున్నానని చెప్పారు. ఇది ఒక్క వ్యక్తి అనుభవం మాత్రమే. పెద్ద ట్రెండ్‌కు దీనిని ఆధారంగా తీసుకోలేం. కానీ ఉద్యోగం కోల్పోయిన తర్వాత వచ్చే మానసిక, కుటుంబ ఒత్తిడిని మాత్రం ఈ సంఘటన చూపిస్తుందని చెప్పవచ్చు.