థాయ్‌లాండ్‌కు వెళ్లిన భారతీయులను భారతీయులే కిడ్నాప్ చేస్తున్నారు. చీప్ టూర్ ప్యాకేజీలు, భారీ జీతాల ఉద్యోగాలు, విదేశాల్లో బంగారు భవిష్యత్తు అంటూ నమ్మించి చివరికి కిడ్నాప్ చేయడం, చిత్రహింసలు పెట్టడం, కుటుంబాల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేయాలని ప్రయత్నించడం ఇప్పుడు థాయ్‌లాండ్‌లో బయటపడుతున్న భయంకరమైన వాస్తవం.
జులై 21న ముగ్గురు భారతీయులు థాయ్‌లాండ్‌లో తక్కువ ఖర్చుతో విహారయాత్ర చేస్తామనే ఆశతో బ్యాంకాక్ చేరుకున్నారు. కానీ విమానం దిగిన కొద్ది గంటల్లోనే వారిని కిడ్నాప్ చేసి పట్టాయాలోని ఓ ఇంటికి తరలించారు.
అక్కడ వారం రోజుల పాటు అమానుషంగా హింసించారు. రోజూ కొట్టారు. కాళ్లతో వేలాడదీశారు. తిండి కూడా సరిగా పెట్టలేదు. అంతటితో ఆగలేదు. శరీరంపై ఎర్ర రంగు పూసి తీవ్రంగా గాయపడ్డట్టు వీడియో కాల్స్ చేసి కుటుంబ సభ్యులను భయపెట్టారు. మొత్తం 70 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో జులై 27న థాయ్ పోలీసులు బాధితులను రక్షించారు. పారిపోవడానికి సిద్ధమైన ఐదుగురు భారతీయులను అరెస్టు చేశారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక దుబాయ్‌లో ఉన్న ఓ పాకిస్థానీ సూత్రధారి ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.
ఈ ఒక్క సంఘటన మాత్రమే కాదు. థాయ్‌లాండ్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి భారతీయులను మియన్మార్ సరిహద్దులోని సైబర్ స్కామ్ కేంద్రాలకు తరలిస్తున్న ముఠాలు కూడా బయటపడ్డాయి. అక్కడ రోజంతా ఆన్‌లైన్ మోసాలు చేయాలని బలవంతం చేస్తున్నారు. ఎదిరిస్తే దాడులు చేస్తున్నారు.
మార్చిలో సీబీఐ ఈ రాకెట్‌లో కీలక పాత్ర పోషించిన ముంబైకి చెందిన వ్యక్తిని అరెస్టు చేసింది. గత ఏడాది 283 మంది భారతీయులు, ఈ ఏడాది జనవరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 120 మందికి పైగా ఇలాంటి స్కామ్ కేంద్రాల నుంచి రక్షించబడ్డారు. అయినా ఇంకా చాలామంది అక్కడే చిక్కుకుపోయినట్లు సమాచారం. మరోవైపు మంచి జీతంతో రెస్టారెంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి థాయ్‌లాండ్‌కు తీసుకెళ్లిన ముగ్గురు భారతీయ మహిళలను బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. వారి పాస్‌పోర్టులు లాక్కొని, తప్పించుకుంటే చంపేస్తామని, కుటుంబ సభ్యులకు ఫొటోలు పంపిస్తామని బెదిరించారు. చివరకు తెలివిగా అక్కడి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో ఇద్దరు భారతీయులను అరెస్టు చేశారు.
ఫిబ్రవరిలో మరో ఇద్దరు భారతీయ పర్యాటకులను హోటల్ బయటే కిడ్నాప్ చేసి 20 లక్షల థాయ్ బాత్ పరిహారం డిమాండ్ చేశారు. బాధితుల్లో ఒకరి తల్లి డబ్బులు చెల్లించకుండా భారతీయ సంఘం ప్రతినిధులను సంప్రదించడంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
అలాగే 2025 ఏప్రిల్‌లో ఆస్ట్రియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించారు. తర్వాత థాయ్‌లాండ్‌కు తీసుకెళ్లి ముగ్గురు భారతీయులను బంధించారు. ఆ వెంటనే కుటుంబాల నుంచి డబ్బులు వసూలు చేయాలని ప్రయత్నించడంతో రంగంలోకి దిగిన పోలీసులు మరో ముఠాను కూడా అరెస్టు చేశారు. ఇక థాయ్‌లాండ్‌కు ప్రతి ఏడాది దాదాపు 25 లక్షల మంది భారతీయులు వెళ్తున్నారు. అక్కడ దాదాపు 2 లక్షల 75 వేల మంది భారతీయ మూలాలు ఉన్న ప్రజలు నివసిస్తున్నారు. కానీ ఇప్పుడు అదే దేశంలో భారతీయుల నమ్మకాన్నే ఆయుధంగా మార్చుకుని భారతీయులనే వేటాడుతున్న నేర ముఠాలు పెరుగుతుండటం తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది.
విదేశాలకు వెళ్లే ముందు ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ఉద్యోగం నిజం కాదు. చీప్ టూర్ ప్యాకేజీ అంటే ప్రతి సారి అదృష్టం కాదు. కొన్నిసార్లు అదే ఒక ఉచ్చు కూడా కావచ్చు. కాబట్టి ఆఫర్లను నమ్మే ముందు పూర్తిగా ధృవీకరించుకోండి. ఒక్క నిర్లక్ష్యం మీ కలల ప్రయాణాన్ని క్షణాల్లో పీడకలగా మార్చే ప్రమాదం ఉంది.

