El Nino: 150ఏళ్లలో తొలిసారి.. మహా విధ్వంసం తప్పదు! భయపెడుతున్న సైంటిస్టుల అంచనా

Elnino Danger Alert

Elnino Danger Alert

మనిషి ఎంత అభివృద్ధి సాధించినా ప్రకృతి ఒక్కసారి తన రూపం మార్చుకుంటే ప్రపంచమే వణికిపోతుంది. ఇప్పుడు ప్రపంచ వాతావరణ శాస్త్రవేత్తలను నిద్రపోనివ్వకుండా చేస్తున్న ఒక వార్త వెలుగులోకి వచ్చింది. 2026 నుంచి 2027 వరకు ఏర్పడబోయే ఎల్‌నినో గత 150 సంవత్సరాల చరిత్రలోనే అత్యంత శక్తివంతమైనదిగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఈ అంచనాలు నిజమైతే భారత్‌తో పాటు ప్రపంచంలోని అనేక దేశాలు తీవ్ర ఎండలు, కరవు, వరదలు, పంటల నష్టం, సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదల లాంటి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ముఖ్యంగా భారత్‌ వ్యవసాయానికి ప్రాణాధారమైన నైరుతి రుతుపవనాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఎల్‌నినో అంటే ఏంటి?

సాధారణంగా ప్రశాంత మహాసముద్రంలోని మధ్య భాగం, తూర్పు భాగంలోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగినప్పుడు ఆ పరిస్థితిని ఎల్‌నినో అంటారు. ఈ మార్పు కేవలం సముద్రానికే పరిమితం కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశను, వర్షాల తీరును కూడా పూర్తిగా మార్చేస్తుంది.

అందుకే ఎల్‌నినో ఏర్పడిన సంవత్సరాల్లో కొన్ని దేశాల్లో తీవ్రమైన కరువు వస్తే మరికొన్ని ప్రాంతాల్లో భారీ వరదలు సంభవిస్తాయి. భూమి మొత్తం వాతావరణ వ్యవస్థను ప్రభావితం చేసే అత్యంత కీలక సహజ ప్రక్రియల్లో ఇది కూడా ఒకటి. ఈసారి పరిస్థితి మరింత భయంకరంగా కనిపిస్తోంది. అమెరికాకు చెందిన వాతావరణ శాస్త్రవేత్త జీక్ హౌస్ ఫాదర్ విశ్లేషణ కీలక విషయాలను బయటకు తెచ్చింది.

ప్రపంచంలోని ప్రముఖ వాతావరణ అంచనా కేంద్రాల నుంచి వచ్చిన 14 అత్యాధునిక సీజనల్ క్లైమేట్ మోడళ్లను ఆయన విశ్లేషించారు. మొత్తం 667 అంచనాలను పరిశీలించిన తర్వాత ఆయన చెప్పిన వివరాలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇప్పటివరకు అత్యంత శక్తివంతమైన ఎల్‌నినోగా గుర్తింపు పొందిన 1997 నుంచి 1998 మధ్య జరిగిన ఘటనను, అలాగే 2015 నుంచి 2016 మధ్య నమోదైన రికార్డులను ఈసారి ఎల్‌నినో చాలా పెద్ద తేడాతో దాటిపోతుందని ఆయన చెబుతున్నారు.

నినో 3.4 చుట్టూ ఏం జరుగుతోంది?

శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ప్రశాంత మహాసముద్రంలోని కీలక ప్రాంతంగా భావించే నినో 3 పాయింట్ 4 ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 3.6 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు నమోదైన అత్యధిక రికార్డు 2015 నుంచి 2016 ఎల్‌నినో సమయంలో 2.75 డిగ్రీల సెల్సియస్ మాత్రమే. అంటే ఈసారి దాదాపు 0.8 డిగ్రీల వరకు అదనంగా పెరిగే అవకాశం ఉందని అంచనా.

ఇది ఎంత పెద్ద మార్పో అర్థం చేసుకోవాలంటే మరో విషయం తెలుసుకోవాలి. 1877 నుంచి ఇప్పటి వరకు నమోదైన అత్యంత బలమైన ఎల్‌నినోకు 5వ స్థానంలో ఉన్న ఎల్‌నినోకు మధ్య తేడా కేవలం 0.5 డిగ్రీల సెల్సియస్ మాత్రమే. కానీ ఈసారి ఆ తేడాకంటే ఎక్కువ ఉష్ణోగ్రత పెరుగుదల ఒక్కసారిగా కనిపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంకో విషయం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా ఎల్‌నినో నెమ్మదిగా బలపడుతుంది. కానీ 2026 ఎల్‌నినో మాత్రం ఇప్పటివరకు చరిత్రలో చూడని వేగంతో బలపడుతోంది.

ఇప్పటివరకు అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ఎల్‌నినోగా పరిగణించిన 1997 ఘటనను కూడా ఇది దాటేస్తోందని విశ్లేషణలో తేలింది. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2026 ప్రారంభంలో పరిస్థితులు లా నినా వైపు ఉన్నప్పటికీ చాలా తక్కువ సమయంలోనే అవి అత్యంత శక్తివంతమైన ఎల్‌నినోగా మారడం ప్రారంభించాయి. ఇది శాస్త్రవేత్తలను సైతం విస్మయానికి గురి చేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న వాతావరణ నమూనాల్లో దాదాపు 91 శాతం ఈసారి వచ్చే ఎల్‌నినో 2015 నుంచి 2016 రికార్డును దాటుతుందని స్పష్టంగా చెబుతున్నాయి. అంచనాల్లో కనిష్ట స్థాయిలో ఉన్న నమూనాలు కూడా గత రికార్డును సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా చూపిస్తున్నాయి.

మరో ప్రత్యేక ప్రమాణమైన రిలేటివ్ ఓషనిక్ నినో ఇండెక్స్ ప్రకారం కూడా 77శాతం నమూనాలు ఇదే చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన ఎల్‌నినో అవుతుందని సూచిస్తున్నాయి. వాతావరణ అంచనాల్లో ఇంత పెద్ద స్థాయిలో అన్ని నమూనాలు ఒకే నిర్ణయానికి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ అంచనాలు నిజమైతే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావాలు కనిపించే అవకాశం ఉంది. అనేక దేశాల్లో చరిత్రలోనే అత్యంత తీవ్రమైన వేడి గాలులు వీచే ఛాన్స్ ఉంది.

కొన్ని ప్రాంతాల్లో నెలల తరబడి వర్షాలు లేక కరువు పరిస్థితులు ఏర్పడవచ్చు. మరికొన్ని దేశాల్లో ఒక్కసారిగా భారీ వర్షాలు కురిసి వరదలు విరుచుకుపడవచ్చు. వ్యవసాయ రంగానికి భారీ దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. సముద్రాల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల చేపల వనరులు దెబ్బతినే అవకాశం ఉంది. సముద్ర జీవవ్యవస్థపై కూడా తీవ్రమైన ప్రభావం పడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారత్‌ విషయానికి వస్తే పరిస్థితి మరింత ఆందోళనకరంగా కనిపిస్తోంది. సాధారణంగా బలమైన ఎల్‌నినో ఏర్పడిన సంవత్సరాల్లో నైరుతి రుతుపవనాలు బలహీనపడతాయి. హిందూ మహాసముద్రం నుంచి భారత్ వైపు వచ్చే తేమ తగ్గిపోవడంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉంటుంది.

వర్షాలు తగ్గితే వరి పత్తి, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, చెరకు వంటి పంటలపై తీవ్ర ప్రభావం పడుతుంది. జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గే ప్రమాదం ఉంటుంది. తాగునీటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. విద్యుత్ ఉత్పత్తి నుంచి ఆహార భద్రత వరకు అనేక రంగాలపై దీని ప్రభావం కనిపించవచ్చు. అయితే ఎల్‌నినో ఒక్కటే వర్షాలను నిర్ణయించదని ఇతర వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ ఉష్ణోగ్రతలు ఇప్పటికే మానవ కార్యకలాపాల వల్ల ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి.

ఇలాంటి సమయంలో ఈ గాడ్జిల్లా ఎల్‌నినో కూడా కలిస్తే 2023, 2024 సంవత్సరాల్లో నమోదైన రికార్డు స్థాయి వేడి కంటే ఇంకా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాతావరణ శాస్త్రవేత్తలు ఈ పరిణామాలను క్షణక్షణం పరిశీలిస్తున్నారు. ప్రజలకు ఎప్పటికి అప్పుడు అప్‌డేట్స్ ఇస్తున్నారు.