China Caste System: ప్రపంచానికి తిరుగులేని మ్యానుఫ్యాక్చరింగ్ పవర్‌హౌస్, గ్లోబల్ ఎకానమీలో రెండో స్థానం, పైగా సోషలిస్ట్ సమానత్వం అంటూ నినదించే కమ్యూనిస్ట్ పార్టీ పాలన.. ఇదీ చైనా అనగానే గుర్తొచ్చే చిత్రం. అయితే, ఆడంబరాల ఈ తెర వెనుక ఒక సరికొత్త, ఊహించని చర్చ సోషల్ మీడియాలో హీటెక్కిస్తోంది. అదే చైనాలో కూడా కుల వ్యవస్థ అంశం. ఈ చర్చ వినడానికి వింతగా అనిపించినా, విశ్లేషిస్తే మాత్రం ఆసక్తికరమైన నిజాలు బయటపడ్డాయి. ముఖ్యంగా భారతదేశంలో చైనా సామాజిక వర్గీకరణను ఇక్కడి కుల వ్యవస్థతో పోల్చుతుండగా, చైనా మాత్రం ఇది కేవలం ఆర్థిక, పరిపాలనాపరమైన విభజన మాత్రమేనని కొట్టిపారేస్తోంది. మరి ఈ వివాదంలో అసలు వాస్తవాలు ఏంటి? చైనా సమాజంలో అంతర్గతంగా దాగున్న ఆ విభజన రేఖల వెనుక కథేంటో చూద్దాం.
‘హుకౌ’ వ్యవస్థ..
ఈ వివాదాన్ని అర్థం చేసుకోవాలంటే మనం చైనా చరిత్రలో రెండు వేర్వేరు వ్యవస్థలను పరిశీలించాల్సి ఉంటుంది. ఒకటి చైనా ప్రాచీన సామ్రాజ్య కాలానికి చెందిన ‘షి-నాంగ్-గాంగ్-షాంగ్’ (Shi-Nong-Gong-Shang) వృత్తి ఆధారిత వర్గీకరణ. రెండు నేటి ఆధునిక చైనాను శాసిస్తున్న ‘హుకౌ’ (Hukou) గృహ నమోదు విధానం. భారతదేశంలోని వర్ణ వ్యవస్థ తరహాలోనే ప్రాచీన చైనాలో జౌ రాజవంశం, హాన్ రాజవంశాల కాలం నుంచి సమాజాన్ని నాలుగు వర్గాలుగా విభజించారు. సమాజానికి నైతికత, పరిపాలనను అందించే విద్యావంతులు అధికారులు (షి) అగ్రస్థానంలో ఉంటే.. ప్రజల ఆకలి తీర్చే రైతులు (నాంగ్) రెండో స్థానానికి పరిమితం చేశారు. మరోవైపు, నైపుణ్యంతో వస్తువులను తయారుచేసే కళాకారులు (గాంగ్) మూడో స్థానంలో నిలిచారు. ఇక కేవలం లాభాపేక్షతో వ్యాపారం చేసే వర్తకులను (షాంగ్) కాన్ఫుషియస్ సిద్ధాంతాల ప్రకారం సమాజంలో చివరి స్థానంలో ఉంచారు. అయితే, చరిత్రకారులు దీనిని కుల వ్యవస్థగా అంగీకరించరు. ఎందుకంటే ఇది పుట్టుకతో వచ్చేది కాదు, కేవలం వృత్తిపరమైన వర్గీకరణ మాత్రమే. ఒక వ్యాపారి కుమారుడు చదువుకుని, ఇంపీరియల్ పరీక్షలు పాసైతే అగ్రస్థానంలో ఉన్న అధికారిగా మారే అవకాశం ఉండేది. అంటే ఇక్కడ సామాజిక మార్పు, ఎదుగుదలకు ఆస్కారం ఉండేది.
వారసత్వంగా మారిన హుకౌ హోదా..
కానీ, అసలైన సమస్య ఆధునిక చైనా తీసుకొచ్చిన ‘హుకౌ’ వ్యవస్థతో మొదలైంది. కమ్యూనిస్ట్ విప్లవం తర్వాత, 1950ల కాలంలో మావో జెడాంగ్ ప్రభుత్వం ఈ హుకౌ విధానాన్ని పటిష్టం చేసింది. ఇది ఒక రకమైన అంతర్గత పాస్‌పోర్ట్ లాంటిది. దీని ప్రకారం చైనా పౌరులను పుట్టుకతోనే గ్రామీణ హుకౌ, పట్టణ హుకౌ అని రెండు వర్గాలుగా విభజిస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. 1959 నుంచి ఈ హుకౌ హోదా వారసత్వంగా మారింది. దీంతో ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టిన వ్యక్తి ఎంత కష్టపడినా పట్టణ పౌరుడికి లభించే హక్కులను పొందడం అసాధ్యంగా మారింది. ప్రముఖ రచయిత అరవిందన్ నీలకందన్ తన పుస్తకం ‘ఎ సోషల్ ధార్మిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా’లో ప్రస్తావించినట్లు… కమ్యూనిస్ట్ చైనా సమానత్వాన్ని తీసుకురావడానికి బదులు, పుట్టుక ఆధారిత హక్కులను కల్పిస్తూ ఈ హుకౌ ద్వారా సరికొత్త సామాజిక అసమానతలను సృష్టించింది. ఆంత్రోపాలజిస్టులు సులామిత్ పాటర్, జాక్ పాటర్ కూడా దీనిని గ్రామీణ, పట్టణ ప్రజల మధ్య ఉన్న ఒక కులాల వంటి అడ్డుగోడగా అభివర్ణించారు.
పౌరుల జీవితాలను శాసించే స్థాయికి..
ఈ హుకౌ కేవలం కాగితాలకే పరిమితం కాలేదు. అది చైనా పౌరుల జీవితాలను శాసిస్తోంది. పట్టణ హుకౌ ఉన్నవారికి నాణ్యమైన విద్య, అత్యుత్తమ వైద్యం, పెన్షన్లు, ప్రభుత్వ ఉద్యోగాలు, రాయితీలతో కూడిన గృహ వసతి వంటి ఎన్నో సదుపాయాలు లభిస్తాయి. కానీ గ్రామీణ హుకౌ ఉన్నవారు నగరాలకు వలస వచ్చినా, వారికి ఈ సదుపాయాలు అందవు. వారు అత్యంత ప్రమాదకరమైన, తక్కువ వేతనాలకే పరిమితం కావాల్సి వస్తోంది. అందుకే చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ (షెన్‌జెన్) ప్రెసిడెన్షియల్ ఛైర్ ప్రొఫెసర్ తన పరిశోధనా పత్రంలో దీనిని నేరుగా అర్బన్ కాస్ట్ సిస్టమ్ (పట్టణ కుల వ్యవస్థ) అని సంబోధించారు. సోవియట్ మోడల్ ఆధారంగా పరిశ్రమల అభివృద్ధి కోసం గ్రామీణ వనరులను, రైతుల శ్రమను చైనా ప్రభుత్వం దోచుకుందని, దీనివల్ల చైనాలో ఒకే దేశం-రెండు వర్గాలుగా విడిపోయిందని అంతర్జాతీయ పత్రిక ‘డిప్లొమాటిక్ కొరియర్’ సైతం విశ్లేషించింది. కేవలం ఆర్థిక పరంగానే కాకుండా, పట్టణ ప్రజలు గ్రామీణ వలసదారులను తక్కువ చేసి చూసే సామాజిక వివక్షకు సైతం ఇది కారణమైంది.
అయితే, ఈ విమర్శలను చైనా ప్రజలు, అక్కడి మేధావులు తీవ్రంగా ఖండిస్తున్నారు. భారతదేశానికి చెందిన నెటిజన్లు తమ దేశంలో ఉన్న కుల వ్యవస్థ కోణంలోంచే చైనాను చూస్తున్నారని వారు వాదిస్తున్నారు. పీకింగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జాంగ్ యివు వంటి వారు మాట్లాడుతూ, ప్రాచీన వృత్తి వర్గీకరణను లేదా హుకౌను కుల వ్యవస్థతో పోల్చడం హాస్యాస్పదమని, భారతదేశానికి చైనా చరిత్రపై కనీస అవగాహన లేకపోవడమే దీనికి కారణమని విమర్శిస్తున్నారు. ‘ది హిందూ’ పత్రిక విశ్లేషణ ప్రకారం… చైనాలో హుకౌ అనేది కేవలం వలసలను నియంత్రించడానికి, సామాజిక నియంత్రణ కోసం తెచ్చిన ఒక పరిపాలనా సాధనం మాత్రమే. పైగా 2014 నుంచి చైనా ప్రభుత్వం ఈ వ్యత్యాసాలను తగ్గించడానికి, చిన్న నగరాలలో గ్రామీణ ప్రజలకు సులభంగా పట్టణ రిజిస్ట్రేషన్ కల్పించడానికి సంస్కరణలు చేపడుతోంది. అయినప్పటికీ, 2025 చివరి నాటికి చైనాలో దాదాపు 35.8 కోట్ల మంది (దేశ జనాభాలో నాలుగో వంతు) పౌరులు తమ స్వంత ప్రాంతాలను వదిలి నగరాల్లో వలసదారులుగా, హక్కుల కోసం పోరాడుతూ ‘ఫ్లోటింగ్ పాపులేషన్’గా జీవిస్తుండటం గమనార్హం.
మరి చివరగా, చైనాలో నిజంగానే కుల వ్యవస్థ ఉందా? అంటే అది మనం కులాన్ని ఎలా నిర్వచిస్తామనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి పుట్టుకను బట్టి అతని అవకాశాలు, సామాజిక హోదా, ప్రభుత్వ వనరులు అందుతాయా లేదా అని నిర్ణయించేది కుల వ్యవస్థ అనుకుంటే.. చైనా హుకౌ విధానంలో ఖచ్చితంగా ఆ కుల లక్షణాలు కనిపిస్తాయి. అయితే, కేవలం పుట్టుక మాత్రమే కాకుండా అంతర్వివాహాలు (ఎండీగామి), అంటుముట్టు-పవిత్రత వంటి నమ్మకాలు, లోతైన సాంస్కృతిక అస్తిత్వాలతో ముడిపడి ఉన్న వ్యవస్థే కులం అనుకుంటే మాత్రం చైనాలో అలాంటిది లేదు. నిజానికి, ఒకప్పుడు యూరప్‌లో ఉన్న సామాజిక క్రమాన్ని చూసి, కాస్టా (లాటిన్ భాషలో స్వచ్ఛమైన లేదా వేరు చేయబడినది) అనే పదం నుంచి బ్రిటీషర్లు భారతదేశంలోని సామాజిక స్థితికి కాస్ట్ అని పేరు పెట్టారు. చైనాలో సాంప్రదాయక కుల వివక్ష లేకపోవచ్చు, కానీ కమ్యూనిజం ముసుగులో హుకౌ వ్యవస్థ సృష్టించిన ఆధునిక ఆర్థిక, సామాజిక అడ్డుగోడలు మాత్రం చైనా సమాజాన్ని రెండుగా చీల్చాయనేది అక్షర సత్యం. దానిని కుల వ్యవస్థ అంటారా లేదా అనేది కేవలం ఒక సంప్రదాయక వాదన మాత్రమే!

