దేశాన్ని కదిలించే ఉద్యమాలు ఎప్పుడూ ఒక్కరోజులో పుట్టవు. అవి నెమ్మదిగా రూపం దిద్దుకుంటాయి. ఒక సంఘటనతో మొదలవుతాయి. మరో ఘటనతో వేగం అందుకుంటాయి. చివరికి దేశమంతా మాట్లాడుకునే చర్చగా మారిపోతాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న రిజర్వేషన్ హటావో ఉద్యమం కూడా అలాంటి ప్రయాణమే.
నీట్ పరీక్ష లీక్ గురించి జరిగిన విద్యార్థుల ఉద్యమం క్రమంగా రిజర్వేషన్లపై చర్చకు కారణమైంది. అయితే ఈ డిబెట్ ఇప్పుడు పుట్టింది కాదు.. దీని అర్థం చేసుకోవాలంటే క్యాలెండర్‌ను కొంచెం వెనక్కి తిప్పాలి.
భారత్‌లో రిజర్వేషన్లు రాజకీయాల కోసం పుట్టలేదు. శతాబ్దాలుగా కుల వివక్ష కారణంగా విద్య, ఉద్యోగాలు, అవకాశాలకు దూరమైన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన భరోసాగా అవి పుట్టాయి. సమాజంలో వెనుకబడిన వారికి ముందుకు నడిచే అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ఈ వ్యవస్థ వచ్చింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, తర్వాత ఇతర వెనుకబడిన వర్గాలకు కూడా ఈ ప్రయోజనం విస్తరించింది.
కానీ రిజర్వేషన్లు వచ్చిన రోజే మరో వాదన కూడా పుట్టింది. ప్రతిభకు ఒకే కొలమానం ఉండాలని రిజర్వేషన్ పొందని కులాలు వాదించాయి. ఇలా రెండు భిన్న స్వరాలు దశాబ్దాలుగా వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఈ ఏడాది ఆ స్వరాలు మళ్లీ ఒక్కసారిగా పెద్ద చర్చగా మారాయి. అందుకు మొదటి కారణం యూజీసీ తీసుకొచ్చిన ఈక్విటీ రెగ్యులేషన్స్. విద్యాసంస్థల్లో కుల వివక్షకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీలు, ప్రత్యేక వ్యవస్థను తీసుకురావాలని యూజీసీ ప్రతిపాదించింది. రిజర్వేషన్ కులాలు దీన్ని స్వాగతించాయి. విద్యాసంస్థలు మరింత సమానత్వ దిశగా వెళ్తాయని అభిప్రాయపడ్డాయి. కానీ జనరల్ కేటగిరీకి చెందిన కొంతమంది విద్యార్థులు మాత్రం ఈ నిబంధనలను వ్యతిరేకించాయి. ఈ రూల్స్‌ను కొందరు దుర్వినియోగం చేసుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. నిరసనలు కూడా జరిగాయి. చివరకు ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. కొన్ని నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయని వ్యాఖ్యానిస్తూ కోర్టు వాటి అమలును నిలిపివేసింది. అలా రిజర్వేషన్లపై చర్చ మళ్లీ దేశ రాజకీయాల్లోకి వచ్చింది. ఇంతలోనే మరో తుఫాను మొదలైంది. అదే నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్.
పరీక్షలపై నమ్మకం కోల్పోయిన విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ ఉద్యమానికి కేంద్రంగా మారింది. సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో మొదలైన ప్రచారం దేశవ్యాప్తంగా యువతను ఒక్క వేదికపైకి తీసుకొచ్చింది. వారి ప్రధాన డిమాండ్ ఒక్కటే. పరీక్షల వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. చివరకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఆ ఉద్యమం తన లక్ష్యాన్ని సాధించినట్టే కనిపించింది. కానీ ఉద్యమం ముగిసిన చోటే మరో ఉద్యమం మొదలైంది.
రిజర్వేషన్ హటావో ఆందోళన్ పేరుతో సోషల్ మీడియాలో కొత్త ప్రచారం మొదలైంది. కొద్ది రోజుల్లోనే లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించింది. సీజేపీ సోషల్ మీడియా వ్యూహాన్నే అనుసరిస్తూ వైరల్ వీడియోలు, పోస్టులు, ప్రచారంతో ఈ ఉద్యమం వేగంగా విస్తరించింది. అక్కడి నుంచి చర్చ పూర్తిగా మారిపోయింది. నీట్ పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చినా ప్రభుత్వ సీటు రాలేదని చెబుతున్న విద్యార్థుల వీడియోలు వైరల్ అయ్యాయి. జనరల్ కేటగిరీ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని కొందరు వాదించారు. కులాల ఆధారంగా కాకుండా ఆర్థిక పరిస్థితిని బట్టి రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ చర్చను మరింత ముందుకు తీసుకెళ్లిన వారిలో రచయిత ఆనంద్ రంగనాథన్ ఒకరు. రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేయాల్సిన అవసరం లేదని, కానీ ఒకే కుటుంబానికి తరతరాలుగా కాకుండా ఒక్క తరం వరకే రిజర్వేషన్లు పరిమితం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. అలా చేస్తే అదే వర్గంలో నిజంగా వెనుకబడిన కుటుంబాలకు అవకాశం దక్కుతుందని చెప్పారు. మరోవైపు హర్ష్ దూబే అనే నీట్ అభ్యర్థి ఒక టీవీ చర్చలో భావోద్వేగంతో మాట్లాడిన వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. మంచి మార్కులు వచ్చినా ప్రభుత్వ మెడికల్ సీటు రాలేదని చెబుతూ ఆయన రిజర్వేషన్ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తారు. ఆ వీడియో సోషల్ మీడియాలో లక్షలాది మంది మధ్య కొత్త చర్చకు దారితీసింది.
బ్రాహ్మిన్ జీన్స్ పేరుతో సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన అనురాధ తివారి కూడా ఈ ఉద్యమానికి బహిరంగ మద్దతు ప్రకటించారు. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల నిరసనల్లో రిజర్వేషన్ అంశాన్ని కూడా లేవనెత్తాలని జనరల్ కేటగిరీ విద్యార్థులకు పిలుపునిచ్చారు.
కులాల ఆధారిత రిజర్వేషన్ల స్థానంలో ఆర్థిక ప్రమాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఇక కొందరు ఆర్థిక నిపుణులు, వ్యాపారవేత్తలు కూడా ఈ చర్చలో చేరారు. మెడికల్ ప్రవేశాల్లో కటాఫ్ మార్కుల మధ్య భారీ తేడాలపై స్పందించిన ప్రముఖ వ్యాపారవేత్త మోహన్‌దాస్.. రిజర్వేషన్ సిస్టమ్ విద్యార్థుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోందని అభిప్రాయపడ్డారు. అయితే ఇదే సమయంలో మరో బలమైన వాదన కూడా వినిపించింది. రిజర్వేషన్ అనేది పేదరిక నిర్మూలన పథకం కాదని, శతాబ్దాలుగా జరిగిన కుల వివక్షకు రాజ్యాంగం ఇచ్చిన పరిష్కారమని దళిత సంఘాలు, ఆదివాసీ సంస్థలు, ఇతర వెనుకబడిన వర్గాల ప్రతినిధులు స్పష్టం చేశారు. కుల వివక్ష ఇంకా పూర్తిగా ముగియలేదని, అలాంటప్పుడు కేవలం ఆర్థిక ప్రమాణాల ఆధారంగా వ్యవస్థను మార్చడం చారిత్రక అన్యాయాన్ని విస్మరించడమే అవుతుందని వారు వాదిస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో రిజర్వేషన్లను సామాజిక న్యాయం సాధించే రాజ్యాంగ సాధనంగా సమర్థించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు దేశం మరోసారి అదే ప్రశ్న ముందు నిలబడి ఉంది.రిజర్వేషన్లు సమానత్వానికి వంతెనా? లేదా ప్రతిభకు అడ్డుగోడనా…? ఈ ప్రశ్నకు సమాధానం రాజకీయ పార్టీల దగ్గర కూడా లేదు.
ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కుల సమీకరణాలే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయి. అందుకే ఈ అంశంపై బహిరంగంగా ఒకవైపు నిలబడటానికి ఏ పార్టీ కూడా సాహసం చేయడం లేదు. ఇలా ఒక పేపర్ లీక్‌తో మొదలైన కథ… ఇప్పుడు రాజ్యాంగం, సామాజిక న్యాయం, ప్రతిభ, సమాన అవకాశాలు, రాజకీయాలు అన్నీ కలిసిన జాతీయ చర్చగా మారిపోయింది.

