Antarctica: రక్త జలపాత రహస్యం.. 100ఏళ్ల మిస్టరీ వీడింది!

Red Blood Falls

Red Blood Falls

Explainer: ప్రపంచంలో అత్యంత శీతల ఖండం అంటార్కిటికా. అక్కడ అంతటా తెల్లటి మంచు కొండలే కనిపిస్తాయి. కానీ ఆ మంచు పర్వతాల మధ్య నుంచి హఠాత్తుగా రక్తం లాంటి ఎర్రటి నీరు జలపాతంలా ప్రవహిస్తే ఎలా ఉంటుంది? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ ! గత వందేళ్లకు పైగా శాస్త్రవేత్తలను సైతం తలపట్టుకునేలా చేసిన ఈ బ్లడ్ ఫాల్స్ రహస్యాన్ని పరిశోధకులు ఎట్టకేలకు ఛేదించారు. అసలు ఆ మంచు కొండల నుంచి రక్తం ఎందుకు కారుతోంది? దాని వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటి?

ఈ రక్త జలపాతం ఎక్కడుంది?

అంటార్కిటికాలోని మెక్‌ముర్డో డ్రై వ్యాలీస్‌లో టేలర్ గ్లేసియర్ ఉంది. ఈ మంచు పర్వతం నుంచి లేక్ బాన్నీలోకి ప్రవహించే ఎర్రటి జలపాతాన్ని బ్లడ్ ఫాల్స్ అని పిలుస్తారు. చూసేందుకు ఇది నిజంగానే రక్తం లాగా కనిపిస్తుంది. 1911లో ఆస్ట్రేలియాకు చెందిన భూగర్భ శాస్త్రవేత్త గ్రిఫిత్ టేలర్ దీనిని మొదటిసారి కనుగొన్నారు. అప్పటి నుంచి ఈ ఎర్రటి నీటి ప్రవాహం వెనుక ఉన్న కారణాలపై ఎన్నో రకాల ఊహాగానాలు నడిచాయి. వందేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, పరిశోధకులు దీని వెనుక ఉన్న అసలైన నిజాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు.

ఈ జలపాతంలో ప్రవహిస్తున్నది రక్తం కాదు, అలాగే దీనికి ఎలాంటి అగ్నిపర్వత క్రియలతోనూ సంబంధం లేదు. ఇది పూర్తిగా ఇనుముతో కూడిన ఉప్పు నీరని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఇటీవల అంటార్కిటికా సైన్స్ పత్రికలో దీనికి సంబంధించిన పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. ఈ మంచు కొండ కింద చాలా కాలం క్రితం ఏర్పడిన ఒక పురాతన భూగర్భ ఉప్పునీటి నిల్వ ఉంది. మంచు పర్వతం కదిలేటప్పుడు ఏర్పడే విపరీతమైన ఒత్తిడి వల్ల, ఆ నీరు లోపల ఉన్న రహస్య మార్గాల ద్వారా పైకి తన్నుకుంటూ వస్తుంది.

ఎర్ర రంగుకు కారణమేంటి?

భూగర్భంలో ఉన్నంత సేపు సాధారణంగానే ఉండే ఈ నీరు, బయటకు రాగానే ఎర్రగా మారుతుంది. లోపలి నుంచి వచ్చిన ఇనుముతో కూడిన నీరు బయట ఉన్న గాలితో కలిసినప్పుడు ఒక రసాయన ప్రక్రియ జరుగుతుంది. నీటిలోని ఇనుము, గాలిలోని ఆక్సిజన్ కలిసి ఐరన్ ఆక్సైడ్‌గా రూపాంతరం చెందుతాయి. మనం నిత్య జీవితంలో చూసే ఇనుము తుప్పు పట్టే విధానం కూడా ఇదే. ఈ ఆక్సీకరణ ప్రక్రియ వల్లే ఆ నీటికి అంతటి దట్టమైన ఎరుపు-గోధుమ రంగు వస్తుంది.

మంచు కొండ లోపల ఈ నీరు ఎలా ప్రయాణిస్తుందనే విషయంపై 2017లోనే ఆధారాలు లభించాయి. యూనివర్సిటీ ఆఫ్ అలాస్కా ఫెయిర్‌బ్యాంక్స్ పరిశోధకులు రాడార్ ఇమేజింగ్ సాంకేతికతను ఉపయోగించారు. దీని సాయంతో మంచు పర్వతం కింద ఉన్న ఒత్తిడితో కూడిన కాలువల వ్యవస్థను వారు పూర్తిగా మ్యాప్ చేశారు. బ్లడ్ ఫాల్స్ రూపంలో బయటకు రావడానికి ముందు, ఈ ఉప్పునీరు మంచు కొండ లోపల దాదాపు 300 మీటర్ల రహస్య మార్గాల్లో ప్రయాణిస్తోందని వారు గుర్తించారు.

అంటార్కిటికాలో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కంటే చాలా తక్కువగా ఉంటాయి. అంతటి చలిలో కూడా ఈ నీరు గడ్డకట్టకుండా ఎలా ప్రవహిస్తుందనే ప్రశ్న అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. దీనికి కారణం ఆ నీటిలో ఉన్న విపరీతమైన ఉప్పు శాతమే. సాధారణ నీటితో పోలిస్తే ఇందులో లవణాల సాంద్రత చాలా ఎక్కువ, అందువల్ల దీని గడ్డకట్టే ఉష్ణోగ్రత స్థానం బాగా పడిపోతుంది. మంచుగా మారే క్రమంలో విడుదలయ్యే స్వల్ప ఉష్ణశక్తి తోడుకావడం వల్ల, భూమిపైనే అత్యంత శీతలమైన ఈ మంచు కొండ కింద కూడా ఈ ద్రవం గడ్డకట్టకుండా నిరంతరం ప్రవహిస్తూనే ఉంది. నిరంతర నీటి ప్రవాహం ఉన్న అత్యంత చల్లని గ్లేసియర్‌గా ఇది రికార్డు సృష్టించింది.

ఈ ఎర్రటి నీటి సరఫరాలో మరొక అద్భుతమైన రహస్యం కూడా దాగి ఉంది. ఈ పురాతన ఉప్పునీటిలో కొన్ని వింత సూక్ష్మజీవులు జీవిస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సూర్యరశ్మి, భూ వాతావరణానికి పూర్తిగా దూరంగా, లక్షలాది సంవత్సరాలుగా ఇవి ఆ మంచు కిందే బతుకుతున్నాయి. ఈ సూక్ష్మకణాలలో సిలికాన్, కాల్షియం, అల్యూమినియం, సోడియం వంటి మూలకాలు ఉన్నట్లు గుర్తించారు. ఇంతటి కఠినమైన పరిస్థితుల్లో కూడా జీవం ఎలా మనుగడ సాగించగలదో అర్థం చేసుకోవడానికి ఈ ఆవిష్కరణ ఎంతో దోహదపడుతుంది.

ఈ ఆవిష్కరణ కేవలం అంటార్కిటికా పరిశోధనలకే పరిమితం కాలేదు. అంతరిక్షంలో జీవం ఉనికిని వెతకడానికి కూడా ఇది ఒక కొత్త మార్గాన్ని చూపిస్తోంది. మన సౌర కుటుంబంలోని అంగారక గ్రహం, బృహస్పతి ఉపగ్రహమైన యూరోపా వంటి మంచు లోకాల కింద కూడా ఇలాంటి ఉప్పునీటి వాతావరణం ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బ్లడ్ ఫాల్స్ రహస్యం వీడినా… విశ్వంలో జీవం ఉనికిని.. మంచు లోకాల అంతరంగాన్ని అర్థం చేసుకోవడానికి పరిశోధకులకు ఇది ఇప్పటికీ ఒక అమూల్యమైన ప్రయోగశాలగా నిలుస్తోంది.