AI: ఏఐ తీసుకొస్తున్న భారీ ముప్పు.. నెలల్లోనే అంతా స్మాష్‌..?

Ai Big Warning

Ai Big Warning

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. మన పనులను ఎంత సులభం చేస్తుందో.. అంతే స్థాయిలో ప్రమాదాలను కూడా వెంట తీసుకొస్తోంది. భవిష్యత్తులో పెద్ద ఎత్తున సైబర్ దాడులు పెరగొచ్చని.. కొత్త ముప్పులను ఎదుర్కోవడానికి ఇంకా చాలా సమయం ఉందని ఇప్పటిదాకా మనం భావించాం. అయితే ప్రపంచ అగ్రగామి ఇంటెలిజెన్స్ సంస్థలు మాత్రం తాజాగా ఒక సంచలన హెచ్చరిక జారీ చేశాయి. సైబర్ సెక్యూరిటీ ముప్పు ముంచుకొచ్చేందుకు సంవత్సరాలు కాదు.. కేవలం కొన్ని నెలల సమయం మాత్రమే ఉందని వార్నింగ్ ఇస్తున్నాయి. ఇంతకీ ఏఐ తీసుకొస్తున్న ఆ ముప్పు ఏంటి?

ఫైవ్‌ ఐస్‌ అంటే ఏంటి?

అమెరికా.. బ్రిటన్.. ఆస్ట్రేలియా.. కెనడా.. న్యూజిలాండ్ దేశాల ఇంటెలిజెన్స్ సంస్థల కూటమిని ‘ఫైవ్ ఐస్’ అంటారు. ఈ కూటమి తాజాగా సైబర్ సెక్యూరిటీపై తీవ్రస్థాయిలో స్పందించింది. రాబోయే తరానికి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సరికొత్త రూపు దాల్చబోతోందని.. ఈ పరిణామం సైబర్ సెక్యూరిటీ రంగాన్ని ఊహించని విధంగా మార్చేస్తుందని ఈ కౌన్సిల్ హెచ్చరించింది. త్వరలో రాబోతున్న అడ్వాన్స్‌డ్ ఏఐ మోడల్స్ వల్ల ఎదురయ్యే ముప్పును అంచనా వేయాలని ప్రభుత్వాలు.. కార్పొరేట్ సంస్థలకు సూచించింది. ఏఐ కారణంగా రాబోయే దాడుల తీవ్రతను చూసేందుకు ఏళ్ల కొద్దీ సమయం పట్టదని.. కేవలం కొద్ది నెలల్లోనే ఈ పెను మార్పులు చూస్తామని స్పష్టం చేసింది. ఫ్రాంటియర్ ఏఐ మోడల్స్… పరిశ్రమ అంచనాల కంటే చాలా వేగంగా అడ్వాన్స్ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇటీవల అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఈ హెచ్చరికలకు బలం చేకూరుస్తోంది. ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఆంత్రోపిక్ డెవలప్ చేసిన రెండు అడ్వాన్స్‌డ్ ఏఐ సిస్టమ్స్‌కు విదేశీయుల యాక్సెస్ కట్ చేస్తూ ట్రంప్ సర్కార్ ఆంక్షలు విధించింది. అమెరికన్ భద్రతా సంస్థల సలహా మేరకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏఐ రాకతో సైబర్ దాడుల వేగం.., స్థాయి విపరీతంగా పెరిగిపోయాయి. ఒక వ్యవస్థలో ఉన్న లోపాన్ని గుర్తించడానికి.. దానిపై దాడి చేయడానికి మధ్య ఉన్న సమయం చాలా వరకు తగ్గిపోతోంది. సైబర్ నేరగాళ్లు ఆధునిక టెక్నాలజీతో ఏ స్థాయిలో దాడులు చేస్తారో ఊహించడం కూడా కష్టంగా మారుతోంది. రక్షణాత్మక చర్యలకు ఏఐ ఉపయోగపడుతున్నప్పటికీ.. దాడి చేసే టెక్నిక్స్‌ను కూడా అంతే స్థాయిలో పెంచుతోంది.

×
×
Ad

సైబర్ సెక్యూరిటీని ఇకపై కేవలం ఒక టెక్నికల్ సమస్యగా చూడకూడదని ఫైవ్ ఐస్ కూటమి తేల్చి చెప్పింది. ఇది నేరుగా కోర్ బిజినెస్ రిస్క్‌కు సంబంధించిన వ్యవహారమని.. సంస్థల నాయకత్వం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. సంస్థలలోని సైబర్ సెక్యూరిటీ బృందాలకు పూర్తి అధికారాలు.. తగిన వనరులు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. కేవలం పేపర్లకే పరిమితం కాకుండా.. రియల్ వరల్డ్‌లో దాడులు జరిగినప్పుడు దీటుగా ఎదుర్కొనేలా ప్రాక్టికల్ చర్యలు చేపట్టాలి. ప్రారంభ దశ నుంచే సెక్యూర్-బై-డిజైన్, సెక్యూర్-బై-డిఫాల్ట్ పద్ధతులను తప్పనిసరిగా పాటించాలి. ఏదో ఒక టెక్నాలజీపై పూర్తిగా ఆధారపడకుండా.. లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా భవిష్యత్తు ముప్పును సమర్థవంతంగా అడ్డుకోవచ్చు.

సైబర్‌ దాడులను ఎలా ఎదుర్కొవాలి?

భవిష్యత్తులో సైబర్ దాడులను ఎదుర్కోవాలంటే కేవలం ప్రభుత్వాలు.. సంస్థలు మాత్రమే కాదు.. మొత్తం సమాజం కలిసికట్టుగా స్పందించాలి. మనం తీసుకునే రక్షణ చర్యలు… సైబర్ అంచనాలు నెలల వ్యవధిలోనే పాతబడిపోయే ప్రమాదం పొంచి ఉంది. ముప్పు తలెత్తక ముందే మేల్కొంటేనే సంస్థల మనుగడ సాధ్యమవుతుంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్న సైబర్ దాడులను తట్టుకునేలా భద్రతా ప్రమాణాలను నిరంతరం సమీక్షించుకోవాలి. కేవలం సామర్థ్యం పెంచుకోవడానికే కాకుండా భద్రతను పటిష్టం చేసుకోవడానికి ఏఐని వాడాలి. అత్యంత వేగంగా మారుతున్న ఈ సైబర్ ప్రపంచంలో.. ముందుచూపుతో వ్యవహరించిన వారు మాత్రమే సురక్షితంగా నిలబడగలుగుతారని ఫైవ్ ఐస్ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది.