NTV Telugu Site icon

Rupee Effect on Foreign Education: రూపాయి విలువ పతనం.. భారతీయ విద్యార్థులకు భారం..

Rupee Effect On Foreign Education

Rupee Effect On Foreign Education

Rupee Effect on Foreign Education: డాలర్‌తో పోల్చితే మన కరెన్సీ రూపాయి మారకం విలువ రోజురోజుకీ క్షీణిస్తోంది. తాజాగా 82 రూపాయలకు చేరువైంది. దీనికితోడు ద్రవ్యోల్బణం పెరగటం వల్ల ఈ ప్రభావం దాదాపు అన్ని రంగాలపైన చూపుతోంది. దీంతో సాధారణ ప్రజల నుంచి సంపన్నుల వరకు ఏదైనా ఖర్చు చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సించాల్సిన పరిస్థితి నెలకొంది. దిగుమతులు, పర్యటనలు.. ఇలా అన్నీ పెనుభారంగా మారాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏడాది వ్యవధిలో 75 నుంచి 82కు తగ్గింది.

ఈ నేపథ్యంలో ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు తమ పిల్లలను పంపించిన తల్లిదండ్రుల పరిస్థితులు వర్ణణాతీతంగా మారాయి. కూడబెట్టుకున్న సొమ్ముకు తోడు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాలకు పంపారు. ఇప్పుడు డాలర్ విలువ భారీగా పెరగడంతో అక్కడ చెల్లించాల్సిన ఫీజులు మోయలేనంత భారంగా తయారయ్యాయి. ఇండియా నుంచి ఏటా 20 లక్షల మంది ఉన్నత చదువుల కోసం విదేశాలకు ప్రయాణమవుతుంటారు. ఇప్పుడు వీళ్లంతా అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే వాళ్లు జీవనం కోసం ఖర్చు చేసేది, ఫీజులు చెల్లించేది డాలర్లలోనే.

RJUKT 2022 Results: ఆర్‌జేయూకేటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.. వారిదే పైచేయి

ఆ డాలర్లను రూపాయిలతోనే మారకం చేసుకోవాల్సి ఉంటుంది. అమెరికాలో ఎంఎస్ చేయాలంటే 50 నుంచి 60 వేల డాలర్లు ఖర్చవుతోంది. ఏడాది వ్యవధిలో డాలర్ విలువ రూ.7 పెరగడం వల్ల ఒక్కో విద్యార్థిపై రూ.4 నుంచి రూ.5 లక్షల భారం పడుతోంది. కొత్తగా అమెరికా వెళ్దామనుకునేవాళ్లు ఖర్చు భారీగా పెరుగుతుండటంతో తమ అడ్మిషన్లను వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చింది. విదేశీ ప్రయాణాల చార్జీలు కూడా భారీగా పెరిగిపోయాయి. గతేడాది అమెరికాకు ఒక వైపు ప్రయాణానికి ఎయిర్ లైన్ చార్జీ రూ.50 వేల వరకు ఉంటే అదిప్పుడు రూ.లక్ష అయింది. రూపాయి విలువ మరింత పడిపోతుందని అంటున్నారు. దీంతో భారతీయ విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు.