Digital Campus on Google Cloud: మేడ్చల్ జిల్లా మైసమ్మ గూడలో మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ భాగస్వామ్యంలో “డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్” ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన ద్వారా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా మల్లారెడ్డి గ్రూప్, గూగుల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోవడం భారతదేశంలోనే అతి పెద్ద డిజిటల్ భాగస్వామ్యంగా నిలిచింది. దీని ద్వారా సుమారు 50,000 మంది విద్యార్థులకు రాబోయే రోజుల్లో సాంకేతిక నైపుణ్యాలు, AI ఆధారిత విద్యా పద్ధతులు, ప్రపంచస్థాయి సర్టిఫికేషన్‌లు అందించబడతాయి. ఈ డిజిటల్ క్యాంపస్ హైదరాబాద్ లోని మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూషన్స్ క్యాంపస్ లో ఏర్పాటు చేయబడింది.
ప్రారంభోత్సవ వేడుకలో 50,000 మంది విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ముఖ్య ఆకర్షణగా గూగుల్ లోగోతో ఉన్న 50,000 బెలూన్లు ఆకాశంలోకి ఎగరవేయబడ్డాయి. ఇది ఈ చారిత్రాత్మక డిజిటల్ భాగస్వామ్యానికి ప్రత్యేకతను చేకూర్చింది. విద్యార్థులు, అధ్యాపకులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, గూగుల్ సంస్థ నుండి వైభవ్ కుమార్ శ్రీవాస్తవ (ఇండియా హెడ్ – ఎడ్యుకేషన్ & ఎడ్‌టెక్స్), సిద్ధార్థ్ దల్వాడి (దక్షిణ భారత హెడ్ – ఎడ్యుకేషన్ & ఎడ్‌టెక్స్), మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూషన్స్ అధినేత చామకూర మల్లారెడ్డి, చైర్మన్ డా. చామకూర భద్రారెడ్డి, వైస్ చైర్మన్ డా. ప్రీతీ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
