ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలకు అంతూపొంతూ ఉండడం లేదు. పరాయి వారిపై మోజు ఎక్కడివరకైనా తీసుకెళ్తోంది. వారిపై ఉన్న మోజు వారినే చంపుతోంది.. చివరకు కట్టుకున్నవారికి, కన్నా బిడ్డలకు కడుపుకోతను మిగులుస్తుంది. తాజాగా ఒక మహిళ, తనకన్న 14 ఏళ్ల చిన్నవాడితో ఎఫైర్ పెట్టుకొని, అటు భర్తతో, ఇటు ప్రియుడితో కలిసి ఉండలేక ప్రియుడితో పాటు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.
వివరాలలోకి వెళితే.. కడప జిల్లా రాజంపేట మండలం లక్కిరెడ్డిపల్లికి చెందిన నాగేంద్ర (21) అనే యువకుడు, రుక్మిణి (35) అనే మహిళ అడవిలో అనుమాస్పదంగా మృతి చెందారు. ఇద్దరు చెట్టుకు వురి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఈ జంట ఆత్మహత్యలకు కారణం వివాహేతర సంబంధమేనని స్థానికులు తెలుపుతున్నారు. రుక్మిణి గతకొన్ని రోజులుగా నాగేంద్ర అనే యువకుడుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో వారు ప్రియుడు నుంచి వేరు చేస్తారేమోనన్న భయంతో ప్రియుడితో పాటు అడవికి వచ్చి ఈ దారుణ నిర్ణయం తీసుకొని ఉంటుందని తెలుపుతున్నారు. ఇదే అనుమానాన్ని పోలీసులకు సైతం వివరించడంతో ఆ కోణంలోనే పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
