Site icon NTV Telugu

Mother-Son Case Mystery: తల్లికొడుకుల హత్య.. హంతకుల్ని పట్టించిన వీడియో కాల్

Video Call Myster Case

Video Call Myster Case

Vizag Police Solve Mother-Son Mystery Case With Help of Video Call: అత్యంత సాధారణ జీవితం గడుపుతున్న తల్లికొడుకు.. తమ వద్ద లక్షలున్నాయని గొప్పలకు పోయి, తమ చావుని కొని తెచ్చుకున్నారు. బాగా ఆస్తి ఉన్న వాళ్లేమో అని ఇద్దరు వ్యక్తులు భావించి, వారిని చంపేసి ఆ డబ్బుల్ని కాజేయాలని చూశారు. ప్లాన్ ప్రకారం చంపారు కానీ, వాళ్ల వద్ద ఏమీ లేదని తెలిసి ఖంగుతిన్నారు. అనంతరం పోలీసులకు పట్టుపడకుండా పారిపోయారు. పోలీసులకు పెద్ద సవాలుగా మారిన ఈ కేసు, ఎట్టకేలకు ఒక వీడియో కాల్ ఆధారంగా చేధించారు. పరారైన ఆ ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకోగలిగారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

విశాఖ నగరం దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనాబాద్‌లో ఎం. గౌరమ్మ (52), ఆమె కుమారుడు పోలారెడ్డి నివసిస్తున్నారు. ఓ మద్యం దుకాణం వద్ద వీళ్లు ఆహార పదార్థాల్ని అమ్మేవారు. ఈ క్రమంలో వాళ్లకు చైతన్య, కిశోర్‌బాబు పరిచయం అయ్యారు. మద్యం తాగడానికి వచ్చినప్పుడల్లా.. ఆ తల్లికొడుకులతో వాళ్లిద్దరు మాట్లాడుతుంటేవారు. ఈ నేపథ్యంలోనే గౌరమ్మ తన వద్ద రూ. 30 లక్షలు ఉన్నాయని, బంగారు నగలు కూడా ఉన్నాయని చెప్పింది. తాము ఓ ఇంటిని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా తెలిపింది. ఆమె మాటలు నిజమేనని చైతన్య, కిశోర్‌బాబు అనుకున్నారు. దీంతో.. వాళ్లు మత్తుమందు ఇచ్చి, డబ్బు కాజేయాలని చూశారు. ఆ ప్లాన్ బెడిసికొట్టింది. చివరికి తల్లికొడుకుల్ని హతమార్చి, డబ్బులు దోచుకోవాలని పథకం రచించారు.

ఒకరోజు పోలారెడ్డి ఇంటికి వెళ్లి మందు తాగాలని ప్లాన్ వేశారు. గౌరమ్మ మద్యం దుకాణం వద్దే ఉండగా.. పోలారెడ్డితో కలిసి చైతన్య, కిశోర్ బాబు రెండు బుల్లెట్ వాహనాల్లో ఇంటికి వెళ్లారు. అక్కడికి వెళ్లగానే పోలారెడ్డి హతమార్చారు. అదే సమయంలో కొడుక్కి భోజనం ఇద్దామని వచ్చిన గౌరమ్మని సైతం చంపేశారు. అనంతరం ఇంట్లో డబ్బుల కోసం వెతకగా.. వారికి రూ. 2 వేలు మాత్రమే దొరికాయి. అలాగే.. బంగారం అనుకొని రోల్డ్‌గోల్డ్ ఆభరణాలు పట్టుకుని చెన్నై పారిపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. తొలుత గౌరమ్మ చిన్నకోడలిపై అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం ఆమెకు ఈ హత్యలతో సంబంధం లేదని తేలింది. మరి, ఎవరు హత్య చేశారా? అని పోలీసులు ఆలోచిస్తున్న తరుణంలో.. వాళ్లకు ఒక క్లూ దొరికింది.

ఈ హత్యలు జరిగే ముందు.. మస్కట్‌లో ఉన్న గౌరమ్మ కుమార్తె, తన సోదరుడు పోలారెడ్డితో వీడియో కాల్ మాట్లాడింది. అప్పుడు ఫోన్ కట్ కావడంతో, పక్కనే ఉన్న చైతన్య ఫోన్ తీసుకొని, సోదరికి పోలారెడ్డి ఫోన్ చేశాడు. ఆ సమయంలో చైతన్య, కిశోర్‌లను సైతం పరిచయం చేశాడు. ఆ వీడియో కాల్ మాట్లాడాకే.. తల్లికొడుకుల్ని చంపి ఆ ఇద్దరు పరారయ్యాడు. మస్కట్ నుంచి గౌరమ్మ కూతురు వచ్చాక, ఆ వీడియో కాల్ గురించి పోలీసులకు తెలిపింది. చిన్నకోడలు సైతం రెండు బుల్లెట్ వాహనాలు వచ్చినట్టు చెప్పింది. ఈ క్లూస్ ఆధారంగా హత్య చేసింది వారేనని నిర్ధారించుకున్నారు. చెన్నై నుంచి చైతన్మ, కిశోర్ తిరిగి వస్తుండగా.. వాళ్లను అరెస్ట్ చేశారు.

Exit mobile version