Udaipur: భార్యను దారుణ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు
ఉదయపూర్‌లో భార్యను దారుణంగా హత్య చేసిన కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడు కిషన్‌లాల్ అలియాస్ కిషన్‌దాస్‌కు మరణశిక్షతో పాటు రూ. 50,000 జరిమానా , ఒక సంవత్సరం కఠిన జైలు శిక్ష విధించింది. నిందితుడు తన భార్యను లక్ష్మి హత్యచేయడమే కాకుండా, మొత్తం మానవాళిని కూడా సిగ్గుపడేలా చేశాడని కోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. నిందితుడిని చనిపోయే వరకు ఉరితీయాలని తీర్పుని వెల్లడించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే….
2017 జూన్ 24 రాత్రి, 12 గంటల ప్రాంతంలో, ఆ జంట నిద్రపోతున్నప్పుడు, కిషన్‌లాల్ తన భార్యకు తాను ఆమెను అందంగా తీర్చిదిద్దే మందు తెచ్చానని చెప్పాడు. లక్ష్మి ఆ ద్రవాన్ని వాసన చూడగానే, అది యాసిడ్ వాసన వచ్చింది. కానీ తన భర్తను సంతోషపెట్టడానికి, ఆమె తన బట్టలు విప్పి, ఆ ద్రవాన్ని ఆమె శరీరంపై పూసుకుంది. దీని తర్వాత, కిషన్‌లాల్ ఒక అగరుబత్తిని వెలిగించి ఆమె వద్దకు తీసుకువచ్చాడు, దీనితో లక్ష్మి శరీరం కాలిపోయింది. ఇది మాత్రమే కాకుండా, అతను సీసాలో మిగిలిన ద్రవాన్ని కూడా ఆమె శరీరంపై పోశాడు. దీంతో మంటలు ఎక్కువై పూర్తిగా కాలిపోయింది లక్ష్మీ. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమె చనిపోయే ముందు జరిగిన మొత్తం సంఘటనను మేజిస్ట్రేట్ ముందు వివరించి చనిపోయింది. నిందితుడి చర్య సమాజానికి దిగ్భ్రాంతికరమైనదని, ఏ నాగరిక సమాజంలోనూ ఊహించలేమని కోర్టు తెలిపింది. నిందితుడిని క్షమించడం లేదా సంస్కరించడం సమర్థనీయం కాదని న్యాయమూర్తి అన్నారు.
