NTV Telugu Site icon

Matrimonial frauds: మ్యాట్రిమోనీ మోసం.. ఏకంగా 50 మంది మహిళల ట్రాప్..

Matrimonial Frauds

Matrimonial Frauds

Matrimonial frauds: మ్యాట్రిమోనీ మోసాలు పెరిగిపోతున్నాయి. తమను తాము ఉన్నత ఉద్యోగినని, ప్రభుత్వ అధికారి అని నమ్మిస్తూ మహిళల్ని మోసం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 50 మంది మహిళల్ని ట్రాప్ చేశాడు ఓ కేటుగాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. నిందితుడు 38 ఏళ్ల ముఖీమ్ ఖాన్‌కి అప్పటికే వివాహమై, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతను ఆరు రాష్ట్రాల్లో 50 మందికి పైగా మహిళల్ని మోసం చేశాడు.

మ్యాట్రిమోనీ సైట్లలో అనేక నకిలీ ప్రొఫైళ్లను క్రియేట్ చేసి, తాను హోం మంత్రిత్వ శాఖలో సీనియర్ అధికారిగా చెప్పుకుంటూ, కల్పిత కథలు చెబుతూ పలువురు మహిళల్ని ఆకర్షించాడు. ఈ బాధితుల్లో ఉత్తర ప్రదేశ్‌కి చెందిన ఓ మహిళా న్యాయ అధికారి కూడా ఉన్నారు. బలహీనమైన మహిళల భావోద్వేగాలను ఆసరాగా చేసుకుని మోసానికి పాల్పడే వాడు. మహిళల్ని నమ్మించేందుకు కొన్ని నెలల పాటు అతను ఓపికగా తన ప్లాన్ అమలు చేసే వాడు.

Read Also: Modi’s US Visit 2014: ‘నా తల్లి ఇల్లు మీ కారుతో సమానం’..10ఏళ్ల ముందు ఒబామాకు మోడీ చెప్పిన మాట

ముఖ్యంగా వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళల్నే టార్గెట్ చేసేవాడు. తన భార్య చనిపోయిందని, కుమార్తెకు ఆర్థిక సాయం కోసం కష్టపడుతున్న తండ్రిగా బిల్డప్ ఇచ్చే వాడు. మహిళల్ని ముగ్గులోకి దించి ముకీమ్ మ్యారేజ్ ప్లాన్ కూడా రూపొందించేవాడు. ఆభరణాలు, ప్రయాణాలకు నకిలీ బిల్లులను కూడా తయారు చేసుకునే వాడు. వీటి ఖర్చుల కోసం బాధితురాళ్లు నిందితుడు ఎలాగో ఒప్పించేవాడు. చివరకు పెళ్లికి ముందే ఓ బైక్ కొనిచ్చేలా బాధిరాలని మోసం చేశాడు. ఆ తర్వాత బైక్‌తో ఉడాయించాడు. ఫిర్యాదులు వస్తున్నప్పటికీ, గత కొన్నేళ్లుగా ముకీమ్ పట్టుబడకుండా తప్పించుకున్నాడు. చివరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో ఇతడి ఆచూకీని పోలీసులు గుర్తించి, అరెస్ట్ చేశారు.